ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, నవంబర్ 2015, శనివారం

లయం (కథ)

లయం 

(ఆంధ్ర భూమి మాస పత్రిక అక్టోబర్ 2015 ముద్రితం)
"అన్నయ్యా... సాయంత్రం లయ మన ఇంటికి వచ్చిందిరా"
"ఏ లయ?" అని అతడు అడగడం, అసంకల్పితంగా అతడడిగిన ప్రశ్న, అతడి భృకుటిలాగే ముడిపడడం.. రెండూ ఒకే సారి జరిగిపోవడం అతడి చెల్లెలు భ్రమర గమనించింది.
"లయ రా.." అని అనడంలోనే తనకు ‘నువ్వు అప్పుడే లయని మర్చిపోయావా’ అన్న సందేహం... రెండేళ్ళ క్రితం గడిచిపోయిన కధను అనవసరంగా గుర్తుచేసానన్న సంకోచం...
"ఎందుకట ?"
"అదే.. వాళ్ళ నాన్నగారు పోయారు కదా..."
అన్న వాక్యాన్ని మధ్యలోనే తుంచేస్తూ "నేనడిగింది ఇక్కడికి ఎందుకు వచ్చిందని?" అన్నట్లు అరచేతిని చూపించాడు.
"నీతో ఏదో మాట్లాడాలట.. నీ నెంబరు తీసుకుంది"
"నా నంబర్ ఎందుకు ఇచ్చావ్ ?" అని అడిగి ప్రయోజనం లేదు... అప్పటికే ఇచ్చేసింది కనుక.
"అంకుల్ కి సడెన్ హార్ట్ ఎటాక్ అట పాపం" అని భ్రమర అంటుండగా వాట్సాప్ మెసేజ్ టోన్ తో తన ఉనికిని చాటుకుంది అతడి సెల్.
అది లయ మెసేజ్ అని ఊహించిన భ్రమర అతడి గది నుండి బయటకు వెళ్ళిపోయింది.
                                *********************************
ఫోన్ అన్ లాక్ చేసి వాట్సాప్ తెరిచాడు.
ఒక అన్ సేవ్డ్ నంబర్ నుండి మెసేజ్. ప్రొఫైల్ తెరిస్తే.. లయ, ఆమె భుజంపై చెయ్యి వేసి నిలబడ్డ కేదార్ ఉన్న ఫోటో.
విత్ మై క్యూట్ హబ్బీ’ అని స్టేటస్ !
"ఎలా ఉనావ్ మల్లీ?" అని తను పంపిన మెసేజ్ అతడు చదివేలోపే తన వాట్సాప్ స్టేటస్ "మిస్ యూ డాడ్" గా మారింది.
డిస్ప్లే పిక్చర్ కూడా వాళ్ళ నాన్నతో తను దిగిన ఎప్పటిదో పాత ఫోటో కి మార్చబడింది.
"బాగానే ఉన్నాను" అని ఇంగ్లీష్ లో టైప్ చేసాడు.
నువ్వు రిప్లై ఇవ్వవనుకున్నాను”
"అలా అనుకున్నదానివి ఎందుకు మెసేజ్ చేసావ్?"
"ఫోన్ చేసి మాట్లాడడానికి మొహం చెల్లక"
"సరే.. ఎందుకు మెసేజ్ చేసావ్?"
"నేను ఎలా ఉన్నానో అడగవా ?"
"నీకేం బాగానే ఉన్నావ్ కదా.. మీ నాన్న పరువు కాపాడడానికి మీ బావని చేసుకుని..."
"ప్లీజ్..."
"సరే.. సి.. అంకుల్ చనిపోయారని విన్నాను…హార్ట్ ఎటాక్ అంట కదా"
"తెలియదు"
"అదేంటి.. ఇక్కడ మన క్వార్టర్స్ లో అందరు అలాగే అనుకుంటున్నారు.. భ్రమర కూడా హార్ట్ ఎటాక్ అనే చెప్పింది "
"నాకు అనుమానమే"
"డాక్టర్ అంకుల్ కూడా హార్ట్ ఎటాక్ అనే చెప్పారని విన్నాను"
"అయినా నాకు అనుమానమే"
"ఎవరి మీద నీ అనుమానం ?"
"బావ మీద"
"ఏమంటున్నావ్ ? కేదార్ గాడు అంకుల్ ని హత్య చేసి ఉంటాడంటావా ?"
“………”
"ఇది నీ అనుమానమా ? నమ్మకమా ?"
"నమ్మకమంత బలమైన అనుమానం"
కేదార్ గాడికి కోపం ఎక్కువే గానీ సొంత మామయ్యనే చంపేంత నీచుడు కాడు”
"నీ స్నేహితుడ్ని సమర్ధించాలని చూడకు మల్లీ … అయినా నీకు అన్నీ చెప్పే ఉంటాడులే"
"మేం రెండేళ్ళగా మాట్లాడుకోవడంలేదని నీకు తెలుసు కదా"
“………”
" అంకుల్ ని వాడు చంపి ఉంటాడని ఎందుకు అనుకుంటున్నావ్ ? వాళ్ళిద్దరికీ ఏమైనా గొడవలున్నాయా "
బావకి, నాన్నకి కొన్ని నెలలుగా పడటంలేదు. ఎప్పుడూ ఒకరి మీద ఒకరు కేకలేసుకునే ఉండేవారు. డాడీ రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్న గత తొమ్మిది నెలల్లో వాళ్ళ గొడవలు మరీ ఎక్కువైపోయాయి. ఎప్పుడూ బావ ఏదో ఒక గొడవ పెట్టేవాడు.”
"ఎందుకు పెట్టడు ? డిపార్ట్మెంట్ లో కింద పని చేసే కాన్స్టబుల్ మీద కేకలేసినట్లు గసిరితే అల్లుడైనా ఊరుకుంటాడా?"
" మధ్యన ఏమైనా గొడవ పడ్డారా?"
"మూడు రోజుల క్రితం పెద్ద గొడవైంది...కోపం వస్తే డాడీ కంట్రోల్ చేసుకోలేరు కదా, బావని తుపాకీతో కాల్చేస్తానని అన్నారు
"ఎందుకు అనరు? మీ నాన్న ఎంకౌంటర్ స్పెషలిస్ట్ కదా"
బావ కూడా కోపంలో గన్ బయటకి తీసి చంపేస్తానన్నాడు. నేను డాడీకి అడ్డం పడి ఉండకపోతే షూట్ చేసేసేవాడేమో"
"వాడి మొహం ! మీ మామయ్య, బ్యారెల్లో సూట్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి చచ్చిపోతే కోటాలో పోలీస్ అయ్యాడు వాడు. వాడికంత సీన్ లేదులే"
" అది ఒకప్పుడు.. ఇప్పుడు బావ మీద మూడు లాకప్ డెత్ కేసులున్నాయి తెలుసా ? "
" సర్లే..విషయం చెప్పు"
" గొడవ జరిగిన రోజు డాడీ ఒళ్ళంతా చెమట్లు పోసాయి, బాగా బెదిరిపోయారు. మర్నాటి పొద్దున్నే బావ డ్యూటీకి వెళ్ళిపోయాడు. డాడీ ఎప్పటిలానే బృందావనం పార్క్ కి వాకింగ్ కి వెళ్ళారు. ఆయన వెళ్ళిన కాసేపటికి కబురొచ్చింది డాడీ పార్క్ లో పడిపోయారని. ఎవరో హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారట ! అప్పటికే..."
"పార్క్ లో అంకుల్ తో పాటు ఎవరైనా ఉన్నారా?"
" దెయ్యాలు తిరిగే పార్క్ కి ఎవరు వెళ్తారు, డాడీ తప్ప ! ఎవరో పాలవాడు అటుగా వెళ్తూ పార్క్ గేట్ దగ్గర్లో స్పృహ తప్పి పడిపోయిన డాడీని చూసాడట ! వాడే అందరికీ చెప్పాడు."
                                "బాడీ మీద ఏమైనా గాయాలున్నాయా?"
"నాకు కూడా డౌట్ వచ్చి జాగ్రత్తగా చూసాను. ఏం లేవు"
                                "డాక్టర్ అంకుల్ ఏమన్నారు?"
"కార్డియాక్ అరెస్ట్ అన్నారు. అదే.. హార్ట్ ఎటాక్"
"అంతా క్లియర్ గానే ఉంది కదా... వాకింగ్ చేస్తుంటే సడెన్ గా ఎటాక్ వచ్చి ఉంటుంది"
"లేదు.. బావే చంపి ఉంటాడని నా సిక్స్త్ సెన్స్ చెబుతుంది. అప్పుడెప్పుడో డాడీ జాతకం చూసిన జోతిష్యుడు ...తుపాకీ వల్లనే డాడీ చనిపోతారని చెప్పాడు. అందుకే అప్పట్నుంచీ డాడీ కూంబింగ్ డ్యూటీకి దూరంగా ఉండేవారు."
"పిచ్చిగా ఆలోచించకు. నీ సిక్స్త్ సెన్స్ ఆధారంగానో, జోతిష్యుడి మాట మీదో ఎనాలసిస్ చెయ్యడం వేస్ట్ ఆఫ్ టైం. అయినా ఒంటి మీద బుల్లెట్ గాయాలేమీ లేవని నువ్వే చెబుతున్నావుగా... ఇంకేంటి ?"
"బావని తక్కువ అంచనా వెయ్యకు.ఆధారాలు కూడా మాయం చెయ్యగలడు. అందుకే నీ హెల్ప్ కావాలి.నువ్వే ఎలాగైనా..."
"సరే చెప్పావుగా.. నేను కనుక్కుంటాన్లే"
"చాలా థాంక్స్.. ఎప్పుడు చెబుతావ్? రేపు కాల్ చెయ్యనా?"
"వద్దు.. కాల్ చెయ్యకు.. నేనే మెసేజ్ చేస్తాన్లే"
"సరే గుడ్ నైట్"
"గుడ్ నైట్"
****************************************
"హాయ్.. ఏమైంది ? ఏమైనా తెలిసిందా?"
" రోజు పార్క్ కి వెళ్ళాను.."
"ఓహ్..ఏమైనా క్లూ దొరికిందా"
"ఒక క్యాట్రిడ్జ్ దొరికింది..కానీ బుల్లెట్ దొరకలేదు"
"క్యాట్రిడ్జ్ అంటే ?"
                                "బుల్లెట్ ని క్యారీ చేసే ఒక కవర్ లాంటిదనుకో.. బుల్లెట్,గన్ పౌడర్ కలిపి క్యాట్రిడ్జ్ లో పెడతారు.”
కొన్ని సందర్భాల్లో దాన్నే రౌండ్ అని కూడా అంటారు. పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు అని వార్తల్లో వింటుంటామే.. అదన్నమాట".
"చూసావా.. నేను అనుకున్నట్లే అయ్యింది.. డాడీని బావే చంపేసి ఉంటాడు"
                                "అప్పుడే నిర్ణయానికీ రాకు. వాడు చంపాడని ప్రూవ్ చెయ్యడానికి ఆధారం లేదు.”
మీ నాన్నకి బుల్లెట్ గాయం అవ్వలేదు. పార్క్ లో ఎక్కడా బుల్లెట్ దొరకలేదు.”
అన్నిటికన్న ముఖ్యంగా క్యాట్రిడ్జ్ మీ బావ గన్ లో నుండి వచ్చిందో కాదో మనకి తెలియదు"
"సరే..ఇంకా ఏమైనా దొరికాయా"
                                "ఫొనాక్ హియరింగ్ ఎయిడ్ దొరికింది. మీ డాడీదేనా ?"
అవును
                                "కొత్తది లాగా కనబడుతుంది"
అవును.. చెవులు సరిగ్గా వినిపించకపోతే ఆ ముందురోజే డాక్టర్ గారు పెట్టారు.ఆ రోజు పొద్దున్న వాకింగ్ కి వెళ్తున్నప్పుడు డాడీకి పెట్టుకోవడం రాకపోతే నేనే సెట్ చేసి ఇచ్చాను"
                                " ముందురోజు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్, హియరింగ్ ఎయిడ్ బిల్ ఫోటో తీసి నాకు మెసేజ్ చెయ్"
"ఎందుకు?"
                                "చెప్పింది చెయ్"  
"సరే గుడ్ నైట్"
"గుడ్ నైట్"
                                *********************************
"హాయ్ ! నేను చెప్పింది ఏం చేసావ్?"
                                "ఏం తెలియలేదు.. అయినా అసలు ఏమైనా ఉంటే కదా తెలియడానికి? మీ డాడీది నార్మల్ డెత్తే"
"అబద్ధాలు ఎందుకు చెప్తున్నావ్?"
                                "అబద్దమా?"
"కాదా? రోజు నువ్వు మాగ్జైన్ ఆఫీస్ కి వెళ్ళి.. బావ వాడిన గన్,బుల్లెట్స్,క్యాట్రిడ్జ్ గురించి కనుక్కున్నావా లేదా?"
                                " విషయం నీకెవరు చెప్పారు?"
"జోసెఫ్ అంకుల్"
                                "రేయ్ కేదార్ గా.. ఇంక గేంస్ ఆపరా.."
"రేయ్.. ఎలా కనిపెట్టావ్ రా?"
"జోసెఫ్ అంకుల్ ని లయమైదానం’ అంటుంది.. బట్టతల కదా !"
"డిపార్ట్మెంట్లో ఉండాల్సినోడివిరా నువ్వు... ఈరోజే నేను లయ సెల్ నుండి మెసేజ్ చేస్తున్నాను.. నిన్న,మొన్న లయే నీతో చాట్ చేసింది"
" విషయం నాకు కూడా తెలుసురా.. లయ టైపింగ్ స్పీడ్ నీకెక్కడిది? అయినా రెండేళ్ళకే నిన్ను మర్చిపోతానని ఎలా అనుకున్నవు రా?"
"సారీ మామూ...  అప్పట్లో ఏదో అలా జరిగిపోయింది"
"గతం తవ్వుకోవడం వల్ల లాభం లేదు గానీ, సంగతి చెప్పు.. నువ్వు పేల్చిన క్యాట్రిడ్జ్, పార్క్ లో ఎందుకు ఉంది ?
" క్యాట్రిడ్జ్ నేనే పేల్చానని ఎందుకు అనుకుంటున్నావు ?"
" క్యాట్రిడ్జ్ కేస్ మీద దొరికిన బ్యాలిస్టిక్ మార్కింగ్స్ ద్వారా అది నువ్వు వాడే తుపాకీ నుండే పేలినట్లు తెలుస్తుంది"
" క్యాట్రిడ్జ్ రా బాబూ... ఫోటో తీసి పంపు"
                                "మెయిల్ చేసాను చూడు"
"ఓస్.. ఇదా..ఇది బ్లాంక్ క్యాట్రిడ్జ్ రా"
                                "బ్లాంక్ క్యాట్రిడ్జా ?"
"అదేరా.. ఫ్యునరల్స్ అప్పుడు వాడతాం కదా.. అది ! బ్లాంక్ లో బుల్లెట్ ఏమీ ఉండదు. సౌండ్ ఎఫెక్ట్ కోసం గన్ పౌడర్ మాత్రం పెడతారు. డ్యూటీలో ఉండగా చనిపోయిన పోలీసుల ఫ్యునరల్ దగ్గర గౌరవసూచకంగా ఇవి పేలుస్తాం. నీకు తెలుసు కదరా"
                                "నాకు ఇదంతా తెలుసు గానీ బ్లాంక్ ఎప్పుడు వాడావో చెప్పు"
“మొన్న మా డి.ఎస్.పి. గారి ఫ్యునరల్ లో వాడాను”
                   "అతని ఫ్యూనరల్ ఎక్కడ అయ్యింది ?"
"బృందావనం పార్క్ వెనక ఉన్న అతడి ఖాళీ స్థలంలో… అయినా ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నావు ?"
                                "నీకే తెలియకుండా నువ్వు చేసిన హత్య గురించి నీకు చెబుదామని"
"హత్యా ? నేను చేసానా ? ఏం మాట్లాడుతున్నావు రా?"
                                "టెన్షన్ పడకురా.. నీకు తెలియకుండా చేస్తే అది ఏక్సిడెంట్ అవుతుంది కానీ మర్డర్ అవ్వదు"
"రేయ్... సస్పెన్స్ లో పెట్టకురా.. కనీసం నా వల్ల ఎవరు చనిపోయారో అదైనా చెప్పరా బాబు"
                                "మీ మామయ్య"
"కొంచెం అర్ధమయ్యేలా చెప్పరా బాబు"
" నువ్వు డి.ఎస్.పి. గారి ఫ్యూనరల్లో పేల్చిన హాండ్ గన్ సౌండుకి గ్రౌండ్ వెనుకనునే ఉన్న పార్కులో వాకింగ్ చేస్తున్న మీ మామయ్య గుండె ఆగి చనిపోయాడు. అర్ధమయ్యిందా ?"
"వార్నీ ! ఇదేం ఖర్మరా బాబూ ! ఇది ఎవడికైనా తెలిస్తే నేనే కావాలని చంపాననుకుంటారు."
                                "ఆల్రెడీ లయ అలాగే అనుకుంటుంది"
"ఓహో.. అదా విషయం.. అయితే నిన్నా మొన్నా మీరు నా గురించే చాట్ చేసుకున్నారా?"
                                "అదేంటి? నువ్వు మా చాట్ హిస్టరీ చూడలేదా?"
"డిలీట్ చేసేసింది. నిన్నా మొన్నా ఫోన్లో ఎవరితోనో చాట్ చెయ్యడం గమనించాను. వాట్సాప్ గ్రూప్ లో నీ కాంటాక్ట్ కొత్తగా యాడ్ అయినట్లు చూసాను. నీతోనే చాటింగ్ చేస్తుందని అనుమానమొచ్చి ఒక రాయి వేసాను. పోన్లే నా అనుమానం మంచిదే అయ్యింది. దయచేసి లయతో విషయం చెప్పకురా
                                "నువ్వు వాళ్ళ నాన్నను చంపలేదని తేలిపోయింది గా"
"నేను చంపకపోయినా నా వల్ల చనిపోయాడుగా. విషయం తెలిస్తే జీవితాంతం తను నన్నొక హంతకుడిలా చూస్తుంది"
                                "సరే"
"అయినా మామూ...మా మామయ్యకి చెవుడు కదా.. మరి గన్ శబ్దం అంత భయంకరంగా ఎలా వినబడిందంటావ్?"
"పొరపాటున మీ మామ హియరింగ్ ఎయిడ్ లో ఉండాల్సిన వాల్యూం కన్నా రెట్టింపు వాల్యూం సెట్ చెయ్యబడి ఉండడం వల్ల అతనికి సాధారణంగా వినబడాల్సిన దానికన్నా రెట్టింపు శబ్దం వినబడింది. "
"మై గాడ్.. ఇంత చిన్న మిస్టేక్ వల్ల కూడా ప్రాణాలు పోతాయా !  ఇంతకీ అలా ఎవరు సెట్ చేసారు?"
                                "లయ"

                                        **************అయిపోయింది*******************

                               
                               









3 కామెంట్‌లు:

  1. ఋషి! మీకు ఎన్ని విషయలలో ప్రవేసం ఉందండి..? మీ కథల వల్ల మీ పరిజ్ఞానం అర్ధమవుతొంది. చాల బగుంది లయం. మీ కలంలోని సిరా, మీ కథా అలోచనా వెల్లువ ఎప్పటికి మెండుగా ఉండాలని ఆశిస్తూ...
    Bindu

    రిప్లయితొలగించండి