ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, జులై 2015, సోమవారం

అడగని ప్రశ్న (కధ)


(ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం జులై 12, 2015 ప్రచురితం)



అది… పేరుకు పెద్ద ప్రాధాన్యత లేని ఒకానొక ఊరి రైల్వే స్టేషన్ !
నాకు నచ్చని పేరు పెట్టుకున్న రైలు, ప్లాట్ ఫాం మీద ఆగింది.
రైల్లో ఎంత మంది ఉన్నారో చూద్దామని ప్రయత్నిస్తే... లోపలికి చొరబడేంత జాగా తమకు లేదంటూ నా కనుచూపులు వెనక్కి వచ్చి, నా కంట్లోనే గుచ్చుకున్నాయి. మన దేశంలో రైలు అంటే పుష్పక విమానం ! ఎంత మంది ఎక్కినా ఇంకొకడికి ఖాళీ ఉంటుంది. నా చూపులు చెయ్యలేని పనిని నాతో పాటు స్టేషన్లో రైలు ఎక్కిన వారందరం దిగ్విజయంగా పూర్తి చేసాం.
నేను ఎక్కగానే రైలు కదిలింది. కంపార్ట్ మెంట్ ఎంట్రన్స్ దగ్గరనుండి నేను రిజర్వేషన్ చేయించుకున్న బెర్త్ వరకు వెళ్ళడానికి పావుగంట పట్టింది. చూసే కళ్ళుండాలే గానీ పావుగంట లో మనకి భారతదేశం మొత్తం కనబడుతుంది. భారతీయులు ఎంత సోషలిస్టిక్ గా ఉండగలరో చెప్పడానికి రైలు ప్రయాణాన్ని మించిన ఉదాహరణ ఇంకొకటి ఉంటుందా ?
నేను ఊహించినట్లే నా బెర్తులో ఎవరో నలుగురు కూర్చున్నారు. వాళ్ళలో ఒకడు చూడ్డానికి రైతులా దిట్టంగా ఉన్నాడు. అది నా బెర్తు అని వాడితో చెప్పి పైకి లెమ్మన్నాను. వాడు నన్ను టికెట్ చూపించవలసిందిగా అడిగాడు.
ఎప్పుడో చదువుకుని వదిలేసిన లా చదువు నాలోని లాయర్ ని నిద్ర లేపింది. "టికెట్ లేకుండా ప్రయాణం చేసే ప్రతి అడ్డమైన వాడికి టికెట్ చూపించి నాకు రిజర్వేషన్ ఉందని నిరూపించుకునే ఖర్మ నాకు పట్టలేదు" అని కోపంతో ఊగిపోయాను. నా కోపానికి భయపడ్డట్లున్నాడు... లేచి సైడ్ బెర్త్ లో ఉన్న ఇద్దరి పక్కన ఇరుక్కున్నాడు. నేను నా బెర్తులో కుదురుకున్నాను.

"మాస్టారు... మీ గ్రహస్థితి బాగున్నట్లుగా లేదు. మీ మానసిక అశాంతికి కారణం అదే అయ్యుంటుంది" అని అందుకున్నాడు నా ఎదురుగా కూర్చున్న వ్యక్తి. చూడబోతే అతనికి కొంచం జ్యోతిష్యం తెలిసినట్లుంది. నేను రైలు ఎక్కిందికదులుతున్న రైలు నుండి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి అని కూడా గ్రహించగలిగేంత ప్రజ్ఞ ఇతడికి ఉండి ఉంటుందా ?
మళ్ళీ అతడే అందుకున్నాడు... "నాకు హస్త సాముద్రికంలో మంచి ప్రావీణ్యం ఉంది. మీ చెయ్యి ఇటు ఇవ్వండి, మీ అశాంతికి కారణం చెబుతాను" అని అంటూనే నా చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. నేను ఎక్కడ పుట్టిందీ, ఎలా పెరిగిందీ మొదలుకొని నా చదువు, ఉద్యోగం, భార్యా, పిల్లలు... ఒకటనేవిటి ! జరిగిన ప్రతి విషయం దండగుచ్చినట్లు చెప్పాడు.
"గత అయిదు సంవత్సరాలుగా శని మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు బాగా అప్పుల్లో కూరుకు పోయి ఉంటారు. అవునా ?" అని అడిగి, నేను మర్చిపోలేని నా అప్పుల్ని మళ్ళీ గుర్తు చేసాడు.
అక్షరాలా ఆరు లక్షల రూపాయల అప్పు! సన్నకారు రైతులకు రుణమాఫీ చేసినట్లుగా నాకు కూడా ఎవరైనా రుణమాఫీ చేస్తే ఇలా చావాల్సిన ఖర్మ పట్టుండేది కాదు !
"మీరు చెప్పకపోయినా మీ చేయి చూస్తుంటే తెలుస్తుంది లెండి.. మీ దరిద్రానికి తోడు మిమ్మల్ని గురుడు వెంబడిస్తున్నాడు" – గురుడు కాదు, నేను బాకీ పడ్డగోల్డ్ మైన్ బ్యాంకు’ లోన్ రికవరీ ఆఫీసరు వెంబడిస్తున్నాడు. మొదట్లో మర్యాదగా మాట్లాడినా.. ఆరు నెలలుగా ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోయేసరికి నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. ఇన్సాల్వెన్సీ పెట్టి ఉన్న పళ్ళూడగొట్టుకోలేను ! ఇంకో పది రోజుల్లో నేను అప్పు తీర్చకపోతే నా ఇంటిని జప్తు చేయిస్తానన్నాడు. అలా అవమానంతో రోడ్డున పడేకంటే ఇలా రైలు నుండి కింద పడితే చేసిన అప్పు మాఫీ అయిపోతుంది, ఆత్మహత్యగా కాకుండా ప్రమాదవశాత్తు రైలు నుండి పడిపోయినట్లు నమ్మించగలిగితే ఇన్సురెన్సు, రైల్వే వారు ప్రకటించే ఎక్స్ గ్రేషియా కలిపి వచ్చిన డబ్బుతో నా కుటుంబం సుఖంగా బ్రతక వచ్చు కదా !
"మీరు ఢబ్బై మూడేళ్ళు ఖచ్చితంగా బ్రతుకుతారు సార్" అని జ్యోతిష్యుడు చెప్పేసరికి ఒక్కసారిగా నాకు చెమట్లుపోసాయి. వీళ్ళేదు ! అనుకున్న ప్రకారం నేను రోజు చనిపోవలసిందే ! కంపార్ట్ మెంట్ ఎంట్రన్స్ డోర్ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. రైలు వేగంగా పరిగెడుతున్న చప్పుడు వినిపిస్తుంది. అది నేనున్న రైలు చప్పుడో, నా గుండెల్లో పరిగెడుతున్న రైలు చప్పుడో పోల్చుకోవడం కష్టంగా ఉంది. “కళ్ళు తిరుగుతున్నట్లుగా నటించి అలా... అలా... అవతలికి ఒరిగిపోతే... !!! “ అని అనుకుంటుండగా రైలు నెమ్మదించింది.
"ఎవరో చెయిన్ లాగినట్లున్నారు" -అన్నారెవరో. రెండు నిమిషాల్లో రైలు ఆగింది. ఇందాక నేను కూర్చున్న బెర్త్ చుట్టూ జనం మూగి ఉన్నారు. అక్కడే ఎవరో చెయిన్ లాగినట్లున్నారు ! నాకు మృత్యుభంగం కలిగించినది ఎవరో తెలుసుకుందామన్న కోరిక నాకు లేక పోయినా, నా అనుమతి లేకుండా నా కాళ్ళు అటు కదిలాయి. చుట్టూ జనం గుమిగూడి ఉన్నా మాత్రం తత్తరపాటు లేకుండా నిలబడి ఉన్నాడు అతడు. అతడే.. చెయిన్ లాగిన వాడు.. నా బెర్త్ లో కూర్చుని నన్ను టికెట్ చూపించమన్న వాడు!
ఇంతలో టి.టి. వచ్చాడు.
"ఎందుకయ్యా చెయిన్ లాగావు?" అక్కడ వాతావరణం చూసి ఎవరు చెయిన్ లాగి ఉంటారో టి.టి కి అర్ధమైంది.
"రైలు ఆపడానికి" -అది తనకు అలవాటైన పనిలా చెప్పాడు.
"ఏంటి వెటకారమా? ఫైన్ కట్టు"
"ఎందుకు ? వెటకారం ఆడినందుకా ?"
"రైలు ఆపినందుకు"
"నా రైలు నేను ఆపితే నీకొచ్చిన నొప్పేంటి ?" అప్పటి వరకు యధాలాపంగా ఏదో దిక్కులో ఉన్న మా తలలన్నిటినీ ఒక్క సమాధానంతో అతడి వైపు తిప్పుకున్నాడు.
"నీ రైలా ? ఏం బాబూ... పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వస్తున్నావా ?" గుంపు నుండి మోగింది మా అందరి కన్నా ముందు తేరుకున్న ముసలి గొంతు.
"నేను రావడం కాదు. మీరే వచ్చారు ! మీరున్న రైలు నాది. ఈ రైలు ఆగిన స్థలం నాది. అదిగో.. పక్కన కనబడుతుందే..అదే మా అయ్య సమాధి" - వాడు ఏం మాట్లాడుతున్నాడో అర్ధం చేసుకునే ప్రయత్నం ఆపేసి అందరం గొర్రెల్లాగా కిటికీ నుండి వాళ్ళ నాన్న సమాధి వైపు చూసాం.
" స్థలం నీదా?" - సారి టి.టి. ముందు తేరుకున్నాడు.
"నాది కాకపోతే నీదా?"
"మరి రైలు పట్టాలు నీ స్థలం గుండా ఎందుకున్నాయి ?"
"ఇదిగో నల్లకోటూ… అన్ని వివరంగా చెప్పే ఓపిక నాకు లేదు గానీ... ఇదిగో, కోర్టు ఇచ్చిన కాగితం చదువుకో... నీకే అర్ధమౌతాది" అని టి.టి. చేతిలో ఒక కాగితం పెట్టాడు. అతడి కళ్ళద్దాల కోసం టి.టి.  వెతుక్కుంటుంటే అతడి చేతిలోనుండి పేపరు లాక్కున్నాను. తెరిచి చూస్తే కోర్టు ఆర్డరు!
నేను ఆర్డర్ చదువుతున్నంత సేపు ఇసకేస్తే రాలనంత జనం మధ్యలో గుండు సూది కిందపడ్డా వినబడేంత నిశ్శబ్దం !
" కాయితంలో ఏటి రాసుంది బాబూ" - నేను చదవడం పూర్తయ్యాక ఓ పెద్దావిడ అడిగింది.
"ఇతను చెప్తున్నది నిజమే ! చుట్టూ కనబడుతున్న పొలం ఒకప్పుడు ఇతడిదే ! 1998 లో ఇతడి తండ్రి దగ్గర నుంచి రైల్వే డిపార్ట్మెంట్ భూ సేకరణలో భాగంగా పొలంలో కొంత భాగం తీసుకుని రైల్వే ట్రాకు వేసింది. ఒప్పందం ప్రకారం అతడికి రావలసిన డబ్బు రైల్వే వారి దగ్గర నుండి రాకపోయేసరికి 2003 లో ఇతడు కోర్టుకి వెళ్ళాడు. దాని తీర్పు 2007లో వచ్చింది. న్యాయంగా ఇతడికి రావలసిన డబ్బు ఇతడికి ఇవ్వవలసిందిగా రైల్వే అధికారులను కోర్టు ఆదేశించింది. నిధుల చెల్లింపులో జరిగిన జాప్యం వల్ల 2010 లో ఇతడు తరపు న్యాయవాది పబ్లిక్ ఇంట్ర్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసాడు. అది ఇప్పటికి తేలింది. రైల్వే వారి నిర్లిప్తతతో విసుగెత్తిన అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు మేజిస్ట్రేటు, నెల పదవ తేదీలోగా ఇతడికి రైల్వే నుండి డబ్బు అందని పక్షంలో రైలుని ఇతను స్వాధీన పరచుకోవచ్చని తీర్పు ఇచ్చారు " -నేను చదివింది నేనే నమ్మలేకపోయాను !
"అరె... గట్లా ఎట్లా ఫైసలా ఇస్తరు సారూ... జడ్జ్ ఏమన్నా వీని లెక్క పాగల్ గాడా? ఏడ కెంజో కాగజ్ తీస్కచ్చి మనల్ని ఆగం జేస్తుండు ! జర సోచాయించండి" -ఎవరో ముస్లిం సోదరుడు చెప్పిన మాటల్లో నిజం లేకపోలేదు. ఇలాంటి తీర్పు జడ్జి ఇచ్చి ఉండడు. కానీ కళ్ళ ముందు ఆర్డరు కనబడుతుంటే నమ్మకుండా ఎలా ఉండడం ?
"ఏంటి సారు ఏదో అంటన్నారు ? నేనేదో కాయితం తీసుకొచ్చి మిమ్మల్నందరిని ఖంగారెట్టేస్తన్నానా ? మీలో ఎవరికీ పేపర్ చదివే అలవాటు లేదా ? ఇది మొన్నటి ఈనాడు... ఇదిగో... ఇది నిన్నటి సాచ్చి, జోతి,బూమి.. సదవండి" అని కొందరి చేతిలో పేపర్లు పెట్టాడు. రైల్లో పక్క వాడి పేపర్లోకి తొంగి చూసే అలవాటు ప్రయాణీకులందరికీ పుష్కలంగా ఉంది కనుక ఒక న్యూస్ పేపర్ నలుగురైదుగురికి సరిపోయింది. పల్లీలమ్మే కుర్రాడు, తను పొట్లాలు కట్టడానికి తెచ్చిన కాగితపు ముక్కల్లో వార్త కనబదుతుందేమోనని వెతుకుతున్నాడు. సైడ్ అప్పర్ బెర్తుపై కూర్చున్న కళ్ళద్దాలతను గూగుల్లో వార్త గురించి వెతుకుతున్నాడు. ఎవరో అమ్మాయి జరుగుతున్న గొడవంతా ఫేస్ బుక్ లో పెడుతుంది. ఆమె పక్కనే కూర్చున్న కుర్రాడు వీడియో తీస్తున్నాడు.. బహుశా యూ ట్యూబ్ కోసం అనుకుంటా !
"అవును.. వార్త నేను మొన్నే చదివాను" చివర్లో ఎవరిదో గొంతు పెగిలింది.
"అవునవును.. నేనూ చదివాను" అన్నారింకెవరో !
"నేను చదవలేదు" అన్నాడు అతని పక్కన నిలబడ్డాయన.
"మీరు సదవకపోతే అది నా తప్పు కాదు" అన్నాడు వీడు. అవును ! "ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ ఆఫ్ నో ఎక్స్క్యూజ్" అని ఎప్పుడో చదువుకుంది గుర్తొచ్చింది.
"ఓరి నీ బండబడ.. ఏందయ్యా పంచాయితీ ? డబ్బులిచ్చి టికెట్ కొన్నా కూడా మాకేందీ రచ్చ ?"  ఈసారి ఎవరో లేడీసు !
"అమ్మా... మీరు డబ్బులిచ్చింది రైల్వేకి, నాకు కాదు. పోయి ఆళ్ళనడుగు. అయినా నా రైలు టికెట్లు అమ్మడానికి ఆళ్ళెవరు ? కొనడానికి మీరెవరు ? " వాడిచ్చిన సమాధానానికి ఆవిడతో పాటు మా అందరి బుర్రలు మూడువందల అరవై డిగ్రీలలో గిర్రున తిరిగాయి.
"ఏటండీ ఇందాకల్నుండీ సూత్తన్నాను ఎదవ నూసెన్సు... ఇదిగో కానీస్టేబుల్ గారూ ఈడ్ని బైటకి లాగెయ్యండి. అవతల మాకు బోలెడు పనులున్నాయి " అన్నాడో పేద్ద మనిషి.
"ఏటీ ?? నా రైల్లోనుండి నన్ను బయటకి లాగేత్తారా ? నన్ను బయటకి లాగేస్తే కోర్టు ధిక్కారం అట ! మా ప్లీడరు చెప్పాడు మాటతో కండలపైకి చొక్కా మడుస్తున్న ఆర్.పి.ఎఫ్. కాన్స్టబుల్ కొయ్యబారిపోయాడు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఉద్యోగం ఊడిపోతుందన్నది అతడి భయం.
"ఇదుగో అబ్బాయ్... రైలు ఆపితే ఆపావు గానీ పద్దకా నా రైలు.. నా రైలు అనమాకు. కంపరమెత్తి పోతావుంది" -ఎవరో సాత్వికురాలైన గృహిణి అభ్యర్ధన.
"అజ్జిబాబోయ్... ఇది తేలేలా లేదురా బాబు" అన్నాడు ఇందాక నా జాతకం చూసిన వ్యక్తి.
"ఆయ్.. ఎదరగా ఉన్న వోల్వో బస్సెక్కి ఎల్లిపోతా బా.. అంటే ఇనకుండా ట్రైన్ టికెట్ తీసి పెంట పెంట జేహేహేడండీ మా బామ్మర్ది.. దయిద్రపు ఎదవ" అతడికి వంత పాడాడు సిల్క్ చొక్కా.
టి.టి. ఎప్పుడు వెళ్ళి చెప్పాడో గానీ ఇద్దరు రైలు అధికారులు వచ్చారు. అతడ్ని బ్రతిమాలడం మొదలు పెట్టారు...
"బాబూ.. నీకు జరిగిండేటిది అన్నాయమే, కాదనట్లే.. అట్టా అని రైలు ఆపేస్సా అంటే ఎట్టా చెప్పు? ట్రాకులో తిరగాల్సిన రైల్లన్నీ ఆగిపోయినాయి. మన రైలు కదిలితే గానీ అవి కదిలేదానికి లేదు. నడిమి ఎవరో పిల్లకాయ ఇంటర్నెట్లో జరిగినదంతా పెట్టినాడట ! అన్ని టి.వి.లోనూ వీడియో అచ్చినాదంట ! పైనుండి మాకు ఒకటే పోటు. మేము గూడ్క పై ఆఫీసరుతో మాట్లాడినాం. నీ చెక్కు మూడు రోజుల ముంగటనే పంపినారట. మా ఖర్మకి నిన్న,మొన్న బ్యాంకు సెలవులంటనే ! నీకు రావల్సిన లెక్క మొత్తామూ ఇవ్వాల్టి మధ్యాన్నం కి ఇన్ని దినాల వడ్డీతో సహా నీ ఖాతాల జమైతదిఅని కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు.
"సరే... మీరందరూ ఇబ్బంది పడతన్నారు కాబట్టి ఒప్పుకుంటున్నా. మధ్యాన్నం కల్లా డబ్బులు రాలేదో... రేపు మళ్ళీ ఇదే రైలు ఎక్కుతా... ఏవనుకున్నారో"
"అట్నే బాబూ... మీరు ఎలా అంటే అలా.. బండి తీయొచ్చా"
"ఆగండి... నేను ఈడనే దిగేస్తా.. " అని కిందకు దిగి... "రైట్..రైట్.. నా బండి జాగ్రత్త రోయ్" అంటూ చేతులూపాడు. అతడితో పాటు నేను కూడా దిగిపోయాను. రైలు వెళ్ళిపోయింది.
"సారీ తమ్ముడూ... ఇందాక సీట్లో నుంచి నిన్ను లేపేసినందుకు" అన్నాను.
"పర్లేదులే సారు" అన్నట్లుగా నవ్వాడతను. ఇంతలో అతడి సెల్ ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం అయ్యింది. మెసేజ్ తెరిచి చదివినప్పుడు అతడి కళ్ళలో మెరుపు ! బహుశా డబ్బు ఎకౌంట్లో క్రెడిట్ అయ్యుంటుంది.
"మొత్తానికి సాధించావయ్యా! అవునూ... ఇందాక అంతమందిని ఎదిరించి మాట్లాడినప్పుడు భయమెయ్యలేదా ?”
"అలా భయపడే మా అయ్య పురుగుల మందు తాగి సమాధిలో తొంగున్నాడు. పోరాడాలి సారు. భయపడితే ఏటౌతాది సారూ.. సత్తాం. సత్తే బుగ్గైపోయి బూమిలోకెలిపోతాం. భూమి లోకి ఎల్లిపోడం కాదు, భూమి మీద బతకడం గొప్ప"
"అర్రే.. భలే గుర్తు చేసాడు. వీడి సొదలో పడి నేను చావడం మర్చిపోయాను. వీడి మాటల్ని వింటే క్షణానికి బాగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ బతకలేక చావాలి. ఎందుకంటే నా తరఫున నేనే పోరాడాలి... వీడొచ్చి పోరాడడుగాగా… వీడికేం ఎన్నైనా చెప్తాడు" అనుకుంటుండగా నా ఫోను మ్రోగింది...
"ఏవండీ... మీకో గుడ్ న్యూస్. మనం అప్పున్న గోల్డ్ మైన్ బ్యాంకు జనాలకి నామం పెట్టేసి బోర్డ్ తిప్పేసింది. జనాలందరూ బ్యాంకు ముందు గోల గోల చేస్తున్నారు. మనకు మాత్రం హేపీ.. ఒక్క రూపాయి కూడ కట్టక్కర్లేదు" తర్వాత నా భార్య ఏం మాట్లాడిందో వినకుండా ఫోన్ కట్ చేసాను.
నా భార్య చెప్పింది నిజమే ! ఇది నాకు గుడ్ న్యూసే ! బోర్డు తిప్పేసిన బ్యాంకు నుంచి మనకు డబ్బులు రావాల్సి వస్తే మనం రోడ్డెక్కి నానా యాగీ చేస్తాం గానీ మనం అప్పున్న బ్యాంకు బోర్డు తిప్పేస్తే ఎవరైనా "నా డబ్బులు తీసుకోకుండా వాడు బోర్డు తిప్పేసాడో..." అని రోడ్డెక్కుతామా ? ఎవరైతే డబ్బులు డిపాజిట్ చేసి పోగొట్టుకున్నారో వాళ్ళ డబ్బే మనకు బ్యాంకు వాడు అప్పుగా ఇచ్చాడన్న స్ఫురణ మనకుంటే నష్టపోయిన వాళ్ళకు మన డబ్బులిచ్చే ఔదార్యం ఎంతమందికి ఉంటుంది ?
అతడు నన్నే చూస్తున్నాడు...
అలా చూస్తున్నప్పుడు అతడిని ఒక్క ప్రశ్న వేద్దామనిపించింది... కానీ వెయ్యకుండా వెనుదిరిగాను...
ప్రశ్న ... "నీ డబ్బులు వెయ్యడానికి రైల్వే వాళ్ళకు బాంకు అకౌంట్ నంబర్ ఇచ్చావు?" అని !

                ************అయిపోయింది***********

(09/04/2015 వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని  ఉనా జిల్లా లో అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్ట్ మేజిస్ట్రేట్ ముఖేష్ బన్సల్ గారు ఇచ్చిన తీర్పు ఆధారంగా...)



8 కామెంట్‌లు:

  1. మీ కథ నిన్న చదివాను.భిన్నమైన కథ... అందునా చైతన్యం పెంచే కథ. కానీ ముగింపు యాప్ట్ గా ఉందా....?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు చందు గారు. ఈ కధ ముగింపు ఒక యాబ్స్ ట్రాక్ట్ ఎక్స్ ప్రెషనిజంతో కూడిన ఓపెన్ ఎండింగ్ కోవకు చెందుతుంది. ఇటువంటి కధలలో ముగింపు పాఠకుడి ఇంటర్ ప్రటేషన్ కి వదిలివేయడం జరుగుతుంది. అందువల్ల ముగింపుతో పాటు ముగింపు యొక్క యాప్ట్ నెస్ కి కూడా విజ్ఞత గలిగిన పాఠకుడే యజమాని.

      తొలగించండి
    2. Sir..nenu Sai Madhav...Ipude chadivanu...chala bagundi...!!!

      తొలగించండి
  2. పోరాడాలి సారు. భయపడితే ఏటౌతాది సారూ.. సత్తాం. సత్తే బుగ్గైపోయి భూమిలోకెలిపోతాం. భూమి లోకి ఎల్లిపోడం కాదు, భూమి మీద బతకడం గొప్ప"

    Nice real(ity) story !


    రిప్లయితొలగించండి
  3. కాంటెంపరెరీ విషయాల్ని మీ కథల్లో వాడిన తీరు బాగుంది

    రిప్లయితొలగించండి