ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, జులై 2016, సోమవారం

డాలీ (కథ)

           (10.07.2016 ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ప్రచురితం)


ఢిల్లీలోఇండియా ఆర్ట్ ఫేర్”...
గుమ్మంలోనే అమృతా షేర్ గిల్, రాజా రవి వర్మల కళాదర స్వాగతం.
"ఇవేమీ కావు. 'పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీ ' పెయింటింగ్ చూడాలి మోడర్న్ ఆర్ట్ అంటే ఏంటో తెలుస్తుంది" అన్నారెవరో పక్కనుంచి.
"థియరీ ఆఫ్ రిలేటివిటీని బేస్ చేసుకుని గీసిన పెయింటింగ్. గడియారం కరిగిపోతున్నట్లు గీయడం వండర్ఫుల్ థాట్" అన్నాడతను మళ్ళీ. అలా చెప్పిన వ్యక్తికి బొమ్మ గీసిన స్పానిష్ సర్రియలిస్ట్ "డాలీ" గురించి తెలుసా ? “అసలు సర్రియలిజం గురించి తెలుసా ?" అని అడిగేద్దామనిపించింది.
చిత్రలేఖనం అంటే గోడకు సున్నం కొట్టినట్లు బ్రష్ తో క్యాన్వాస్ ని కంగాళీ చెయ్యడం కాదు. ఒక పుస్తకంలో వ్రాయదగ్గ విషయాన్ని వేళ్ళ కొసలతో కాగితంపై కుమ్మరించాలి. ఎనిమిదో రంగు కోసం వెతికే పసితనానికి వేయి కనులు కావాలనిపించాలి.
కొన్ని పెయింటింగ్స్ అర్ధనగ్నంగా... కొన్ని పూర్తి నగ్నంగా...
ఒంటికి పట్టిన సౌందర్యం కంటబడాలంటే మకిలి నిండిన బట్టల్నిబ్రష్ తో తొలగించాల్సిందేనేమో !
"డాడీ.. పెయింటింగ్స్ చూడు... షేం షేం పప్పీ షేం" అంది నా ఆరేళ్ళ కూతురు డాలీ. నా అభిమాన చిత్రకారుడు "సల్వడర్ డాలీ" పేరే కుదించి కూతురికి పెట్టుకున్నాను.
"డాడీ రోజు నాకు నోట్లోనుంచి బ్లడ్ రాలేదు" అంది సంబరంగా. రోజూ రక్తం ఉమిసే ఎబ్నార్మాలిటీ ఉంటే తప్ప మామూలుగా ఉండడంలో గొప్పదనం, డాలీకి క్యాన్సర్ వచ్చేదాకా నాకు తెలియలేదంటే తప్పెవరిది ?
"వావ్… గ్రేట్ డాలీ" అని ఒక ముద్దిచ్చాను. ఇలా ఎన్నాళ్ళివ్వగలనో తెలియదు.
"డాడీ... నేను కూడా అలాగే పెయింటింగ్స్ వేస్తాను" నా లాగే తన డి.ఎన్..లో కూడా చిత్రలేఖనం ఉంది.
"ఇంతకన్నా బాగా వెయ్యాలిరా" అన్నాను.
డాలీ కూడా బొమ్మలు గీయడంలో తన వయస్సుకు మించిన ప్రతిభ చూపెడుతుంది. ఎంత బాగా వచ్చినా ఇంకా బాగా రావాలన్న తపనతో చెరిపేసి మళ్ళీ గీస్తుంది. అది చూసి తన వయస్సెక్కువని భ్రమ పడ్డాడో ఏమిటో పై వాడు ! తొందరగా తీసుకుపోతానంటున్నాడు.
తరచి చూస్తే దేవుడు కూడా చిన్న పిల్లవాడేమో అనిపిస్తుంది. తను గీసిన బొమ్మ అందంగా ఉన్నా చెరిపేస్తానంటాడు.
"డాడీ ఎంత సేపు ఇక్కడే ఉంటావు ? పద పక్క హాల్ లోకి వెళ్దాం అక్కడ బోలెడన్ని కార్లున్నాయి" కార్ బొమ్మ ని సూచించేలా బిగిసిన తన పిడికిలి చూస్తే నవ్వొచ్చింది.
"అయినా ఆర్ట్ ఎక్సిబిషన్లో కార్లేమిటి?" అనుకుని డాలీ చిటికిన వేలు పట్టుకుని తన వెంటే నడిచాను.
డాలీ చెప్పింది నిజమే...
ఆర్ట్ ఫెయిర్ కి బిజినెస్ పార్ట్నర్ గా ఉన్న బి.ఎం.డబల్యూ వారి కార్లు కొలువుతీరి ఉన్నాయి.
అయిదు కార్ల పైనా .. "పైన" కాదు... కార్ల మీద... చి చిమీద” కాదు... కార్ల నిండా పెయింటింగ్స్ వేయబడి ఉన్నాయి.
అంటే... కార్లను క్యాన్వాస్ గా చేసుకుని... క్యాన్వాస్ మీద వెయ్యాల్సిన బొమ్మల్ని కార్ల మీద వేసారన్నమాట !
ఎం.త్రీ.జి.టీ 2 కార్ మీద "జెఫ్ కూన్స్" అనే అమెరికన్ చిత్రకారుడు వేసిన "బెలూన్ డాగ్" చిత్రరాజం... అన్నింటినీ తలదన్నే లా ఉంది.
యాండీ వార్హల్,ఫ్రాంక్ స్టెల్లాలను తక్కువ చెయ్యడానికేం లేదు. కానీ నాకు మాత్రం జెఫ్ కూన్స్ వేసిందే ఎక్కువ నచ్చింది. డాలీ కి కూడా అదే నచ్చింది.
"డాడీ... నువ్వు కూడా అలాంటి పెయింటింగ్ ఉన్న బి.ఎం.డబల్యూ కార్ కొను" అంది డాలీ.
మమూలుగానే ఆ కార్ ఒక్కొక్కటీ ముప్ఫై లక్షల నుంచి మూడు కోట్లు వరకు ఉంటుంది. అటువంటిది, మహా చిత్రకారులు గీసిన చిత్రాలను తన ఒంటి పై పరుచుకుని హొయలొలకబోస్తున్న బి.ఎం.డబల్యూ కార్ల ధరల గురించి ఆలోచించడం మాట అటుంచితే అసలు అటువంటి కళా ఖండాలను చూడగలగడమే నా లాంటి మధ్య తరగతి వాడికి మిధ్య ! అది నెరవేరినందుకు ఒకలాటి గగుర్పాటుకు లోనయ్యాను.
చెన్నై నుంచి ఢిల్లీ , పాప ట్రీట్మెంట్ నిమిత్తం వచ్చినందుకు తనకివన్నీ చూపించగలిగానన్న సంతృప్తి తో డాలీ ని తీసుకుని ఎక్సిబిషన్ నుంచి బయిటపడి హాస్పిటల్ చేరుకున్నాను.
                                                             ***
                                       

హాస్పిటల్లో డాలీ ని పరీక్షించిన డాక్టరు, అందరు డాక్టర్లు చెప్పిందే చెప్పాడు.
"మీ అమ్మాయి ఎక్కువ కాలం బ్రతకదండి" అని.
“మా చెన్నై లో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇదే మాట చెప్పారు. మీరు ఏదైనా కొత్తగా చెప్పాలనుకుంటే చెప్పండి” అని నేను అడిగితే "డాలీ కి ఏమైనా కోరికలుంటే తీర్చెయ్యండి" అన్న సమాధానం వచ్చింది.
డాలీని తీసుకుని చెన్నై కి రైల్లో బయిల్దేరాను.
మూడుగంటల తర్వాత...
నా ఒళ్ళో తల పెట్టుకుని నిద్ర పోతున్న డాలీ కలవరింతలు వినడానికి నా చెవిని తన బుగ్గలకి తాటించాను.
"బొమ్మలున్న బి.ఎం.డబల్యూ. కొను డాడీ" అన్న మాటలు రైలు హారన్ శృతిలో కలిసిపోయాయి.
                                                           *********************
"సారధి.. నువ్వేం మాట్లాడుతున్నావో అర్ధమౌతుందా" అరిచింది నా భార్య ఉత్పల.
"అందులో అర్ధం కాకపోవడానికేముంది ? ఇల్లు అమ్మేస్తాను అంటున్నా... అంతే !" డాలీని కోల్పోబోతున్నానన్న వైరగ్యం ఇచ్చిన ధైర్యం అది.
"మీ నాన్న మనకి మిగిల్చిందే మూడు గదుల కొంప, ముందుకున్న వరండా లో కిరాణా షాపు. అది కూడా అమ్మేసి అడుక్కుతింటామా ?"
"షాప్ అమ్మడంలేదు. ఇల్లు మాత్రమే అమ్ముతానంటున్నాను ఉత్పల"
"ఎందుకు ?"
"డాలీ ఆఖరి కోరిక తీర్చాలి అంతే !"
"డాలీ నీకే కాదు" అని ఆపేసింది ఉత్పల.
"నీకు కూడా కూతురేనంటావు. సరే అయితే.. నా మాట విని ఇల్లమ్మేద్దాం. బీ.ఎం.డబల్యూ. కొందాం" అన్నాన్నేను.
"బియ్యం అమ్ముకునే వాళ్ళం. మన బతుక్కి బీ.ఎం.డబల్యూ ఒకటి" అంత వేడెక్కిన వాదనలో కూడా ఆమె వాడిన ప్రాసకి నవ్వొచ్చింది.
"అయినా ఇల్లు అమ్మినా పది లక్షలు మించి రావు. సిటీలో ఉన్న రేటు మన కేలంబాకంలో లేదని నీకు తెలియదా"
"సెకండ్ హ్యాండ్ కార్ కొందాం"
"కానీ డాలీ అడిగింది బొమ్మలున్న కార్ కదా" వింత పశువుని చూస్తున్నట్లు చూసింది.
" కార్ మీద నేనే ఒక మంచి పెయింటింగ్ వేస్తాను" అని అన్నానంటే నాలోని చిత్రకారుడికి ఎన్ని గుండెలుండాలి ?
"నీకు నచ్చినట్లు చేసుకో" అని విసురుగా వెళ్ళిపోయింది.
మర్నాడే మా ఇంటిని బేరం చేసుకున్నాడు బెల్లం షావుకార్ ఆర్ముగం. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని పది లక్షలు నా చేతిలో పెట్టడంతో పాటు "పాపకి సుస్తీ చేసిందంట కదా తంబీ... వెల్లూరు తీస్కపో. అక్కడ డాక్టర్లు తగ్గించలేని జబ్బు లేదంట" అన్న ఉచిత సలహా పారేసాడు.
అదే ఇంట్లో నేను రెండు వేల రూపాయిలకి అద్దెకి ఉంటానంటే ముఖం చిరాగ్గా పెట్టి "సరే"నన్నాడు ఆర్ముగం.
కార్ సంగతి పక్కన పెట్టి డాలీ ని,డబ్బుని తీసుకుని ఉత్పల,నేను సాయంత్రమే వెల్లూరు బండి ఎక్కేసాం.
                                                                
                                                            **********************
అంకాలజిస్ట్ సెలవులో ఉండడంతో మూడు రోజులు వెల్లూరు లోనే ఒక చిన్న లాడ్జిలో ఉండిపోవలసి వచ్చింది.
నాలుగవ రోజు...
"అయాం సారీ మిస్టర్ సారధి... మీ పాప ఎక్కువ కాలం బ్రతకదు" అన్నాడు వెల్లూరు డాక్టర్ కూడా.
"నాకు తెలుసు డాక్టర్... చాలా చోట్ల చూపించాను. అందరూ ఇదే చెప్పారు. ఆశ చావక ఇక్కడికి వచ్చాను" అన్న మాటలు నాలోని ఆశాభంగపు అసహనాన్ని అణచలేకపోయాయి.
"ఇంక వేరే డాక్టర్ కి డాలీ ని చూపించకండి. ఎవరైనా ఇదే చెప్తారు. ఆమె ఉన్న కొద్ది రోజులూ ఆమె ఏం అడిగితే అది ఇవ్వండి"
"అలాగే డాక్టర్" అంది ఉత్పల. ఆమె మాట అంటున్నప్పుడు కార్ కొనాలన్న నా లక్ష్యానికి తను కూడా సహకరిస్తానన్నట్లు చూసింది నా వైపు.
"వస్తాం డాక్టర్.. మేము ఇంకో గంటలో చెన్నై వెళ్ళే రైలుకి అందుకోవాలి" అన్నాను.
"ఎక్కడికి ? చెన్నైకా ! రోజూ పేపర్ గానీ టి.వి.గానీ చూడ్డంలేదా ?" ఏదో వినకూడని మాట విన్నట్లు అదిరిపడ్డాడు.
"లేదు డాక్టర్ ఏమి ?"
"చెన్నై మొత్తం తుఫానులో మునిగిపోయింది. పట్టాలు కొట్టుకు పోయాయి. రోడ్లు తెగిపోయాయి. రైళ్ళు,బస్సులు ఏమీ తిరగడం లేదు"
డాలీ తల నిమురుతున్న నాకు ఇవేవి పెద్ద విపత్తుల్లా అనిపించలేదు.
"కాలువలు పొంగి రోడ్ల పైకి నీరు వరదలై పొంగింది. ఎక్కడి వాహనాలక్కడే నిలచిపోయాయి. జనం తిండి లేక అల్లల్లాడుతున్నరట. కనీసం పసి పిల్లలకి పాలు కూడా దొరకడం లేదట" చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకుపోతున్నాడు. ఇలాంటి ప్రమాదాలు,ప్రకృతి వైపరీత్యాల గురించి మూడో మనిషి సానుభూతి.సి. హాల్లో టికెట్ కొనుక్కుని హార్రర్ సినిమా చూసే ప్రేక్షకుడిభద్రతతో కూడిన భయం” లాంటిది ! మనం సేఫ్ గా ఉన్నామన్న ఆనందం, ఇబ్బంది పడే వాడి మీద సానుభూతిగా రూపాంతరం చెందుతుంది.
ఉత్పల ముఖంలో ఆందోళన చెన్నై వరదలు కంటే ఎక్కువగా ఉబుకుతుంది. ఇదేమీ పట్టనట్లు డాలీ బయిటకు వెళ్ళి వరండా లో ఆడుకుంటుంది. దీనంతటికీ చలించని స్థితికి నేను చేరుకున్నానంటే నాది డాలీ లాంటి తెలియనితనమా ? ఋష్య సాధ్యమైన స్థిత ప్రజ్ఞతా?
"కొన్ని వందల మంది చనిపోయారు. పశువులు,పక్షులు కూడా నేలకొరిగాయి. కొన్ని వేల కోట్ల ఆస్థి నష్టం జరిగింది. పొరుగు రాష్ట్రాల వారు హెలికాప్టర్లలో ఆహారం పంచుతున్నారు. ఇంత జరుగుతున్నా మీకు తెలియలేదంటే నాకు చాలా వింతగా అనిపిస్తుంది"
"మేము దిగిన లాడ్జిలో టి.వి.లేదు డాక్టర్. పాపకి ఆరోగ్యం బాగోలేదన్న దిగులులో నేను,ఆయన బయట వాళ్ళతో పెద్దగా మాట్లాడ్డం లేదు" అనవసరమైన సంజాయిషీ ఏదో ఇచ్చే ప్రయత్నంలో ఉన్న ఉత్పలను చేయి పట్టుకుని బయిటకి తీసుకు వచ్చేసాను.
                                                                            ****
మూడు రోజుల తర్వాత...
చెన్నై చేరుకున్నాం.
డాక్టర్ వర్ణించినప్పుడు అతిశయోక్తి గా అనిపించినా ఇప్పుడు కళ్ళారా చూస్తే నిజమేననిపిస్తుంది. పెద్ద విపత్తు సంభవించినప్పుడు అక్కడ లేకపోవడం వల్ల మేం అదృష్టవంతులం అని అనుకోలేమని డాలీ చేయి పట్టుకున్నప్పుడు మళ్ళీ అనిపించింది.
కేలంబాకం చేరుకునే సరికి మా షాపు, ఇల్లు నేల మట్టమైపోయాయి. మా ఇంటికి వాస్తు సరిగ్గా ఉందా లేదా? ఏమో ! ఎప్పుడూ చూపించలేదు. వరదల్ని చూస్తే నాకు ఇంకో పెద్ద అనుమానం కలిగింది. అసలు చెన్నై కి వాస్తు సరిగ్గా ఉందా ?
మెరీనా బీచ్ ఉండాల్సిన దిశ లోనే ఉందా ? బీచ్ రోడ్లో గాంధీ తాత విగ్రహం ఎటువైపు తిరిగి ఉండాలి ?
పార్ధసారధి గుడికి సేన్ థోం చర్చికి మధ్య ఎంత దూరం ఉండాలి ? పడమరకి పోరూర్ , సౌత్ కి సిరుసెరి ఉండడం తప్పా ఒప్పా ? 2004 లో సునామీ వచ్చినప్పుడే వాస్తు మార్పించి శాంతులు చేసుంటే ఇప్పుడీ వరదలు వచ్చేవా ?
ఇంట్లో విలువైన వస్తువులేమీ లేవు కాబట్టి మాకు పెద్దగా నష్టం జరగలేదు.
"షాపులో ముప్పై వేల రూపాయిల కిరాణా ఉండేది. అది నష్టపోయాం మనం" అంది ఉత్పల.
"పాత దిక్కుమాలిన ఇల్లు.. కొనొద్దు కొనొద్దు అని నెత్తి నోరు కొట్టుకుని మా ఆవిడ చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడు సారధి, ఒక్క ఇటుక కూడా మిగలకుండా ఎలా కూలిపోయిందో" అని ఏడ్చాడు ఆర్ముగం.
"దానికి నేనెలా బాధ్యుడ్ని" అన్నట్లుగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయాను. ఎంతో కొంత డబ్బులు తిరిగి ఇస్తానని ఎదురు చూసిన ఆర్ముగం కు నిరాశ ఎదురైంది. ఇల్లు కూలిపోతే ఏం ? భూమి మిగులుతుంది గా ! అదే నా డాలీ రాలిపోతే... భూమిలో కలిసిపోతుంది.
                                                                ********************
నెల రోజుల తరువాత మా వీధిలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాను. వీధి వరండాలో మళ్ళీ కిరాణా వ్యాపారం మొదలుపెట్టాను. ఇంటికి కావలసినవి కొనగా తొమ్మిది లక్షలు మిగిలాయి.
పొట్లాలు కడుతుండగా పేపర్లో ఒక వార్త నా కంట పడింది.
"బెంగళూరు-చెన్నై హైవే లో సెకండ్ హ్యాండ్ కార్ల మేళా" అని హెడ్డింగ్. "'కారు ' చవక" అన్నది సబ్-హెడ్డింగ్.
"గత నెల చెన్నైలో వరదల కారణంగా భారీ సంఖ్యలో వాహనాలు నీట మునిగి పాడయ్యాయి. బెంజ్,ఆడీ,బీ.ఎం.డబల్యూ. వంటి ఖరీదైన కార్లు కూడా నీటిలో నాని ఎందుకూ పనికి రాకుండా పోయాయి.కదల్లేని వాహనాలని యజమానులు సరసమైన ధరలలో అమ్మకానికి పెట్టారు. కోట్ల రూపాయిలు విలువ చేసే కార్లు కూడా రెండు మూడు లక్షలకే దొరకడం గమనర్హం" వాక్యాలు ఎలా ఉన్నా వార్త సారాంశం ఇది ! నమ్మలేనట్లుగా పేపర్ ను మళ్ళీ చూసాను.
డాలీ పక్కన వచ్చి నిలబడి "డాడీ... బొమ్మలున్న బీ.ఎం.డబల్యూ కార్ ఎప్పుడు కొంటావ్?" అని అడుగుతుంది మారంగా.
"ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను తల్లీ" అని లేచాను. సి.డి.ప్లేయర్ లోనువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమాలోని "చంద్రుడిలో ఉండే కుందేలు" పాటలో నాకు నచ్చిన వాక్యం వినబడుతుంది...
"కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలాఅంతటా ఎన్నో వర్ణాలు…"
                                          ***********సమాప్తం*************