ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, ఏప్రిల్ 2015, బుధవారం

క్రౌంచ కంఠం (కధ)

                                (ఏప్రియల్ 2015 "తెలుగు వెలుగు" మాసపత్రికలో ప్రచురితం)                                      

మగత! నా ఒళ్ళంతా ఒకటే మగత! మరిగే రక్తం ఆకాశగంగలా ఒళ్ళంతా పరుగులెడితే దాని ఉనికికి ప్రమాదమని మగతకు తెలుసు.అందుకే నా నరనరాల్లో ఇంకిపోయి,ఇరుక్కుపోయి రుధిరగమనానికి అడ్డం పడుతుంది.
పక్కరూం నుండి ప్రసాద్ గాడి కేకలు వినబడుతున్నాయి. ఈరోజు వాడికి మళ్ళీ కరెంట్ షాక్ ట్రీట్మెంట్ పెట్టినట్లున్నారు. షాకులేవో నాకు ఇచ్చినా బాగుండేది. ఒంటికి పట్టిన జడత్వపు నివురును విదిలించుకుని ఫీనిక్స్ పక్షిలా పైకి లేచే వాడిని.
"మిస్టర్ వాల్మీకి !" కోకిల కంఠం సిస్టర్ రామలక్ష్మిదే! సుశ్రావ్యస్వరం ఒక ఆత్మీయ స్పర్శను కూడా తోడుతెచ్చుకుంది.
"కళ్ళు తెరవండి వాల్మీకి" - తెరిచాను.
"ఎలా ఉన్నారు?" - ఆమె ప్రశ్న.
"ఇలా ఉన్నాను" - నా సమాధానం.
"ఆకలి వేస్తుందా?" - ఆమె సందేహం.
"వేస్తుంది. విశ్వంలో ఉన్న మగతనంతా మింగేయాలన్నంత ఆకలి"- నా బదులు పిచ్చివాగుడులా తోచింది ఆమెకు.
"నిద్ర పడుతుందా?" ప్రశ్నలో విసుగుతో ఆమె.
"పడుతుంది. గాఢ సుప్తావస్థలో జోగుతున్న బద్దకస్తుల మత్తు ఝలిపించే నిర్ణిద్ర" - చిన్ముద్ర ముసుగులో నేను.
"ఇలా మాట్లాడబట్టే నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించారు మీ వాళ్ళు" సిస్టర్ రామలక్ష్మి మాటల్లో సానుభూతి నాకు నచ్చలేదు.
"ఏం? ఇక్కడ ఏం తక్కువైంది నాకు?"
"నీలాంటి తెలివైన వాడు పిచ్చివాళ్ళ మధ్య ఇక్కడ ఉండకూడదు వాల్మీకి"
"లఘుమతులకు అర్ధంకాని ఊర్ధ్వగతిని చేరుకున్న తెలివి పేరే పిచ్చి"
"సర్లే... నీ మాటలు నీకు తప్ప ఎవరికీ అర్ధంకావుగానీ...అలా కాసేపు వాకింగ్ చేద్దాం పద", నన్ను కదిలించే ప్రయత్నం చేసింది.
"ఇలా చెప్పే... ఇంట్లో ఉన్న నన్ను తెచ్చి ఇక్కడ జాయిన్ చేసారు"
"నీతో నేను నెగ్గగలనా ? సరే.. నిజం చెప్పేస్తున్నా..కాసేపట్లో డాక్టర్ వల్లభ రౌండ్స్ కి వస్తారు. కొంచెం ముఖం కడుక్కుని తేరుకున్నట్లు కనిపిస్తే, నీకు రేపటికి డిస్చార్జ్ అడుగుతాను"
"మీరు డిస్చార్జ్ చేసినా, నేను బయటకు వెళ్తే నన్ను మళ్ళీ ఇక్కడ చేర్పిస్తారు" నిర్ధారణగా చెప్పాను.
"ఎందుకు?"
"ఎందుకంటే నిజం చెప్తాను కనుక"
"ఏంటా నిజం?"
"నువ్వు నమ్ముతానంటే చెప్తాను"
"చెప్పు"
"బయటకు వెళితే నాకు రోజూ కొన్ని వేలసార్లు క్రౌంచపక్షి కంఠస్వరం వినబడుతుంది"
"తెలుగులో మాట్లాడు నాయనా"
"ఇది తెలుగే"
"నాకు అర్ధమయ్యే ఇంగ్లీషు కలిసిన తెలుగులో మాట్లాడు బాబూ... నాది అసలే ఇంగ్లీషు మీడియం చదువు"
"తెలుగు మీడియంలో చదివితే ఇంగ్లీష్ రాదు"
"మరి ఇంగ్లీష్ మీడియంలో చదివితే?"
"తెలుగూ రాదు... ఇంగ్లీషూ రాదు"
"హా!హా!హా!" ఆమెది నవ్వు కాదు...తరగలెత్తిన పరాగాల నురగ!
"ఇంతకీ క్రౌంచపక్షి అంటే ఏంటో చెప్పలేదు" మళ్ళీ ఆమె కల్పించుకుంటూ అడిగింది.
"నీకు రామాయణం గురించి తెలుసునంటే చెప్తాను
"వద్దు బాబూ.. ఇక నిన్నేమీ అడగను. అయినా ఈ మధ్యన వినబడ్డట్లు నాకు చెప్పనేలేదే!" - నా కేసేంటో తెలియనట్లు అడిగింది. ఆమెకు విషయం తెలుసని నాకు తెలిసినా మళ్ళీ చెప్పనారంభించాను.
"హాస్పిటల్లో ఉంటే వినబడదు. బయటకు వెళ్తే, సమాజంలో కలతిరిగితే వినబడుతుంది"
"ఎందుకు?"
"అన్నీ నాకు తెలిస్తే ఇక మీరెందుకు? అది చెప్పాల్సింది మీరు" నా నుదుటి నరాలు హరితవర్ణ రేఖలుగా మారాయి. ఇంతలో ఎక్కడ నుంచో టకటకమన్న బూట్ల సడి ద్వారా డాక్టర్ వల్లభ రాకను పసిగట్టి నెమ్మదిగా మాట్లాడమన్నట్లు సైగ చేసింది నాసికపై నిలుచున్న ఆమె చూపుడువేలు.
తలుపు తెరుచుకున్న సడికి నా చూపు, దిశను మార్చుకున్న క్షిపణిలా మరలి డాక్టర్ వల్లభ అనబడే ముప్పై ఐదేళ్ళ వ్యక్తి మీద ఆగింది. ఎప్పుడూ చూసే వ్యక్తే అయినా ప్రతీరోజూ ప్రత్యేకంగా కనిపించడమే వల్లభ ప్రత్యేకత. అతడంటే నాకు భయం లాంటి గౌరవం. గౌరవంతో మిలితమైన భయం.
"హౌ ఆర్ యూ మిష్టర్ వాల్మీకి?" అని అడిగాడు డాక్టర్ వల్లభ. ఏమని సమాధానం చెప్పను? అసాంఘిక కార్యకలాపాలకు ప్రతిస్పందించలేకుండా ఉండగలగడం ఆరోగ్యవంతుని లక్షణమైతే నేనూ ఆరోగ్యవంతుడ్నే! అదే చెప్పాను.
" నో దట్ యూ ఆర్ హెల్దీ. మీకు పక్షుల శబ్దాలేవో వినిపించేవి కదూ, ఇక్కడ వైద్యం చేయించుకున్నాక తగ్గాయా?"
"పూర్తిగా వినబడడం మానేసాయి డాక్టర్"
"ఏబ్సల్యూట్లీ నో ప్రోబ్లెం దెన్. రేపటికి డిస్చార్జ్ రాసేస్తాను" అంటూ జేబులోంచి పెన్ను తీసి కాగితం మీద ఉరికించాడు.
"నేను బయటకు వెళ్తే నాకు మళ్ళీ శబ్దాలు వినిపిస్తాయేమోనన్న భయం డాక్టర్"- ఎంతటి వాడైనా డాక్టర్ ముందు భయపడాల్సిందే కదా! నేను కూడా అందుకు మినహాయింపేమీ కాను.
"నా భయానికి అతడి నవ్వే సమాధానమయ్యింది. శీతల మారుత స్పర్శకు తన్మయత్వంతో తలలెగరేసుకుంటూ నిలబడ్డ నందనవనంలా ఉందా నవ్వు.
"అంతా మీ భ్రమ! అనవసర భయాలేవీ పెట్టుకోకుండా ఆత్మవిశ్వాసంతో మెలగండి"
"కానీ... నాకు శబ్దాలు వినబడడానికి గల కారణాలు తెలుసుకోవాలనుంది డాక్టర్" - అభ్యర్ధిస్తున్నప్పుడు నా మాట ఇంతటి మృదుత్వాన్ని సంతరించుకుంటుందని నాకు కూడా తెలియదు.
"వాల్మీకి.. ఇక విషయాన్ని మర్చిపోండి. ఇక నుండి మీకు శబ్దాలు వినబడవు.వినబడకూడదు. అలా అని మిమ్మల్ని మీరే హిప్నటైజ్ చేసుకోండి! ధ్యానం, వ్యాయామం, పుస్తకపఠనంలాంటి మంచి అలవాట్ల ద్వార మీ దృష్టిని మరల్చడానికి ప్రయత్నించండి" వాక్యాలను విన్న తర్వాత మెల్లగా శబ్ద తీవ్రతను తగ్గించుకుంటూ పోతున్న అతడి బూట్ల 'టక టక ' ధ్వని తప్ప వేరే ఏం వినబడలేదు. రామలక్ష్మి కూడా 'టక టక ' ను అనుసరించింది.. నాకు ఏకాంతాన్ని ప్రసాదిస్తూ.
ఒక్కడ్నే ఉండటం నాకు నచ్చదు. అందుకే ఏకాంతాన్ని తోడుపెట్టుకుని కిటికీ వారగా కూర్చున్నాను. కిటికీ నుండి సాగర తీరపు అందాలను తమలో ఇముడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి నా కళ్ళు. కెరటాల చేతులతో నల్ల రాళ్ళ దేహాలను తనివితీరా తడుముతున్న సముద్రం మధ్య మధ్యలో చేతులు పైకెత్తి ఎవరినో రారమ్మని పిలుస్తుంది. బహుశా నన్నేనేమో ! రేపట్నుంచి నేను స్వతంత్రుడ్ని అవుతాను.
అప్పుడా కెరటాలతో కరచాలనం చేస్తాను. సాయంత్రం వేళ అస్తమించే సూర్యుడితో పాటుగా నేనూ సముద్రంలో దూకుతాను. కడలి కటిసీమపై పడవనై పారాడతాను.
"ఆగు..ఆగు" అన్నది నాలో అంతర్గతంగా మ్రోగిన నాదం.
"ఎందుకీ ఆరాటం ? శోధించావా క్రౌంచస్వరానికి మూలం?" మళ్ళీ పారింది అదే అంతర్వాణి...అంతర్వాహిణిలా.
"శోధనలేమితో వెలివేయబడ్డ జవాబు పేరే ప్రశ్న.. పొగచూరుకుపోయిందా నీలో నిత్యాన్వేష తృష్ణ?" తన ప్రశ్నల రీతి తరంగోద్ధతిని తలపించింది.
అవరోధం వెక్కిరిస్తే మోకరిల్లదు పౌరుషం. అది మరింత జ్వలిస్తుంది. రగిలే తపనే మయూఘమై మెరుగులద్దుకుంటుంది.
కళ్ళు మూసుకున్నాను.
"తమసోమా జ్యోతిర్గమయా" మంత్రం పఠించాను. తమస్సు నుండి ఉషస్సులోనికి నడపమని అంతస్సుని వేడుకున్నాను.
మొట్టమొదటగా క్రౌంచ కంఠం ఎప్పుడు వినబడిందోనని మెదడుపొరలు దులిపి చూసాను. విస్మృతసత్యాన్వేషణ సులువు కాదు. అనుభూతులను చిత్రికపట్టాలి.జ్ఞాపకాలను మధించాలి!మధించాను.ఛేదించాను.
గుర్తొచ్చింది!
ఆరోజు ఢిల్లీలో క్రొవొత్తుల ప్రదర్శన. అది ప్రదర్శన కాదు నిరసన! నేనుసైతం ప్రపంచాగ్నికి ఆహుతిచ్చిన సమిధనయ్యాను.
"దేనికా నిరసన?" అని నన్ను నేను ప్రశ్నించుకుంటే గుర్తొచ్చిన పేరు ' నిర్భయ '.
అవును. ' నిర్భయ '.అసలు పేరు తెలియని నిర్భయహస్తిన కబంధ హస్తాల్లో అస్తవ్యస్తమైన నిర్భయ. రెండేళ్ళ క్రితం నిర్భయ. వెయ్యేళ్ళగా నిర్దయ ! ఎన్నాళ్ళనుండో నిర్దాక్షిణ్యంగా అణచి వేయబడుతున్నా రెండేళ్ళ క్రితమే జాతి గుర్తించిన నిర్భయ. గుర్తించినంతసేపైనా గుర్తుపెట్టుకోలేని వ్యవస్థ మస్తిష్కంలో కర్పూరమై కరిగిపోయిన నిర్భయ. మనుష్యుల మధ్య మనలేక సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా నింగికెగసిన నిర్భయ*.
ఆనాడు వినిపించిందా క్రౌంచ కంఠం
కీంకారణ్యంలో క్రేంకారంలా. ఆరని శోకానికి ఆకారంలా.
అరిచిందా క్రౌంచ కంఠం...
పడగలెత్తిన పురుష ఫూత్కారానికి బదులైన ఘీంకారంలా.
ఏడ్చిందా క్రౌంచ కంఠం...
సహభ్రాతృత్వ ధర్మానికి తిలోదకాలిచ్చిన సైంధవానుజుల దాష్టీకానికి ఎలుగెత్తి.
మూల్గిందా క్రౌంచ కంఠం...
అగాధంలో తన అడుగులు పూడ్చుకున్న విశ్వమానవతత్వానికి విసుగెత్తి.
అదే రొద తీగ సాగింది అనాదిగా ప్రోదికాబడ్డ అతివల అణచివేతకు ఆదిస్వరమై.
నాటి నుండి కొన్ని వేల క్రౌంచపక్షులు తమ గొంతులను సవరించుకున్నాయి. కాదు కాదు.. కొన్ని వేల నిర్భయుల దౌర్బల్య నాదాలు నాలో పలికించుకున్నాయి.
తత్వం బోధపడ్డాక కళ్ళు తెరిచాను.
"ఎస్! ఇది నిజం. ఇదే నిజం" సారి మనసులో కాకుండా బయటకు అనుకున్నాను.
నాకు సమీపంగా ఉన్న ఆడవాళ్ళపై అకృత్యాలు జరిగినప్పుడల్లా నాకు క్రౌంచకంఠ స్వరం వినిపించేదన్నమాట ! ఇంత చిన్న విషయం కూడా అంతుపట్టని వెర్రివాడిని !
అంటే...రేపు హాస్పిటల్ కాంపౌండ్ దాటిన వెంటనే అసభ్య సమాజంలోనికి ప్రవేశిస్తాను. అక్కడ నాలాంటి పిచ్చివాళ్ళెవరూ ఉండరు. ఉండేది మామూలు ఆడవారు, మగవారనబడే కొందరు మదోన్మత్తులు. అణచివేతకు ఒగ్గని అబల తల పక్షుల రోదలా మళ్ళీ నా చెవిలో మ్రోగక తప్పదు!
నిద్ర బరువును మోయలేక నా కళ్ళు మూతబడ్డాయి.
                                                **********
డాక్టర్ రూం!
పేషంట్ కుర్చీలో నేను.
ఎదురుగా డాక్టర్ కుర్చీలో వల్లభ. పక్కనే నిలబడ్డ రామలక్ష్మి.
"మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు వాల్మీకి ! ఇకపై మీకు మళ్ళీ సమస్య రాకూడదని ఆశిస్తున్నాను" నన్ను పిచ్చాసుపత్రి నుండి డిస్చార్జ్ చేయవలసిందిగా ఆదేశిస్తూ ఉన్న పత్రంపై డాక్టర్ వల్లభ సంతకం పెడుతున్నాడు.
"వస్తుంది" అని అతడితో చెప్పాలనిపించినా మిన్నకుండిపోయాను.
"ఏంటి? ఏదో ఆలోచిస్తున్నారు? కొంపదీసి మళ్ళీ మీకు శబ్దాలు వినబడుతున్నాయని చెప్తారా ఏంటి? హా! హా! హా!" - నవ్వాడు వల్లభ. నవ్వు అంతకు ముందులా మనోహరంగా లేదు. శ్రుతి తప్పిన ప్రతిమధ్యమంలా వికృతంగా ధ్వనించింది.
"యస్ డాక్టర్! వినిపించింది. దానికి కారణం ఏంటో కూడా అర్ధమయ్యింది."
"ఏంటి?"
"ఎప్పుడూ వెల్లువొచ్చిన గౌతమిలా నీలంగా,నిర్మలంగా ఉండే రామలక్ష్మి కంట్లో 'ఎర్రటి జీర 'ను అడుగు చెప్తుంది."
అపరాధ భావనతో వల్లభ, దుఃఖం తో రామలక్ష్మి చూసిన నేల చూపులు పాతాళాన్ని తాకాయి.
                                                **************
క్రౌంచ పక్షులకు ఒక విజ్ఞాపన. మీ రోదన నా ఒక్కడికి వినిపించి లాభం లేదు. నాలాంటి కొన్ని వేలమందికి వినిపించండి. ముఖ్యంగా మీ ఇంట్లోవాళ్ళకు, మీ దగ్గరివాళ్ళ కర్ణాంతరాలలో మీ వేదన పలికించడానికి వెరవకండి. ఎందుకంటే వందలో నేను ఒక్కడిని. మందలో మద మాతంగ బలుడ్ని!
           
Weblink for the above story :-

http://ramojifoundation.org/flipbook/201504/magazine.html#/16











3 కామెంట్‌లు: