ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, నవంబర్ 2015, మంగళవారం

విజిటర్ (కధ)

                                            

             

            (ఈనాడు ఆదివారం అనుబంధం అక్టోబర్ 18 2015 ప్రచురితం)

                               

రాత్రి పదిన్నర...
          డాబా మీద బొంత పరుచుకుని వెల్లకిలా పడుకున్నాను... దోమలకు రక్తదానం చేస్తూ !
          వెన్నెల మాయిశ్చరైజర్ ఒళ్ళంతా పూసుకున్న నల్లటి కన్యలా ఉంది ఆకాశం !
          ఆమె రూపలావణ్యాలకు దాసోహమై ఆమె ఒంటికి అతుక్కుపోయాయి చుక్కలు. ఉన్నంత సేపు మిణుకు మిణుకుమంటాయి. ఉన్నపళంగా రాలిపడతాయి !
          భువినుండి తనను ఎవరో గమనిస్తున్నారని అనుమానం కాబోలు ఆకాశానికి... ఎల్..డి. టార్చ్ లైట్ లా పున్నమి చంద్రుడ్ని వెలిగించి వీధంతా వెతుకుతోంది. నేను తననే చూస్తున్నానని తెలిసి సిగ్గుపడి మబ్బుల దుప్పటిలో దాక్కుంది.
          ఏం చేస్తాం ! బ్రహ్మచారి బ్రతుక్కి ఇంతే ప్రాప్తం !
          చిల్డ్ బీర్... చందమామ... కాసిన్ని మెలడీస్...మరిన్ని మెమరీస్...వెరసి ప్రకృతితో రొమాన్స్ !
            "హలో డార్లింగ్ ! ఏం చేస్తున్నవు రా!" - ఎవరో అమ్మాయి ! నేను పడుకున్నానన్న స్ఫురణ కూడా లేకుండా నా పక్కనుంచి నడుస్తూ.. సెల్ ఫోన్ లో ప్రియుడిపై మాటల జల్లులు కురిపిస్తూ..
          నా డాబా మీదకి వచ్చిన పిల్లెవరు?
          అవును..ఇది నా డాబా ఎలా అయ్యింది ? ఇక్కడున్న ఎన్నో అపార్ట్ మెంట్స్ లో నాది ఒక ఫ్లాట్ అయినప్పుడు, ఇది నా ఇంటి డాబా అని ఎలా అనగలను ?
            "నా డాబా మీదకి ఎందుకొచ్చావ్ " అని నేనడిగితే " బస్సు మనందరిదీ" అని అర్.టి.సి. వారు రాసినట్లు " డాబా మనందరిదీ" అని అంటుందేమో!
            "సూరీ...ఎందుకొచ్చిన సంత ? అందుకో బొంత ! చేత పట్టుకో మంచినీళ్ళ ముంత.. సారీ సారీ..బాటిల్ ! పద మన ఫ్లాట్ లోనికి" అని నాకు నేనే చెప్పుకున్నాను.
                                                                ******************
          మర్నాటి ఉదయం ఎనిమిదిన్నర...
          సిటీబస్సులో ఉన్న చెమట వాసనంతా పీలుస్తూ ప్రయాణిస్తున్న నలభైమందిలో నేనూ ఒకడ్ని. నగరంలో ట్రాఫిక్ గా పునర్జన్మెత్తిన నత్త, గంటకి ఒక మీటర్ వేగంతో(!) కదులుతుంది.
          కిటికీ నుంచి బయటకి చూస్తే...
          బైకులు,స్కూటీలు,కార్లు,వాటి హారన్ల హోర్లు !
          "ట్రాఫిక్ జాం" అన్న మాటలో "జాం" ఉంది కదా అని అది తీయగా ఉంటుందని అనుకుంటే పప్పులో పంచదార వేసినట్లే !
          తలపైన తాటిముంజుల గంపంత దిట్టమైన హెల్మెట్లు, మెళ్ళో మూర్చరోగికి వేసినట్లున్న బిళ్ళల్లాంటి ఐడెంటిటీ కార్డులు, భుజాన కుడితి కావిడంత బరువున్న లాప్ టాపులతో నా సోదరసోదరీమణులు సందు దొరికితే సాదరంగా దూరిపోతూ దూర ప్రహేళికలోని ఖాళీలను ఖాళీలేకుండా పూరిస్తూ విజయ శంఖం పూరిస్తున్నారు !
           "సూరీ.. వెటకారం కట్టి లాప్ టాప్ బ్యాగ్ లో పెట్టు. నీ భుజాన వేలాడుతుందేవిటి ? భుజాన బరువు మొయ్యడం ఇక్కడెవరికీ కొత్త కాదు. చిన్నప్పుడు స్కూల్ బ్యాగ్, ఇప్పుడు లాప్ టాప్ బ్యాగ్. అంతే తేడా ! నీ మెడలో ఉన్నది ఐడెంటిటీ కార్డు కాదా ? కార్ సర్వీసింగ్ కి ఇచ్చావ్ కాబట్టి బస్సెక్కావు గానీ.. లేదంటే నువ్వూ ప్రహేళికలో ఒక గడివే ! " - నా అంతరాత్మ నోరు నొక్కడానికి 'స్టాప్' అని అరిస్తే బస్సు ఆగింది. నేను దిగవలసిన 'స్టాప్' వచ్చిందేమో !
          బస్ దిగి మా ఆఫీస్ వైపు నడక ఆరంభించాను. కిలోమీటర్ దూరాన్ని కాళ్ళతో కొలుస్తూ. కాళ్ళు పని చేస్తున్నప్పుడు తనెందుకు ఖాళీగా ఉండడం అనుకుందేమో నా మనసు... నా శరీరం నుంచి వెకేషన్ లీవ్ తీసుకుని నా బాల్యంలోనికి వెళ్ళింది.
                                                ******************
                                                  
                                                


"రేయ్ సూరీ... నువ్వు గొప్పోడివి అవ్వాల్రా" అన్నాడు నాన్న.
"అంటే ఏంటి నాన్నా !" - ఈనాటి నా అయోమయానికి అంకురం నా చిన్నప్పుడే పడింది.
"అంటే..అంటే... అది అంతే ! నువ్వు బాగా చదువుకుంటే పెద్దయ్యాక గొప్పోడివి అయిపోవచ్చు. చదువుకోకపోతే నాలాగే కష్టాలు పడతావ్"
"నీకు ఏ కష్టాలు ఉన్నాయి నాన్నా ! మనం బాగానే ఉన్నాం కదా" అని అడుగుదామనుకున్నాను. కానీ అడిగితే నాన్న తంతాడని తెలుసు. అందుకే అడగలేదు.
"నువ్వు గొప్పోడివి అయిపోవాల్రా" అన్న మాట మా నాన్నే కాదు... శివగాడు,రాజుగాడు వాళ్ళ నాన్నలు కూడా ఇదే చెప్తారంట !
"ఆ మాట చెప్పడం నాన్నల జన్మ హక్కు అనుకుంటాన్రా" అన్నాడు రమణ గాడు.
"అది వాళ్ళ హక్కు అయితే గొప్పోళ్ళంటే ఏంటో తెలుసుకునే హక్కు మనకి లేదా ?" -తిరిగి ప్రశ్నించడంలో మా నారాయణ గాడు మా ఊరికే స్టేట్ ఫస్టు !
"ఎహె ఆపండెస్.. ఎదవ గోల... నాతో ఏడు పెంకులాట ఎవడు ఆడతాడో రండి. నేను అయ్యకోనేరు గట్టుకి వెళ్తున్నాను" అన్న కమాండర్ బాబు కేకలేసే సరికి మేమందరం సైనికుల్లా వాడిని అనుసరించాం.
నాకు అప్పట్నుంచి అర్ధం కానిది అదే... "గొప్పోడు అంటే ఎవరు ?". ఇంతలో...
"రేయ్ సూరిగా మీ నాన్న నిన్ను రమ్మంటున్నాడ్రా" అని ఎవరో వేసిన కేక నన్ను ఇంటికి చేర్చింది.
"సూరి బాబూ... నీకో విషయం చెబుదామని పిలిచాను నాన్నా. ఈ వేసవి సెలవులైపోయాక నిన్ను సిటీలో హాస్టల్లో చేర్పిద్దామనుకుంటున్నానురా" అని నాన్న అనే సరికి సువర్ణరేఖ మామిడి పండులాంటి నా ముఖం వివర్ణమైంది.
"మన పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయిలా హాస్టల్లో ఉండి చదువుకుంటే గొప్పవాడివి అయిపోతావురా"
అసలు నేను గొప్పోడ్ని ఎందుకు అవ్వాలి ? నాన్నలా బ్రతికేస్తే చాలదా ? నాన్న బ్రతికిన దానికన్నా గొప్పగా బ్రతకడానికి ఏం ఉంటుంది ?
"నేను హాస్టల్లో ఉండి చదవను " అని గట్టిగా అరిచి చెబుదామనుకున్నాను. కానీ చెప్పలేదు. ఎందుకంటే.... అప్పటికి ఇంకా బొమ్మరిల్లు సినిమా రిలీజ్ అవ్వలేదు ! నాన్నని ఎదిరించి మాట్లాడొచ్చు అన్న జ్ఞానం అప్పటికి లేకుండా పోయింది.
నాన్న ఏం చెప్పినా నా మంచికోసమే అనిపించింది.
ఆ అయిదు నిమిషాలు నేను పాటించిన వ్యూహాత్మక మౌనానికి ఫలితం...హాస్టల్ గోడల మధ్య మగ్గిన నా బాల్యం ! కొన్నాళ్ళు అలా మగ్గిన బాల్యం ముగ్గి యవ్వనం అయ్యింది.
నెలకు ఒక్క సారే ఇంటికి వెళ్ళనిచ్చేవారు. రెండు వారాలకు ఒకసారే నాన్నని నన్ను కలవడానికి రానిచ్చేవారు, అదీ విజిటర్ పాస్ ఉంటేనే !
మా నాన్న నన్ను కలవడానికి మధ్యలో వీళ్ళ పెత్తనం ఏమిటో ఆ వయసులో అర్ధం అయ్యేది కాదు. మా నాన్నే స్వయంగా నన్ను బయటకు తీసుకు వెళ్ళాలన్నా రిజిస్టర్లో సంతకం చెయ్యాలి. ఆ మూడు గంటలూ నాన్న మూడే మూడు ముక్కలు చెప్పేవాడు "నువ్వు గొప్పవాడివి కావాల్రా" అని !
అలా ఆలోచిస్తూ నా మనసు గతం నుండి ప్రస్తుతంలోనికి, నేను బస్ స్టాప్ నుండి ఆఫీసుకి చేరాం.
                                      ******************
మధ్యాహ్నం మూడు...
ఎక్సలెంట్ సూర్య ! యు హేవ్ గివెన్ యువర్ బెస్ట్ టు మీట్ ది డెడ్ లైన్. గ్రేట్ !" -అన్నాడు మా మేనేజర్.
ఆహా ! "గ్రేట్" అంటే "గొప్ప" అని శంకర్ నారాయణ ఇంగ్లీష్ టు తెలుగు నిఘంటువు చెప్పే అర్ధం. అంటే నేను గొప్ప వాడిని అయిపోయానా ?
"ఇంకా కష్టపడి పనిచెయ్యాలి సూర్యా ! ఎయిం ఫర్ ది స్కై !" -భుజం తట్టాడు మేనేజర్ !
ఏమిటి ? గగనం నా గమ్యం కావాలా ? గగనం అంటే శూన్యం అని అతడికి తెలిసే ఈ మాట అని ఉంటాడా ?
"చలో.. లెట్స్ హేవ్ ఇలాచీ టీ ఇన్ అవర్ కేఫెటేరియా. గిరి బాగా పెడతాడు. ఓ మై గాడ్ హీ ఈస్ గ్రేట్ !"
ఏంటీ ! టీ కాచే గిరిగాడు గ్రేటా ? ఈ మాత్రం గ్రేట్ అనిపించుకోవడానికి ఇంత చదువు చదివి, ఇంత దూరం వచ్చి, సిటీ లో ఉద్యోగం చెయ్యడం ఎందుకు ? మా ఊళ్ళోనే ఉంటే సరిపోయేదిగా !
అయినా ఊళ్ళోనే ఉంటే మనల్ని గ్రేట్ అనే గాడిద కొడుకు ఎవడు ?
                                      ******************

సాయంత్రం ఆరు...
"యువర్ కార్ ఈస్ రన్నింగ్ గ్రేట్ సూర్య" అంది కార్లో నా పక్క సీట్లో కూర్చున్న నా కొలీగ్ కం ఉడ్-బీ శైలూషిత.
"ఆ గ్రేట్ అన్న మాటను కాస్త ఆపుతావా ? నాకు చిరాకు "
"నేను మాట్లాడ్డం ఆపుతా... నువ్వు కారు ఆపు"
"ఎందుకు?"
"ఎడంపక్క షాపింగ్ మాల్ కనబడ్డం లేదా ?"
"ఓహ్... ఏం కొనాలి ?"
"ఏమైనా కొంటే తప్ప మాల్ కి రానివ్వరా ? సరదాగా వెళ్దాం. టైం ఇంకా సిక్సేగా !" -అంది నెయిల్ పాలిష్ ఊడి వచ్చేలా గోర్లు కొరుకుతూ. ఇప్పుడు కనుక నేను కార్ ఆపకపోతే గోర్లు కొరకడం ఆపి నా పీక కొరికేస్తుందని భయమేసి బ్రేక్ వేసాను.
షాపింగ్ మాల్...
ఏడంతస్థుల భవంతిలో ఎ.సి. సంత...
ఏదో ఒకటి కొనాలని పడనక్కర్లేదు చింత...
షాపులన్నీ చుట్టేసి, తలతిక్క ప్రశ్నలతో సేల్స్ మెన్ ను హింసించే వారే అంతా...
నచ్చిన బట్టలు వేసుకుని, ట్రైల్ రూంలొ ఇరుక్కుని అద్దాలకి తీసిన ఫొటోలను ఫేస్ బుక్ లో పెట్టి 'లైక్' కొట్టించుకున్నాక ఆ బట్టలు కొనకుండా కొట్టువాడి మొహాన కొట్టి పోవడం మహా వింత !
నా గడియారంలో రెండు గంటలు అబ్రకదబ్ర.
"ఫన్ సిటీలో గేం ఆడదామా?" -అడిగింది శైలూషిత.
"వద్దు.. నాకు కొంచెం తల నొప్పిగా ఉంది. నువ్వు వెళ్ళి ఆడుకో"
"అయ్యో.. వద్దులే.. వెళ్ళిపోదాం " అంటూ భుజంపై చెయ్యి వేసింది. ఆ చనువు తియ్యగా ఉండడం వల్లనో ఏమో నేను ఆ చెయ్యి తియ్యమనలేదు. ఆ చనువు నాకు బాగా నచ్చింది. ఆ చనువే నన్ను సెల్లార్లో కార్ పార్కింగ్ వరకు నడిపించింది.
కార్ డోర్ తీసాను. కార్ డాష్ బోర్డ్ మీద నేను మర్చిపోయిన నా సెల్ ఫోన్, ఆక్సిజన్ మాస్క్ తొలగించబడ్డ హార్ట్ పేషంట్లా కొట్టుకుంటుంది. చూసేసరికి నాన్న నుంచి పద్దెనిమిది మిస్డ్ కాల్స్.
"ఇన్నిసార్లు ఎందుకు చేసాడు నాన్న ? బహుశా గుర్తొచ్చి ఉంటాను ! ఊళ్ళో ఊసుపోదు కదా. ఇంటికి వెళ్ళాక మాట్లాడ వచ్చులే.." అనుకుంటూ కార్లో కుదురుకున్నాను.
పొద్దున్న బస్ లో వెళ్తున్నప్పుడు చికాకుగా అనిపించిన ట్రాఫిక్, శైలూ పక్కన ఎ.సి. కార్లో ప్రయాణిస్తుంటే హాయిగా అనిపించింది. ఇదే ఐన్ స్టీన్ ప్రతిపదించిన సాపేక్ష సిద్ధాంతం ! న్యూటన్ 'తల' పై తలపై రాలిన ఆకర్షక వేదాంతం !
మధ్యలో ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఆపమంది. దిగి ఐస్ క్రీం కార్లోనికే తీసుకు వచ్చింది. తన స్ట్రాబెర్రీ లిప్ స్టిక్ ఫ్లేవర్ తో కలిసిన వెనిలా ఐస్ క్రీం కళ్ళుమూసుకుని తింటుంటే కన్యాకుమారిలో సన్ సెట్ పాయింట్ దగ్గర అపసవ్య దిశల్లో ఏకమైనట్లున్న సూర్య చంద్రులు కనిపించారు !
ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి పక్కనే ఉన్న మా ఫ్లాట్ కి బయలుదేరాను.
                                       ******************
రాత్రి తొమ్మిదిన్నర...
నా ఫ్లాట్ తలుపు తెరిచీ తరవగానే ఇంటర్ కాం మోగింది.
"సర్... సెక్యూరిటీ ని మాట్లాడుతున్నా... మీ కోసం ఎవరో విజిటర్ వచ్చారు. పేరు సుందర రావు గారట ! ఆయన మీకు తెలుసా ?"
"సుందర రావు గారా !! ఏదీ.. ఒకసారి ఫోన్ ఇవ్వు"
"సూరి బాబూ... నేనేరా "
"నాన్నా... నువ్వెప్పుడు సిటీకి వచ్చావ్ ? బయలుదేరే ముందు ఫోన్ చేస్తే స్టేషన్ కి వచ్చే వాడిని కదా"
"పెళ్ళి డేట్ దగ్గర పడుతుంది కదా... ఆ పనులేవో ఉంటే బయలుదేరాను. ఊర్లో బండి ఎక్కినప్పుడు నీకు ఫోన్ చేసాను...నువ్వు తీయలేదు. ఏదో పనిలో ఉండి ఉంటావులే ! ఈ సెక్యూరిటీ వాడు లోపలకి పంపించడంలేదు. బయట వాళ్ళను ఫ్లాట్స్ లోనికి పంపించాలంటే రెసిడెంట్ పెర్మిషన్ ఉండాలట కదా.. నన్ను వదలమని వీడికి కొంచెం చెప్పరా" -ఎంత అలసిపోయి వచ్చాడో నాన్న .. అతని గొంతులో ఆజ్ఞ కూడా అభ్యర్ధనలా వినబడుతుంది.
ఫోన్ సెక్యూరిటీ తీసుకున్నాడు...
"ఏయ్ సెక్యూరిటీ.. మా నాన్నని పోల్చలేదా ? ఆయన్ని వెంటనే పంపించు" -నా మాటలో కోపం వాడిని భయపెట్టగలిగేటంత గరుకుగా లేదు.
"మన కమ్యూనిటీలో ఉన్నవాళ్ళని చూడడానికి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. అందులో మీ నాన్న ఎవరో ఎవరికి తెలుసు ? మీ నోటి మాట మీద విజిటర్ ని పంపించడం కుదరదు. వచ్చి సంతకం పెట్టి తీసుకుపోండి సార్" అని వాడు ఫోన్ పెట్టిన శబ్దం, దెబ్బలా నా చెంపను తాకింది.
ఫోన్ పెట్టి చుట్టూ చూసాను. ఇప్పుడు నేనుంటున్న ఫ్లాట్, చిన్నప్పుడు నేనున్న హాస్టల్ లా కనిపించింది.
గోడ మీద ఫొటోలో ఇద్దరు మనుషులు " ఈ హాస్టల్ లో చేరడానికా బాల్యమంతా ఆ హాస్టల్ లో గడిపావు ? ఇదేనా గొప్పవాడివి అవ్వడం అంటే?" అని నన్నే చూసి నవ్వుతున్నారు... 
ఆ ఇద్దరూ...
జీవితకాలపు రెసిడెంట్ ని అయిన నేను...
నా జీవిత కాలపు విజిటర్ అయిన నాన్న !

                                      ******* సమాప్తం *******









5 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ధన్యవాదాలు మనోహర్ గారు. ఈ కధ ఈనాడు కధల పోటీ లో బహుమతి పొందిన కధ. పోటీ నిబంధనల ప్రకారం స్థలాభావం వల్ల కధను కుదించి వ్రాసాను.

      తొలగించండి
  2. మన సొంతింట్లో మనమే పరాయివాళ్ళమైపోయే అపార్ట్‌మెంట్ జీవితాలనే గ్రేట్ అంటుంది లోకం. గేటెడ్ కమ్యూనిటీ ఒక పెద్ద స్టేటస్ సింబల్ కూడా. మన సెక్యూరిటీ కోసమే అని ఎంత నచ్చ చెప్పుకున్నా మన మనసు అంగీకరించదు.

    రిప్లయితొలగించండి