ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, ఆగస్టు 2017, బుధవారం

ప్రవాసం

ప్రవాసం

                             (16 జులై 2017 ఆంధ్రజ్యోతి ప్రచురితం)



"నేను బెంగాలీ నేర్చుకోను" అనుకున్నాను నాలో నేనే.
నిజానికి బెంగాలీ నేర్చుకోమని అశుతోష్ నన్నేమీ అడగలేదు.
ఒకవేళ తనే స్వయంగా అడిగి ఉంటే మా పెళ్ళైన తరువాత ఈ రెండేళ్ళలో తను నన్ను కోరిన మొదటి కోరిక కనుక సరే... అనేదాన్నేమో !
అవునూ... మొదటి కోరిక ఎలా అయ్యిందీ....? రెండోదికదూ.
"చటర్జీ" అన్న తన పేరు నా పేరు వెనుక తగిలించుకోమని అడిగాడుగా. అది మొదటి కోరిక కదా !
అడిగాడా ? ఎక్కడ అడిగాడు ? "తగిలించుకో.." అని ఆర్డర్ చేశాడు. కనుక అది కోరిక కాదు. ఆజ్ఞ.
త్రేతాయుగం స్త్రీ రెండు వరాలు పొందవచ్చును. కలియుగపు స్త్రీ రెండు వరాలు తీర్చననవచ్చును.
“బాగీరధి రెడ్డి” కాస్తా “బాగీరధి చట్టర్జీ” గా మారిపోతే ఎలా ? మన ఫేస్ బుక్ ప్రొఫైల్ కి ఎవడిదో డిస్ప్లే పిక్ పెట్టినట్లుండదూ ?
చేపలపులుసు చేశాను. వాళ్ళ బెంగాలీ స్టైల్లో చెయ్యమంటాడు.
"ఎందుకు చెయ్యను... అత్తయ్యగారికి ఫోన్చేసి ఇవ్వు. ఎలా చెయ్యాలో అడుగుతాను. అత్తయ్యగారే నాతో మాట్లాడకపోతే బెంగాలీ చేపలపులుసు నాకెవరు నేర్పుతారు ?" అని అడుగుతాను.
"మన పెళ్ళిని వాళ్ళింకా ఒప్పుకోవడం లేదు" అని ఇంగ్లీష్లో దీనంగా చెప్తాడు.
ఇంటర్ క్యాస్టే ఒప్పుకోరు. మాది ఇంటర్ స్టేట్ కూడా. బెంగాళీ బ్రాహ్మర్లబ్బాయి, బొబ్బర్లంక రెడ్ల అమ్మాయి. టూ మెనీ క్వారల్స్ అండ్ కాంప్లికేషన్స్.
“గూగుల్ ఇట్” అన్నాడు.
యూట్యూబ్లో చూసి మర్నాడు చేస్తే అది నీరు పట్టేసి వికారంగా అయ్యేసరికి మళ్ళీ బెంగాళీ వంటల జోలికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చి కారెక్కి ఆఫీసుకెళ్ళిపోయాడు. అలా నా ప్రేమ "నీరు" గారిపోయింది.
పొద్దున్న వంటయ్యాక అమ్మ ఫోన్చేస్తుంది. అల్లుడు ఎలా ఉన్నాడని అడుగుతుంది అన్యమనస్కంగా. నాన్నగారు ఇంట్లో ఉన్నా పొలానికెళ్ళారంటుంది. ఆరోగ్యం బాగోలేకపోయినా బాగున్నాం అంటుంది. నేను చేసిన పని వల్ల చెల్లికి మంచి సంబంధాలు రావేమోనని బెంగపడుతున్నానంటుంది. ఫోన్ పెట్టేస్తుంది.
పెట్టబోయే ముందు "బెంగాళీ నేర్చుకుంటున్నావా ?" అని అడిగి మరీ పెట్టేస్తుంది.
నేర్చుకోవాలా ? నేను నేర్చుకోను. అలా అని బెంగాలీ అంటే ఇష్టం లేదని కాదు. తెలుగంటే ఇష్టమని. తెలుగువారి అస్థిత్వాన్నికాపాడదామని. ఇంతటి గురుతర బాధ్యత నాకెందుకనా ? చెప్తా.
నేను చిన్నప్పటి నుంచి చాలా మంది ఇంటర్నేషనల్,ఇంటర్స్టేట్, ఇంటర్ రిలీజియస్ మేరేజెస్ చేసుకున్న తెలుగువాళ్ళ గురించి విన్నాను. కొందర్ని చూసాను. ఈ సదరు ఇంటర్ లేంగ్వేజ్ మేరేజెస్ చేసుకున్న తెలుగువాళ్ళు... చచ్చినట్లు తమ జీవిత భాగస్వాముల భాష నేర్చుకుంటారు తప్ప వారి మెరుగైన సగాలు (బెటర్ హాఫ్స్ తర్జుమా ! నాబొంద !) చస్తే తెలుగు నేర్చుకోరని మరి నా యొక్క పరిశీలన.
చాలా శాతం కేసుల్లో మన తెలుగు సగాలకి ఆల్రెడీ అవతల వాళ్ళ భాష వచ్చేసుంటుంది. ఇహనే ఆ మిగతా సగం మన భాష నేర్చుకుంటుందా ? అందుకే అశుతోష్ తెలుగు నేర్చుకుంటే కున్నాడు. లేదంటే లేదు. ఇంగ్లీష్ అక్కరకొస్తుంది. నేను మాత్రం బెంగాలీ నేర్చుకునే సమస్య లేదు.తెలుగు తోడు వెతుక్కున్న బెంగాలీ నైటింగేలే తెలుగులో కూతపెట్టలేదు. ఇంకనేనెంత ?
కాలింగ్ బెల్ మ్రోగింది. అమాజాన్ కొరియర్. పక్క ఫ్లాట్ కి తాళం వేసి ఉండడంతో ఆ కొరియర్ని నన్ను తీసుకోవల్సిందిగా హైదరాబాదీ ఉర్దూ కలిసిన హిందీలో చెప్పాడు కొరియర్ బాయ్. నేను చేతులు  చాపకపోవడంతో వాడి చెవికి భుజానికి మధ్యనున్న సెల్ ఫోన్ నాకు ఇచ్చి  మాట్లాడమన్నాడు.
ఫోన్లో పక్క ఫ్లాట్లో ఉండే అతను అనుకుంటా. ఆఫీస్లో ఉన్నాను. దయచేసి కొరియర్ తీసుకోండి... సాయంత్రం వచ్చి మీ దగ్గర నుంచి తీసుకుంటానని అభ్యర్ధించాడు.
ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా హైదరాబాదీ కాదేమో ! ఇంగ్లీష్ లోనే మాట్లాడాడంటే తెలుగువాడేనేమో ! ఏమో !
సాయంత్రం వచ్చాడు. అశుతోష్ రాక ముందే. అనిర్బాన్ అట పేరు. పూర్తి పేరు అనిర్బాన్ రే ! సత్యజిత్ రే.. లా లేదూ ? బెంగాళీనా ?
జుట్టుకి నూనె పెట్టి దువ్విన తీరు, ముఖంలో సౌమ్యత, సున్నితత్వం. చూడబోతే బెంగాలీ అన్నది స్పష్టం.
హైటెక్ సిటీలో ఏదో కంపెనీలో పని చేస్తున్నాడట.
కొరియర్ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
అశుతోష్ వచ్చి స్నానాలయ్యాక భోజనాలప్పుడు అనిర్బాన్ గురించి చెప్పాను. మీ వాడేనట ! అని.
ఎర్రగాచూశాడు. “Met him in the lift. He is a Bangladeshi (లిఫ్ట్ లో చూసాను. వాడు మావాడు కాడు. బంగ్లాదేశ్ వాడు)” అన్నాడు.
ఈస్ట్ బెంగాల్ విడిపోయి పాకిస్తాన్లో కలిసి పోయినప్పుడు రాని కుటుంబాలన్నీ ఢబ్బైఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడ్డాక వెస్ట్ బెంగాల్ కి వలస వచ్చాయని ఆగి ఆగి చెప్పాడు ముద్ద ముద్ద తినే విరామంలో.
అలా వలస వచ్చిన కుటుంబాలకి ఇండియాలో స్థిరనివాసం ఏర్పాటు చెయ్యడానికి భారత ప్రభుత్వం అశుతోష్ లాంటి జమిందారీ(ఒకప్పుడు) కుటుంబాల ఆస్థులు స్వాధీన పరచుకుందని చెప్పాడు చేతులు కడుక్కుని.
“అదా కడుపు మంట ?”
“కీ?????”
“అదే... కారం తిని కడుపు మండినట్లుంది రసగుల్లా తింటావా ?”
“హ్యా.”
ఫుట్ బాల్ పెట్టాడు.
"మ్యాంచిస్టర్ చూస్తావా?" అని అడిగితే
"మెగాస్టార్నిచూస్తా" అని చెప్పాను.
"కోరికోరి కాలుతుంది ఈడు ఎందుకో.." అంటున్నాడు రౌడీ అల్లుడు.
"కునుకేదీ కనబడదే ఎటు వెళ్ళిందో ఏమో ! లోకాలను జోకొట్టే పనిలో ఉందేమో !
కొంగు విడిచిపెట్టని నా సిగ్గెటుపోయిందో ! జతపురుషుని చేరేందుకు సిగ్గుపడిందేమో !" పాట హాల్లో ప్లే అవుతున్నా పాట మొదలైన పది సెకెన్లకే బెడ్రూంలోకి వెళ్ళిపోయిన మాకు వినబడడం లేదు.
వర్ణమాలలో అచ్చులు ఎన్నో విరామం లేకుండా అచ్చులు వేసి వివరించి అలిసిన కాస్త నిశ్శబ్ధంలో "చందమామ నిదురచెదరనీ... హా" అని సిరివెన్నెలనడం మాత్రం వినబడింది.
కోల్డ్ కాఫీ కబుర్లు మొదలెట్టాడు. Don’t talk to them (వాళ్ళతో మాట్లాడకు) అన్నాడు నా వేళ్ళు నిమురుతూ.
“ఎవరితో”.
“With that east fellow (అదే ఆ ఈస్ట్ ఫెలో తో)”.
“అతను ఈస్ట్ బెంగాలీ అని నీకెలా తెలుసు ?”
“With his dialect (బెంగాలీ మాట్లాడే యాస బట్టీ తెలిసిపోతుంది).”
“వాళ్ళ యాసకి ప్రత్యేకమైన లిపి, ప్రత్యేకమైన భాష అనే గుర్తింపు లేవా ?” అడిగాను తన కనుబొమ్మలు నిమురుతూ.
“యాసకి భాషగా గుర్తింపేమిటీ ?” అన్నట్లు చూశాడు. దబాయించి పోరాడ్డం చేతకాదు. ప్చ్.
రోజూలాగానే పదిగంటలకి ఫోన్ వచ్చింది. అశుతోష్ వాళ్ళమ్మ. అదే... మా అత్తయ్యగారు. రోజూ రాత్రి భోజనాలయ్యాక కొడుక్కి ఫోన్చేస్తుంది. కనీసం ముప్పావు గంట మాట్లాడతాడు.
"ఎవరు ?" అని అడుగుతాను తెలిసినా.
"తొమర్ ససురి" అంటే మీ అత్తయ్యగారు  అని. నాకొచ్చిన ఏకైక బెంగాలీ పదం.
"నాతో మాట్లాడరా".పెదవి విరుస్తాడు.
రోజూ తను మాట్లాడతాడు. రోజూ నేను అడుగుతాను. మన పెళ్ళిని ఒప్పుకున్నారా అని. అదే జవాబు. "Takes Time" అని. ఒక్కరోజు కూడా మీ అమ్మానాన్నా ఒప్పుకున్నారా అని అడగడు.
అయినా ఆడపిల్ల తల్లిదండ్రుల ఒప్పుదల ఎవడిక్కావాలి ? తెల్లవారిపోయింది.
*******************
ఆ రోజు సాయంత్రం ఆఫీస్నుంచి ఎంగిలి టప్పర్ వేర్ తో పాటు ఒక వార్తను కూడా మోసుకొచ్చాడు అశుతోష్.
అమెరికా వెళ్తున్నానని.
మూడునెళ్ళకే. బిజినెస్ వీసా. షార్ట్ ట్రిప్. ఎళ్ళుండే బయలుదేరాలి. నన్ను మా ఊరెళ్ళిపొమ్మంటాడు.
"మా ఇంట్లో మాత్రం ... నన్ను రానిస్తారనుకున్నావా ?"
"ఏం రోగం?" అన్నట్లు చూసి డెబిట్ కార్డ్ చేతిలో పెట్టాడు.
"ఒన్ లాక్ ఉంది. సరిపోతుందనుకుంటున్నా" అనడంలోనే "సరిపెట్టుకో" అన్నభావం ఉంది.
రెండు రోజుల్లో షమ్షాబాద్ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోయాడు.
**********
ఓ రోజు అనిర్బాన్ తలుపు కొట్టాడు. మొన్న తీసుకున్న ఎమెజాన్ కొరియర్ రిటర్న్ ఇచ్చేస్తున్నానని.. వాడు తీసుకోడానికి వస్తే ఇచ్చేయమని.. తను ఆఫీస్ కి వెళ్తున్నాడని చెప్పాడు.
"మీరేం అనుకోకపోతే ఇందులో ఏముందో తెలుసుకోవచ్చా?" అని అడిగాను.
"హేరాం సినిమా" అన్నాడు కొంచెం మొహమాటపడి. హిందీ హేరాం అనుకుని ఆర్డర్చేస్తే తమిళ హేరాం డివిడి వచ్చిందట. అందుకే రిటన్చేసేస్తున్నాడట.
హేరాం అంటే నా అభిమాన నటుడు కమల్ హాసన్ సినిమా అని విన్నాను. తెలుగు డబ్బింగ్ దొరక్కపోయేసరికి చూసే అవకాశం దొరకలేదు.
మీరేం అనుకోకపోతే ఈ డి.వి.డి. నాకు ఇస్తారా అని అడిగేసాను. నవ్వుతోనే తన ఒప్పుకోలునూ తెలియజేసి వెళ్ళిపోయాడు.
చెన్నైసత్యభామ యూనివర్సిటీలో ఎం.టెక్ అయిపోయిన దగ్గర్నుండి తమిళ్ సినిమాలతో టచ్ పోయింది.. సినిమా పెట్టుకు చూద్దామని ల్యాప్టాప్ కోసం వెతికితే అశుతోష్ యూ.ఎస్ తీసుకు వెళ్ళిపోయాడని అర్ధం చేసుకుని నిరుత్సాహపడ్డాను..
*****************
సాయంత్రం కింద లాన్లో వాకింగ్ చేస్తుంటే అనిర్బాన్ వచ్చి కలిసాడు.
హేరాం సినిమా చూసానేమోనని కనుక్కున్నాడు. ల్యాప్టాప్ లేదని చెప్పేసరికి వాళింట్లో హోంథియేటర్ ఉందని, అక్కడ చూస్తే తను కూడా చూసినట్లు ఉంటుందని అన్నాడు. అడగ్గానే డి.వి.డి. ఇచ్చిన మనిషికి కాదని ఎలా చెప్పడం ?
ఇద్దరం కలిసి చూశాం. ప్రతి వాక్యం పాజ్ చేసి దాని అర్ధమేమిటో వివరిస్తూ చూసేసరికి మూడు గంటల సినిమా ఆరుగంటలు పట్టింది.
ఆ సినిమాలో చూపించింది నూటికి నూరుపాళ్ళు నిజమంటాడు అనిర్బాన్. ఈస్ట్ బెంగాల్ని పాకిస్తాన్లో కలిపే సమయానికి 1947 లో జరిగినట్లుగా చూపించిన హిందూ-ముస్లిం అంత:కలహాలు నిజంగా జరిగాయంటాడు.
ఈస్ట్ పాకిస్థాన్లో హిందూ మహిళలపై ఈ సినిమాలో రాణీముఖర్జీపై జరిగిన రీతిలోనే దాడులు జరిగాయట. అప్పుడు ఈస్ట్ పాకిస్థాన్ నుంచి భారీగా హిందువుల వలస వెస్ట్ బెంగాల్ కి వచ్చిందట.
వాళ్ళంతా తమ గడ్డపై తమకున్నఇళ్ళు, స్థలాలు, పొలాలు వదులుకొని కట్టుబట్టలతో వలస వచ్చారట. అలా వచ్చిన కుటుంబాలలో అనిర్బాన్ కుటుంబం కూడా ఒకటట. ఎన్ని "ట" లో కదా ! నిజాలైతే అబద్దాలుగా మారిపోతే బాగుణ్ణు.
మరి 1971 యుద్ధం ఎందుకొచ్చిందని అడిగితే మళ్ళీ ఒక నవ్వు. భాష గురించి అట ! ఈస్ట్ పాకిస్థాన్ వాళ్ళు తమకు అలవాటైన బెంగాలీ మాట్లాడతామని. ఉర్దూ మాత్రమే మాట్లాడాలి, బెంగాలీని పూర్తిగా అధికారిక,వ్యవహారిక భాషగా విసర్జించాలని వెస్ట్ పాకిస్థానీల పట్టు. అది నచ్చక మళ్ళీ దాడులు, వలసలు, కష్టాలు వెరసి యుద్ధం. బంగ్లాదేశ్ ప్రసూతి.
అశుతోష్ చెప్పిన దానికి అనిర్బాన్ చెప్పిన దానికి పొంతన కుదిరింది. అక్కడ పాకిస్థాన్ వాళ్ళేమో హిందువులకు తరిమికొడితే ఇక్కడ అశుతోష్ లాంటి బెంగాళీలేమో "ఇలా వలస వచ్చిన బెంగాలీల వల్లనే మా జమీన్లు మాకు కాకుండా పోయాయి" అని వీళ్ళని హీనంగా చూస్తున్నారు.
వీళ్ళ ఆస్థులు బంగ్లాదేశ్లో ఉండిపోవడం వల్ల వలస బెంగాలీలు, వాళ్ళ వలస వల్ల ఆస్తులు కోల్పోయిన వెస్ట్ బెంగాలీలు మొత్తం మీద బెంగాళ్ జాతి మొత్తం పెద్దగా సిరిసంపదలు లేకుండా రోజులు నెమ్మదిగా నెట్టుకొస్తున్నారన్నమాట.
సినిమా అయిపోయింది. ఆన్లైన్లో హిందీ వెర్షన్ దొరుకుతుంది కదా డబ్బులు పెట్టి కొనడం ఎందుకు అని అడిగితే గాంధీ గురించి తీసిన సినిమా దొంగతనం చెయ్యడం ఇష్టంలేక అని నవ్వుతాడు.
భోజనానికి ముగ్దాల్, ఆలూ పొస్తో చేశాడు. వాళ్ళ పద్మా నదిలో పులసలు దొరుకుతాయంట. దాన్ని ఇల్లిష్ అంటారని చెప్పాడు.
భోజనం చాలా రుచిగా ఉంది. అశుతోష్ యూ.ఎస్. నుంచి వచ్చేలోపు బెంగాలీ వంటలన్నీ నేర్చుకుని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. అనిర్బాన్ని నేర్పమంటే ఎప్పటిలాంటి సమాధానమే ! ఒక నవ్వు.
అనిర్బాన్ వారానికి ఒక్క రోజే ఆఫీస్ కి వెళ్ళి మిగతా రోజులు వర్క్ ఫ్రం హోం చేసేవాడు. పొద్దున్నుండి రాత్రి వరకు బెంగాలీ సీరియల్స్ చూసేవాడు. నేను పగలంతా అతనింట్లోనే ఉంటూ బెంగాలీ వంటలు నేర్చుకునేదాన్ని. తన భార్యని కలవడానికి నెలకి ఒక సారి కోల్ కత్తా వెళ్ళినప్పుడు అక్కడి రసగుల్లా తెచ్చేవాడు.
కొన్ని రోజులకి అనిర్బాన్ పరిచయం వల్ల సుక్తో,పొస్తో,బెగున్ భాజా లాంటి వెజిటేరియన్ వంటలు... కొషా మంగ్షో, ముర్గిర్ జోల్ లాంటి నాన్ వెజ్ వంటలు వండడంతో పాటు బెంగాలీ అర్ధం చేసుకోగలిగే నేర్పుని కూడా కొంత సంపాదించాను.
మూడు నెలల్లో వస్తాడనుకున్న అశుతోష్ రెండున్నర నెలల్లోనే వచ్చేసాడు. సెమినార్ ఏదో ఉందని ఫ్లైట్ దిగిన మర్నాడే ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. సాయంత్రం తనని సర్ ప్రైజ్ చేద్దామని ఇన్నాళ్ళు నేర్చుకున్న విద్యంతా ప్రేమతో ప్రదర్శించి బెంగాలీ వంటలు ఘుమఘుమలాడించాను.
కానీ ఆన్ సైట్ రిటర్న్ పార్టీగా ఇచ్చిన టీం డిన్నర్లో తినేసానని డైరెక్ట్ గా బెడ్రూంలో దూరాడు.
రోజూ లాగానే రాత్రి పదింటికి వాళ్ళమ్మ నుంచి ఫోన్ వచ్చింది. ఈ రెండున్నర నెలల్లో అనిర్బాన్ వల్ల బెంగాలీ అర్ధం చేసుకోగలిగే సామర్ధ్యం ఏమాత్రం వచ్చిందో తెలుసుకోవాలనిపించి వాళ్ళ సంభాషణ విన్నాను.
“హలో షోనా, కమొన్ అషొ ? అరె హ్యా, ఒ పషై ఆచె. ఓ అమ దెర్సొం పొర్కెర్కథ జానై న. బుజ్షె నా కిచు, సుధు టకియె అచె. (హలొ డాలింగ్. ఎలా ఉన్నావ్ ? నా పెళ్ళామా ? అది ఇక్కడే ఉంది. తనకు మన గురించి తెలియదు. విన్నా ఏం అర్ధం కాదులే.)
అంటూ ఇంకా ఏవేవో మాట్లాడాడు. కానీ నాకు ఆ మూడు ముక్కలే అర్ధమయ్యాయి. జరుగుతున్నదేమిటో అర్ధం అవుతున్నా కానట్లు నటించడం ఎంత కష్టమో తెలుసా ? ఇంక నటించలేను అనుకున్నప్పుడు ఆ గదిలో నుంచి బయటకు వచ్చేసాను.
గంట తర్వాత ఫోన్పెట్టేసి వచ్చి "అమ్మ..." అన్నాడు నేనేదో అడిగినట్లు.
రాత్రి పాలలో ఒక నిద్రమాత్ర వేసి ఇచ్చాను. శుభ్రంగా పడుకున్నాడు.
తన ఫోన్ తీసాను. బయోమెట్రిక్ ఫేస్ రికగ్నిషన్ అన్-లాక్ పెట్టుకున్నాడు. తన ముఖం ముందు ఫోన్ కేమెరా ఆన్చేసి పెడితే మొబైల్ అన్-లాక్ అయ్యింది. ఫోన్ కాల్ లిస్ట్లో అద్రిజ అన్న అమ్మాయి నుంచి లాస్ట్ కాల్ వచ్చినట్లుంది. ఇన్నాళ్ళు అమ్మతో మాట్లాడుతున్నానని అబద్దం చెప్పి అశుతోష్ మాట్లాడింది దీనితోనేనా ! గ్యాలరీలో ఫోటోలు. ఆ పిల్లవే. కాకపోతే తన ముఖం ఆనించుకున్న చాతీ మాత్రం అశుతోష్ ది.
అదంటే అంత ఇష్టం ఉంటే దాన్నే చేసుకోవచ్చు కదా. నన్నెందుకు చేసుకున్నాడు ? అనుమానమొచ్చి ఫేస్ బుక్ లో అద్రిజ ప్రొఫైల్ చూస్తే ఆ అమ్మాయి “ఫ్రం ఢాకా లివ్స్ ఇన్ కోల్ కత్తా” అని ఉంది. బంగ్లాదేశీ.
అది సంగతి.
ఆ దేశం మీద తనకున్న కోపంతో పెళ్ళి మాత్రం వద్దనుకుని ఉంటాడు. వాట్ ఏ దేశ భక్తి ! ఇన్ని షాకులు తిన్నాక నిద్ర ఎలా పడుతుంది ? ఉన్న ఒక్క నిద్ర మాత్ర పాలలో కలిపి అశుతోష్ కి ఇచ్చేసానే ! హయ్యో !
మర్నాడు పొద్దున్న అనిర్బాన్ని కలిసాను.
నాకు బెంగాలీలో “I came to know about your infidelity. I don’t want to stay with you anymore. We should break-up” అనడానికి ఏమంటారో చెప్పవా ? అని అడిగాను.
తను ఎప్పటిలాంటి సమాధానమే ఇచ్చాడు. ఒక నవ్వు ! కాకపోతే ఈ సారి విరక్తిగా.
***********సమాప్తం*************




మెహర్

మెహర్ (కథ)

            (విపుల ఫిబ్రవరి 2017 ముద్రితం)

          

           ప్రస్తుతాన్ని వర్ణిస్తే అది వార్త...
              ఇంకా జరగనిది ఊహించి రాస్తే అది కధ...
             ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇంకా గుర్తుపెట్టుకుంటే అది చరిత్ర !
         ప్రస్తుతంలో జీవిస్తే ఏదో ఒక కాస్మిక్ గ్లామర్ మిస్ అయినవాళ్ళం అవుతాం.
            అంజనాల మసిలో మనం వెతుక్కునే భవిష్యత్తు దివ్యంగా ఉండాలని కోరుకోవడం మన భ్రమ !
            ఏతా వాతా చరిత్రే కొంచం రస్టిక్ గా, చెదలు పట్టినా యోగిక్ గా, యునీక్ గా ఉంటుంది.
            జరుగుతుందో లేదో తెలియని విషయం గురించి ఆలోచించే కంటే ఖచ్చితంగా జరిగిన చరిత్రను గమనిస్తే మన గమనానికి ఉపయోగపడొచ్చునన్నది ప్రాజ్ఞుల అభిప్రాయం.
           జాగ్రత్తగా వెతకాలే గానీ చరిత్రలో మనకి సాజిద్ లాంటి చురుకైన కుర్రాళ్ళు ఎంతో మంది దొరుకుతారు. వాళ్ళంతా యమునా తీరంలో పడవ నడుపుతూ.. ఉత్తర దక్షిణ తీరాల మధ్య దూరాల్ని తెడ్డుతో కొలవ గల సమర్ధులు. కానీ వాళ్ళందరి జీవితాల్లోకి తొంగి చూడడం సభ్యత అయినా కాకపోయినా సాధ్యపడదన్న విషయం మాత్రం వాస్తవం. వాళ్ళందరికీ సాజిద్ ఒక ప్రతినిధి అనుకుంటే గొడవేలేదు !
                ఖుదా ఇచ్చిన రెక్కల కష్టం మీద బ్రతికేవాడు సాజిద్. నిండా పద్దెనిమిదేళ్ళైనా ఒంటిమీదకి రాకపోయినా కష్టాలకు రొమ్ము చూపగల తెగువ వయసులో ఉంటుంది. సాజిద్ వాళ్ళ అబ్బాజాన్ తాపీ పని చేస్తుంటే సాజిద్ మాత్రం పనిలో మజా లేదంటాడు. తన అమ్మీజాన్ పోయినా ఆటూ పోటూ నేర్పిన యమునా నదే తన తల్లి అంటాడు. తన పడవలో ప్రయాణీకులను ఒడ్డు నుండి ఒడ్డుకు ఒడుపుగా దాటించగల నేర్పు కల వాడు. ప్రయాణీకులు ఇచ్చే సొమ్ము ఎంతో కొంత తీసుకుని రోజులు వెల్లబుచ్చేవాడు. ఎన్నాళ్ళిలా పడవ నడుపుకుని సంపాదిస్తాడు ? తాపీ పని చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందని ఎంత పోరినా వినకపోయేసరికి అతడికి నిఖా చేస్తేనైనా బాధ్యత తెలుస్తుందని సాజిద్ కి తగిన దుల్ హన్ కోసం వెతకడం మొదలు పెట్టాడు వాళ్ళ అబ్బాజాన్. వెతికే క్రమంలో అతనికి సలీమా తారసపడడం సాజిద్ చేసుకున్న అదృష్టం.
                యమునా నదిలో పడవ నడిపే పనిలో తప్ప మరి విషయంలోనూ అబ్బాజాన్ మాటకు ఎదురుతిరిగి ఎరుగని సాజిద్,సలీమాతో నిఖాకి సరేనన్నాడు. పైకి ఏదో తండ్రి మాటకి గౌరవమిచ్చేవాడిలా తలూపాడు గానీ సలీమా లాంటి అందగత్తె అతనికి ఎక్కడ దొరకాలి ? మాటకి వస్తే తను మాత్రం తక్కువ వాడేం కాడు. యువరాజు ఖుర్రం ఖాన్ లాగ సోగకళ్ళ వాడు. సలీమా కూడా అతడ్ని చూసిన తొలిసారి అలాగే అనుకుంది. యువరాజు ఖుర్రం వలె రాజఠీవి ఉట్టి పడుతున్న మగాడు మొగుడుగా దొరుకుతున్నాడన్న ఆనందంలో గుల్ మోహర్ పువ్వులా నవ్వింది.
                యమునా నది తరగలపై నిండు పున్నమిలా పరుచుకున్న నవ్వుకి వివశుడైన సాజిద్, మెహర్ (మహమ్మదీయుల పెళ్ళిళ్ళలో వధువుకు వరుడు ఇవ్వవలసిన కట్నం) ఎంత ఎక్కువైనా పర్వాలేదనుకున్నాడు. మొదటి విడత ము-అజ్జల్ (మెహర్ లో మొదటి భాగం) ఇచ్చిన తరువాత జరిగిన సాజిద్,సలీమాల నిఖా ఇరుకుటుంబాలలోనూ దీప శిఖల వెలుగులు నింపింది.
                                                                ********************
                పెళ్ళికాక ముందు యమునా నదే తన జీవితంలా బ్రతికిన సాజిద్ కు, పెళ్ళయ్యాక సలీమాతో యమునాయానం జీవితమైపోయింది. అర్ధరాత్రులు తెప్పలో ఆమెను కూర్చోబెట్టుకుని నదిలో తిప్పేవాడు. అతని సునిశిత చూపులనుండి ఆమెలో దాగిన యమున తప్పించుకోలేక పోయింది.
                 అతడు కసురుకుంటే ఆమె అంగూర్ కళ్ళలో యమునోత్రి పాయల తడి, కన్నీరుగా కారుతుంది...
                ఆమె నిశ్వాసలలో యమునాతటి పిల్ల వాయువుల వీవన గాడ్పు అతడికి వెచ్చగా తగులుతుంది...
                ఆమెవి పలుకులు కావు.. మధురానగరిలో యమునాలహరులు..
                అవి పరుగులు కావు.. నటనమైన కాలింది నడకలు..
                రాత్రికాలాలను త్రాగి మురిసే హృదయంగమ మృదంగాలు కావు అవి రాతిగోళాలను తాకి ఎగసే ఉత్తుంగ తరంగాలు..
                ఆమె తలపుల మునుకలు.. సద్గంగా సంగమ సరిగంగ మునకలు !
                అతడు కనిపించిన ప్రతి రాతి పై ఆమె పేరుని ఇబారత్ గా చెక్కలేకపోవొచ్చు...
          అతడు ఒమర్ ఖయ్యూంలా రుబాయత్ చెప్పలేకపోవచ్చు...
          కానీ ఆమెపై అతడికున్న ప్రేమను వ్యక్తపరచడంలో ఏ కళాకారుడూ అతడికి సాటిరాడు !
                                      ******************
                కాల ప్రవాహం నదీ ప్రవాహం కన్నా వేగమైనది.. సంవత్సరాలు నీటి అలల్లా దొర్లిపోయాయి.. ప్రవాహంలో చాలా మారాయి. యువరాజు ఖుర్రం మహారాజై ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయాడు, సాజిద్ వాళ్ళ అబ్బాజాన్ చనిపోయి ఆకాశానికన్నా పైకి పోయాడు ! సాజిద్ కుటుంబం అతడి సంతానంతో కలువల కొలనులా వికసించింది. సలీమాలో మునుపటి సౌకుమార్యం పోయింది. ఇన్ని మారినా మారనివి రెండే రెండు.. యమునా నది, నది పై బ్రతుకుతున్న సాజిద్.
                దక్షిణ గట్టు పైన మహారాజు గారు ఏదో నిర్మాణం మొదలుపెట్టి చాలా కాలం అయ్యింది. పనివాళ్ళకు డబ్బులు కూడా బాగానే ముడుతున్నాయని ఎక్కడెక్కడి నుంచో  శ్రామికులందరూ పని చేయడానికి వస్తున్నారు. సంవత్సరాల తరబడి నిర్మాణంలో జాప్యం జరుగుతుందని మహారాజు గారు విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. తాపీ పని తెలిసిన వాళ్ళందరూ పనిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నాళ్ళని పడవని నమ్ముకుని బ్రతుకుతాం ! తాపీ పనికి వెళ్తే చేతిలో నాలుగు రాళ్ళాడతాయి. కొన్ని రాళ్ళు వెనకేసుకోవచ్చని సలీమా చెప్తే... తాపీ పనికి వెళ్తే నిజంగా మిగిలేది రాళ్ళే అని వెటకారం ఆడేవాడు సాజిద్.
                అన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఏమీ అని ఎరుగని సలీమా మాటు ఊరుకోదల్చుకోలేదు. ఇన్నాళ్ళుగా పడవ నడిపి పస్తులున్నది చాలు, ఇకనైనా తాపీ పనికి వెళ్ళమని గట్టిగా చెప్పి ఉంటుంది. అప్పటికీ సాజిద్ మాట వినకపోతే మెహర్ లో భాగంగా తనకు రావలసిన మువజ్జల్ (మొదటి విడతను మినహాయించగా రావల్సిన డబ్బు) ఎప్పటికిస్తావని నిలదీసి ఉంటుంది. ఏదైతేనేం.. మొత్తానికి పనిలో చేరడానికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు సాజిద్. ఇంత అయిష్టతలోనూ అతడికి స్వాంతన చేకూర్చే విషయం ఎంటంటే నిర్మాణం దక్షిణ గట్టు ఒడ్డున కాబట్టి రోజూ పడవలో వెళ్ళి పడవలో రావచ్చు. తన పడవలోనే పనివాళ్ళను తీసుకుని వెళ్తే వాళ్ళిచ్చే నాలుగు రూకలు.. కూలికి అదనం.
                తాపీ పని పెద్దగా అలవాటు లేకపోయినా, బాగా అలవాటున్న జమాజెట్టీల్లాంటి కూలీలు కూడా విస్తుపోయే వేగంతో పని చేసేవాడు సాజిద్. కష్టం ఊరికే పోలేదు. సలీమా చెప్పినట్లే చేతిలో నాలుగు రాళ్ళాడేవి. పిల్లలకీ, సలీమాకి కుర్తాలు,పైజమాలు కొనేవాడు. సరైన సమయంలో సరైన సలహా ఇచ్చిన భార్య తెలివితేటల్ని అతడు మెచ్చుకోని రోజంటూ లేదు.
                రోజు రాజస్థాన్ నుంచి వచ్చిన పాలరాయి నీ బుగ్గలకన్నా తెల్లగా ఉందని ఆమెను ఆటపట్టించి.. ఆమె అలిగితే చూసి ఆనందించేవాడు. మళ్ళీ అతనే .. ఐతే అవి అలిగలేవు, అలిగినా నీ బుగ్గల్లా ఎర్రగా మారనూలేవు అని నవ్వించేవాడు.
                                                                ********************
          పని చేస్తున్న కొద్దీ పనిలోని సౌందర్యం అర్ధమయ్యిందతనికి. ఒక భవనాన్ని నిర్మించడంలో పాలుపంచుకుంటే కలిగే ఆనందం పరాకాష్ఠకు చేరింది.
                సలీమా మెడలో మోతీ హారాన్ని సవరిస్తూ భవనం యొక్క గోపుర ప్రభల గురించి వర్ణించే వాడు. మనం కూడా డబ్బులు కూడబెట్టి మన స్థాయికి తగ్గట్టు ఒక ఇళ్ళు కట్టుకుందామనే వాడు. అలా ఎప్పటికైనా ఒక ఇళ్ళు కట్టగలిగితే అదే నువ్వు నాకిచ్చే మెహర్ అని సలీమా అనేది. తను చనిపోయేలోపు భార్యకోరిక తీర్చాలనుకున్నాడు సాజిద్. మెహర్ ని ఇస్లాం సాంప్రదాయంలో పెట్టడం వెనుక ఉద్దేశ్యం కూడా అదే ! అనుకోని కారణం చేత భర్త పోతే.. భార్యకి అతడిచ్చే మెహర్ భర్త పోయాక అక్కరకొస్తుందని.
                                                                ********************
                రోజులు గడుస్తున్నాయి. ఇల్లు కట్టడానికి డబ్బులు పోగవ్వుతున్నాయి. ఖురాన్ పెట్టుకునే రెహాల్ నిలుపుకోవడానికి పాలరాతితో కనీసం ఒక చిన్న మండపం లాంటిదైనా కట్టుకుందామన్న కోరిక పుట్టింది. పాలరాతిని కొనే స్థోమత అతడికి ఎటూ లేదు. అందుకని అర్ధరాత్రులు పడవలో దక్షిణ గట్టుకు వెళ్ళి కాపలాదారుల కళ్ళు కప్పి ఒకటో రెండో పాలరాళ్ళు తెచ్చి దాచుకునే వాడు.
                                                                **********************
                కొన్నాళ్ళకి కొంత డబ్బు, కొన్ని రాళ్ళు పోగయ్యాయి. తన స్థలంలో ఇళ్ళు నిర్మించడమే తరువాయి అనుకున్నతరుణంలో సలీమా కాలం చేసింది. తను ఇళ్ళు కట్టుకుందామనుకున్న స్థలంలోనే తన సలీమాను ఖననం చేసాడు. అతడి కళ్ళలో యమునా నది ఎరుపెక్కి పొంగింది !
                                                                **********************
                సలీమా పోయిన దగ్గర నుంచి అతడికి డబ్బు సంపాదించాలనే ఆశ పూర్తిగా తగ్గిపోయింది. కానీ పనికి మాత్రం వెళ్ళేవాడు. పని చేసి కూలికి బదులుగా చిన్న చిన్న పాలరాతి తునకలు ఏరుకునే ఒప్పందం చేసుకున్నాడు. సాజిద్ కు ఇళ్ళు కట్టుకునే ఆశ, ఉద్దేశం రెండూ లేవు. సంపాదించిన డబ్బు, పాలరాళ్ళతో సలీమా కోసం పాలరాతి సమాధిని కట్టిస్తే అదే ఆమెకు తను ఇవ్వగలిగిన నిజమైన మెహర్ అని భావించాడు.
                                                                **********************
                కొన్ని సంవత్సరాలకు అతడి అవసరం మేరకు పాలరాతిని పోగుచేసాడు. చూసిన వాళ్ళందరూ అతడిది పిచ్చి అనుకున్నారు. కూటికి గతిలేని వాళ్ళకి పాలరాతి సమాధులేంటని హేళన చేసారు. అవేవీ అతడికి పట్టలేదు. అకుంఠిత దీక్షతో సమాధిని నిర్మించడం మొదలు పెట్టాడు. మొదలు పెట్టిన తరువాత ఒకే పెట్టున సమాధిని నిర్మించాడు.
                ఆమె సమాధి కూడా ఆమెలాగే నిర్మలంగా,నిశ్చలంగా,నిష్కలంకంకముగా ఉంది. ఆమె నవ్వుల్లోని పాలనురగ, రాతికి అంటుకొని నగిషీలద్దుకున్నది. సాజిద్ యమునా తీరం వైపు వెళ్ళడం మానేసాడు. రోజంతా సమాధి పక్కన ఉండేవాడు. అక్కడే తిండీ, అక్కడే నిద్ర, అక్కడే సకలం, అక్కడే సర్వం.
                                                                **********************
                ఒక రోజు రాజు గారి భటులు వచ్చి అతడిని తీసుకుపోయారు. చుట్టు పక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కానీ సాజిద్ ఆశ్చర్యపోలేదు ! ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం తను పాలరాతి పలకలను దొంగిలించిన విషయం వాళ్ళకు తెలిసిపోయుంటుంది అనుకున్నాడు. దొంగలకు రాజ్యంలో విధించే శిక్ష ఏమిటో అతనికి తెలుసు ! చేతులు నరికేస్తారు.. అంతే కదా.. అనుకున్నాడు. అతడి లాగే తీసుకురాబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసాక, రాజ్యంలో ఇంతమంది దొంగలున్నారా అని ఆశ్చర్యపోయాడు.
                వాళ్ళందరినీ జాగ్రత్తగా గమనించాక వాళ్ళు కూడా తనతో పాటు యమునా నది దక్షిణ గట్టులో కొన్ని సంవత్సరాలు శ్రమించి భవనాన్ని నిర్మించిన వాళ్ళుగా పోల్చాడు. వాళ్ళందరూ కలిసి నిర్మించిన భవనాన్ని తరువాత తరాల వాళ్ళు "తాజ్ మహల్" గా గుర్తుపెట్టుకుంటారని అతడికి తెలియదు! అతడు నిర్మించిన సలీమా సమాధికి మాత్రం ఎవరూ పేరూ పెట్టలేదు !
                                                                **********సమాప్తం************