ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, జూన్ 2014, శనివారం

రెక్కలు (కధ)

                                    రెక్కలు

                  (25/5/2014 ఈనాడు ఆదివారం అనుబంధం ప్రచురితం)

                                     

   

         
నా పడకగది ప్రశాంతంగా వుంది. గదిలో నా ఆన లేనిదే గాలి అంగుళం కూడా కదలదని కించిత్ గర్వం నాదిఅప్పుడే స్నానం చేసి, కాటన్ చీర కట్టుకొని నా గదిలోకి అడుగిడింది సునందతడిసిన కురులను ఆరబెట్టుకునేందుకు పూనుకుని, స్విచ్ బోర్డ్ లో 'ఫాన్' అని రాసి వున్న స్విచ్ ఆన్ చేసింది - మనిషి మీట నొక్కితే చచ్చినట్లు తిరగవలసిన పంఖాను నేనని గుర్తు చెస్తూ.
          మనదంతా నైట్ డ్యూటీనే. పగలు అట్టే తిరగవలసిన శ్రమ వుండదు. భర్త రోజంతా బ్యాంకులో శ్రమిస్తుంటే, ఈవిడ హాల్లో సీరియల్ వీక్షణలో తరిస్తూ, అక్కడ మా అన్నయ్యను ఫుల్ స్పీడ్ లో తిప్పుతూ వుంటుంది.
          రెండేళ్ళ క్రితం కొత్తపెళ్ళికూతురిలా ఇంట మెట్టిన సునంద, నేడు నిండు గర్భిణి. ఇన్ని లక్షల జీవరాశుల్లో మానవ జన్మంత మహోత్కృష్టమైనది మరొకటి లేదనిపిస్తుంది. అందునా స్త్రీగా పుడితే మాతృత్వపు మధుర ఫలాలు 'కడుపారా' ఆస్వాదించవచ్చును కదా! ఇలా ఫాన్ గానో, కూలర్ గానో వుండే కంటే ఇంతిగా పుడితే "పుట్టే" ఆనందం అంతా ఇంతా కాదేమో! మనుషుల కోర్కెలు తీర్చడం లో తలమునకలై వున్న వేలుపులందరూ వేలుసైగతో తిరిగే నా వేదన వింటారా ?
          పుట్టబోయే బిడ్డకోసం ఆమె పడే ఆరాటం అనుపమానం.నాకుకూడా బుజ్జిగాడిని వీలైనంత తొందరగా చూడాలని ఆతృతగా ఉంది. "నువ్వేంటి కన్నతల్లిలా పరితపిస్తున్నావు? నువ్వు కూడా మాలాంటి వస్తువు మాత్రమే.మనకు బంధాలు, బాధలు ఉండవు" అంటూ గేలి చేశాయి నా మిత్రులైన ఫొటొఫ్రేములు,బీరువాలు,పుస్తకాలు,కంప్యూటరు,రీడింగ్ టేబులు.
          "ఛెస్! మీతో నాకు పోలికేంటి? నేనుకూడా మనుషుల్లా తిరగగలను,శబ్దాలు చేయగలను,గాలి పీల్చుకోగలను,గిలిగింతలు పెట్టనూగలను" అని గదమాయించేసరికి తలదించుకున్నాయి.
                నేను ఎదురుచూస్తున్న రోజు రానే వచింది. సునందమ్మ ఈ ఇంటి వారసుడిని ఎత్తుకుని భర్త సహకారంతో నెమ్మదిగా నడిచి వచ్చి మంచంపై పడుకుని వాడిని పక్కనే వెసుకుంది.
        సప్తవర్ణశోభితంలా ఉన్న ఆ శిశువు సప్తాశ్వరధసారధిలా ప్రకాశిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నన్ను తిరగమని ఆజ్ఞాపిస్తారా..ఎప్పుడెప్పుడు అనురాగంతో వెచ్చగా మారిన నా రెక్కల ద్వారా ఉద్భవించినట్టి మమకారపు సమీరాలతో వాడిని మృదువుగా హత్తుకుంటానా.. అని ఉవ్విళ్ళూరుతుండగా, నా తొందరను గ్రహించిన వాడిలా స్విచ్ ఆన్ చేశాడు సునంద భర్త.
        అచేతనంగా ఉన్న నాలో జవసత్వాలు నింపినట్టి విద్యుత్ కి జోతలర్పిస్తూ, మోటరు మూలల్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుంటూ నా రెక్కలకి పరిమితమైన వృత్తపు గిరి లో గిర..గిర..గిరగిరగిరగిర తూలుతూ, ఊగుతూ,తిరుగుతూ,ఎగురుతూ 'మర' మాతృత్వపు ఝంఝామారుతాలైన  నా ఉచ్వాస నిశ్వాసలు, తూరుపు సింధూరపు ఎరుపు పులుముకున్న వాడి చరణాలను ముద్దిడుతుంటే చరించగలగడం లోని ఘనత బోధపడింది.
        నాటి నుండి నాకు పగలూ రాత్రీ కూడా పని కల్పించాడీ బుడతడు. నేను తిరగనిదే పడుకునేవాడు కాదు. ఎప్పుడైనా చలేసి నన్ను ఆపితే వెంటనే కళ్ళు తెరిచి ఆరున్నొక్క రాగం లో గానం చేసి నేను మరలా తిరిగే దాక ఆపేవాడు కాదు. నా రెక్కల సడే వాడికి జోల. వాడికి "రవి" అని నామకరణం చేసారు. శతకోటి సూర్యసమప్రభలతో ప్రజ్వలించే నా చిన్ని తండ్రికి ఈ పేరు అతికినట్లు సరిపొయింది.
        కాలం నాకన్నా పదిరెట్లు వేగంతో తిరుగుతున్నట్లుగా ఉంది. రవికి అన్నప్రాశన, అక్షరాభ్యాసం జరిగిపోయి చాలాకాలం గతించింది.బుడిబుడి అడుగులతో మొదలుపెట్టి లేడిపరుగు తీసేటంతటి వాడయ్యాడు. అత్త-తాతలతో ప్రారంభించి పద్యాలు,పాటలు పాడే చిరు త్యాగరాజు అయ్యడు. వాడి ఉత్సాహం చూసి సంగీతం నేర్పించారు.
        వాడి గాత్రం వర్ణింపశక్యంకాదు. ఆ స్వరకాసారంలో మునిగి తేలవలసిందే! నిన్నకాక మొన్న బడిలో చేరిన పిల్లవెధవ,చూస్తుండగా పదవతరగతి పూర్తిచేసాడంటే ఆశ్చర్యమేస్తుంది.ఆ ఏటికి పదవతరగతి పాసైన వారిలో ఆ పాఠశాలకే మొదటి స్థానంలో నిలిచాడు. ఈ నగరంలో ప్రఖ్యాత కాలేజీ వారు ఉచితంగా ఇంటర్మీడియట్లో సీటు ఇచ్చారు వాడికి.
         ఏడాది గడిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నట్లు సెకండ్ ఇయర్లో లేడనిపిస్తుంది. మునుపటిలా సంగీతం, చదువు పట్ల శ్రద్ద లేదు.ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ లో మాట్లాడుతూనో లేదా చాట్ చేస్తూనో ఉండేవాడు. తల్లైనా,తండ్రైనా గదిలోకి వస్తే మాత్రం చదువుతున్నట్లు నటించేవాడు.వాళ్ళటు వెళ్ళగానే మరలా  సెల్ఫోన్ చేబుచ్చుకునేవాడు. అమ్మానాన్నలకు ఎంతో గౌరవమిచ్చే రవి, ఇప్పుడు వాళ్ళు ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నాడు. అమ్మ జాగ్రత్తలు చెప్తుంటే చిరాకుపడుతున్నాడు. నాన్న మాటకి ఎదురు చెప్తున్నాడు.
        ఏమైంది వీడికి ? పుస్తకం పట్టుకుంటాడే గానీ చదవడం లేదు. శ్రీరాగంలో "ఎందరో మహానుభావుల"ని ఎన్నాళ్ళైంది ? రీడింగ్ టేబుల్ పైన రాబిన్ శర్మ, జాన్ గ్రీషం, జఫ్రీ ఆర్చర్ల దగ్గర్నుండి మన ఆరుద్ర,శ్రీపాద, శ్రీశ్రీ వరకు..." మా జోలికొచ్చి ఎన్నాళ్ళైందోయ్ ?" అని అడుగుతున్నట్లున్నారు. ఇది కుర్రాళ్ళందరికీ సహజంగా ఈ వయసులో దాపురించే వికారానికి పరాకాష్టా?
        ఎలాగో ఒకలా చదివి మొత్తానికి మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. చదువు మీద అంత దృష్టి పెట్టకపోయినా వాడికి సహజాతమైన తెలివికి చక్కటి ర్యాంకు, తద్వారా పెద్ద కాలేజీలో మెడిసిన్ సీటు సాధించాడు. రవి తల్లిదండ్రులు "మా కొడుకు డాక్టర్ కాబోతున్నాడ"ని ఊరంతా టముకు వేస్తే, నేను గదంతా చప్పుడు చేసాను వాళ్ళకు ఏవీ తక్కువకాకుండా.
      ముందుగా మొక్కుకున్నట్లు కుటుంబమంతా శ్రీవారి దర్శనానికి వెళ్ళి, నాకు ఓ నాలుగు రోజులు సెలవిచ్చి ఈరోజే వచ్చారు. ప్రయాణపు బడలిక వల్ల కాబోలు వచ్చీరాగానే స్నానాలు,టిఫిన్ లు కానిచ్చి తలో మంచం ఆక్రమించారు. కాసేపు సేదతీరాక సునంద దంపతులిద్దరూ ఊళ్ళో బంధువర్గానికి ప్రసాదం పంచడానికి బయలుదేరారు. వాళ్ళటు వెళ్ళగానే రవి విషణ్ణ వదనంతో గదిలోకి వచ్చి మంచం పై పడుకున్నాడు.
        ఐదు సెకన్లకు ఒక తడవ సెల్ చూసుకుంటున్నాడు. పది సెకన్లకు ఒకసారి ఏదో నంబరు డయల్ చేసి అవతల పార్టీ 'బిజీ' అన్న మాట విని అసహనంగా మంచానికేసి చెయ్యి కొట్టుకుంటున్నాడు. రెండు గంటలసేపు అదే తంతు. అప్పుడొక మెస్సేజ్ వచ్చింది. అది చదివిన మరుక్షణం వాడి దుఖం కట్టలు తెంచుకుంది. దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చాడు. తల గోడకేసి బాదుకున్నాడు, పాలు గారే బుగ్గలను గోర్లతో గీరుకున్నాడు.వాడి ఏడుపుకి తలగడ తడిసి ముద్దయ్యింది. విసురుగా ఫాన్ స్విచ్ వేసినా కరంటుకోత మూలాన తిరగలేకపోయాను.
        "ఏమైంది నాన్నా...ఎందుకు బాధ పడుతున్నావ్...నాతో చెప్పుకోరా" అని నేను అడుగుతున్నా నా యాంత్రిక భాష వీడికి అర్ధంకాదు కదా. ఓ గంటసేపు వాడి రోదన నిరాటంకంగా సాగింది. తరువాత ఒక స్థిరనిశ్చయానికి వచ్చిన వాడిలా నావైపు చూశాడు. మంచంపైన ఉన్న దుప్పటి తీసి నా మెడకు చుట్టాడు. నాకు ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపు రెండో అంచు వాడి మెడకు చుట్టుకుని గాల్లో వేలాడడానికి ఉద్యుక్తుడయ్యాడు. నాకే గనక గుండె ఉండుంటే అది ఈపాటికి ఆగి ఉండేది. నా రవి నా మెడకే ఉరి బిగించుకుని గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం కోసం పెనుగులాడుతుంటే తట్టుకోలేక ఏడుస్తున్నాననడానికి నేను ఊగుతూ చేసే ఇనుప రోదనే సాక్షి. నాకే గనక చేతులుంటే వీడ్ని అమాంతంగా కిందకి విసిరేద్దును.
        ఎంత ధైర్యం వీడికి. ఇన్నాళ్ళు ఎంతో అపురూపంగా పెంచిన తల్లిదండ్రులు వీడికి గుర్తులేరా? భయంకరమైన జబ్బులతో బాధపడే రోగులు, రేపోమాపో రాలిపోయే వృధ్ధులు,వికలాంగులు,రోడ్డుపై బ్రతుకీడుస్తున్న నిరుపేదలు బ్రతకడానికి తాపత్రయపడుతుంటే అన్నీ ఉన్న వీడు మాత్రం మొగ్గలోనే రాలిపోతాడా? అదికూడ నా సహకారంతోనా? ఇందుకేనా వీడికి ఇన్నాళ్ళు సేవలు చేశాను? వీళ్ళేదు..ఎలాగైనా రవిని కాపాడాలి.లేదంటే వీడిపై నాకున్న ప్రేమ ఓడిపోయినట్లే. ఏదో ఒకటి చేసి కాపాడాలి. కానీ ఏం చేయగలను?
        ఒక్కటే మార్గం. వాడు వేలాడుతున్న రెక్క తెగి కిందపడితే బతుకుతాడు. నా రెక్క తెంచుకోడానికి నేను సిద్ధం. కానీ తెగేది ఎలా? ఇంతలో కరెంటు వచ్చింది. దేవుడనేవాడు ఒకడున్నాడని మనుషులందరూ ఎందుకు నమ్ముతారో నాకిప్పుడు అర్ధమయ్యింది.ఇంతసేపు ఎలా తిరగగలనో అని మధనపడుతున్న నాకు ఈ విద్యుత్తు ఆలంబననిచ్చింది. కానీ రవి బరువు వల్ల తిరగలేకపోతున్నాను.
        రవిని ఎత్తుకొని తిరగడానికి అంతర్గతంగా ఉన్న శక్తినంతటినీ క్రోడీకరించి మెల్లగా నడక మొదలుపెట్టాను. తిరగడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే నా రెక్క బలహీనపడసాగింది. కన్నపేగు తెంచుకుని మాతృగర్భం నుండి బయటపడిన శిశువులా, నా రెక్కతో పాటు మంచం మీదపడ్డాడు రవి. నా ఆనందం అర్ణవమైంది. నా రెక్క తెంచి పునర్జన్మనిచ్చి రవిని కాపాడుకోగలిగానన్న స్పృహవల్ల కలిగిన అనుభూతి అనిర్వచనీయం. ఇకనుండి నేను కూడా వీడి తల్లినేనని నా బాహుద్వయంతో వృత్తాకారంలో తిరిగి ప్రకటిస్తూ మురిపెంగా వాడిని చూసుకున్నాను.
        వాడి కళ్ళల్లో చావుభయం ప్రస్ఫుటమైంది. వణికే చేతులతో మెడచుట్టూ బిగుసుకున్న దుప్పటిని తొలగించుకున్నాడు. మృత్యుముఖం నుంచి బయటపడ్డ మార్కండేయుడిలా గోచరిస్తున్నాడు రవి.పశ్చాత్తాపానికి లోనౌతున్నట్లుగా కనిపిస్తున్నాడు. మళ్ళీ ఇలాంటి పిచ్చిపని చెయ్యనన్నట్లు ఓ నిట్టూర్పు తీసి నీళ్ళునమిలాడు.
        ఇంతలో అక్కడికి వచ్చిన సునంద,గదిలో భీకర వాతావరణాన్ని పరికించి 'ఏమైంద'న్నట్లు కళ్ళెగరేసింది. తల్లిని చూడగానే ఉబికివస్తున్న కన్నీళ్ళతో అమాంతంగా ఆమెను చుట్టేసి గుండెలవిసేలా ఏడ్చాడు. "అమ్మా క్షమించమ్మా...ఇంకెప్పుడూ..." వాడిని పూర్తిచేయనివ్వకుండానే "పిచ్చి సన్నాసి...ఫాన్ రెక్క విరిగి మీద పడినంత మాత్రాన ఇంతలా బెదిరిపోయావా? ఎప్పుడో మీ నాన్న చిన్నప్పటి ఫాన్...ఏమండీ...ఈ బొక్కి ఫాన్ పీకెయ్యమంటే మీరు వినలేదు.ఇప్పుడు చూడండి, బాబు ఎంతలా బెదిరిపోయాడో" అని భర్త మీద అరిచి, రవికి నీళ్ళు తాగించడానికి వాడిని తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది.

        "దానికేమోయ్..ఇప్పుడే పీకేస్తాను. నాన్నా రవీ..నీళ్ళు తాగాక స్టోర్ రూంలో ఉన్న టూల్ కిట్ తీసుకురా దీని సంగతేంటో తేల్చేద్దాం" అన్నాడు నావైపు గుడ్లురిమి చూస్తూ.
        అప్పటికే స్విచ్ ఆపేయడం మూలాన నెమ్మదిగా నీరసిస్తూ చలనంలేని స్థితికి చేరుకుని రవి రాకకై ఎదురుచూడసాగాను బార్లా చాచిన రెక్కలతో.
                               **************************