ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, డిసెంబర్ 2014, గురువారం

"పుట్టినరోజు" పుట్టిన.. రోజు !


అమ్మ కాళ్ళకి దండం పెడతాను..
నాకు దైవభక్తి లేదని నిందించిన నోళ్ళు మూగబోతాయి !
అమ్మ శుభశకునంగా ఎదురు రాగా యుద్ధానికి ఉద్గమిస్తాను..
దేవేంద్రుడు దిగివచ్చి ఇంద్రపదవి కట్టబెడతాడు!
అమ్మ నేర్పిన మాటలను అక్షరాలుగా పేరుస్తాను..
కవిత్వం కాళికలా కదను తొక్కుతుంది !
అమ్మ పేరును పదే పదే పలవరిస్తాను..
తన వేద సారమంతా ఒక్క మాటలో కుదించిన నన్ను గని.. చతుర్ముఖుడు సంభ్రమాశ్చర్యచకితుడౌతాడు !
అమ్మతనంలో మాత్రమే దైవత్వముంది..
ఎంత ఘోరతపస్సులాచరించినా స్త్రీత్వమే లేని మీకు దైవత్వమెలా సంక్రమిస్తుందని మహర్షులను నేను ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలరు?
మతం మారితే నిన్ను పట్టించుకునే వాడే లేడు... కానీ ఏ మతం వాడైనా పూజించే వేలుపు 'అమ్మ ' అని నేను అంటే దేవుడైనా జేవురించుకుంటాడా ?
అన్నం పరభ్రహ్మ స్వరూపమైతే మరి అన్నాన్ని వార్చిన అమ్మ బ్రహ్మాండాన్ని మించిన రూపమయ్యుండాలని నా నమ్మకం.
అమ్మ... చాలా అమాయకురాలు !
నేను ఎలా ఉంటానో ఎలాంటి వాడ్నో తెలియనితనంలోనే తన కడుపులో నన్ను దాచుకుని కాచింది..
అమ్మ... చాలా తెలివి తక్కువది!
ప్రపంచంలో తనను మించిన గురువులున్నారని భ్రమించి నన్ను బడికి పంపింది !
అమ్మ... ఒట్టి అబద్దాల కోరు..
నేను కడుపునిండా తినాలని తనకు ఆకలి లేదంటుంది!
అమ్మకు... అసలు పౌరుషమే లేదు..
తను నేర్పిన మాటల్ని తెలియని తనంలో తనపై ఈటెల్లా నేను వాడినా నవ్వుతుంది !
అమ్మ... నా పనులు నన్ను చేసుకోనివ్వదు..
నా బాధకు తనేడుస్తుంది.. నా సంతోషానికి తను నవ్వుతుంది..
నా రోగానికి తను లంకణం చేస్తుంది.. నా గెలుపుకు తను భుజాలెగరేస్తుంది..
అలాంటి అమ్మకు పుట్టిన రోజు అంటూ ఒకటి ఉందని.. ఉంటే అది ఈ రోజేనని నమ్మడానికి నేను సిద్దంగా లేను.. ఎందుకంటే అమ్మ పుట్టక ముందు ఈ ప్రపంచం ఎలా ఉండి ఉండేదోనన్న ఊహ కూడా నాకు అందడంలేదు ! 
అందుకే నేనంటాను.. ఇది నా "పుట్టిన రోజు" పుట్టిన రోజు అని.
(18.12.2014)

14, అక్టోబర్ 2014, మంగళవారం

చల్లని కాఫీ (కధ)

(సాక్షి ఆదివారం ఫన్ డే 05 అక్టోబర్ 2014 అనుబంధంలో ప్రచురితం)


" లాట్ కెన్ హాపెన్ ఓవర్ కాఫీ" - కాఫీ తాగే వ్యవధిలో గానీ, ఇక్కడ కాఫీ తాగటం వల్ల గానీ చాలా జరగవచ్చును అని పై వాక్యం తర్జుమా చేసుకుంటూ సదరు కాఫీషాపులోనికి అడుగుపెట్టావు. నీకు కాఫీ తాగటం కొత్తకాదు. కాఫీడే లాంటి ఖరీదైన కాఫీషాపులూ కొత్తకాదు. కానీ, ఒక్కడివే రావడం కొత్త. ఒక స్త్రీ రమ్మంటే కాఫీషాపుకి రావడం కొత్త. వచ్చి ఆమె కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం మరీ కొత్త !
ఆమెను నువ్వు ఏడాదిగా ఎరిగినప్పటికీ ఏనాడూ ఆమెను కాఫీ షాప్ కు నువ్వు తీసుకుని వెళ్ళలేదు. నీ హాస్పిటల్ లో నర్సుగా పరిచయమైన ఆమెను, నువ్వు చాలా గాఢంగా ప్రేమించావు. ఆమె కూడా నీ ప్రేమను అర్ధం చేసుకుంది. ఇద్దరూ ఒకటౌదామనుకున్నారు. కానీ ఒకటవ్వగలరా ?
*******************************
ఖాళీగా కూర్చుంటే బాగుండదని 'బెల్జియం చాకో షాట్' ఆర్డర్ ఇచ్చావు. ఈరోజు ఆదివారం కావడం చేత కాఫీడే యువతీయువకులతో కళకళలాడుతుంది. ఒక్కసారి వారందరినీ పరిశీలనగా చూసావు. లింగ భేదం చూసేకళ్ళకే గానీ జీన్స్ ప్యాంట్లకు, టీ షర్టులకు ఉండదు. నేటి ట్రెండ్ కు ప్రతిబింబాలైన క్యాప్షన్లేవో టీషర్టులపై కొలువుదీరి నీవంటి రసజ్ఞుల చూపులను తమవైపునకు లాక్కుంటున్నవి. లెవీస్, పెపె, కిల్లర్, లీ కూపర్ తదితర జీన్సుల చిరుగుల్లోంచి నవీన నాగరికత ఉట్టి పడుతుంది. నియాన్ బల్బుల కాంతి, చెవి పోగుల మెరుపును మరింత మెరుగ్గా చూపుతుంది. తలకు పెట్టిన బ్రెలిక్రీం స్పైక్స్ ను బలంగా నిలబెట్టేందుకు మరింత దోహదపడుతుంది.
హెయిర్ స్ప్రేల గుబాళింపో, డియోడ్రెంట్ల పరిమళమో తెలియదుకానీ వేల తుమ్మెదల దప్పిక తీర్చే సౌరభమేదో కాఫీషాప్ ను ఆవరించుకుంది. నిత్యం తెల్లకోటు వేసుకుని, మెడలో స్టెతస్కోపు పెట్టుకు తిరిగే నీకు, వీళ్ళ వేషధారణ కృత్రిమంగా తోచడంలో వింత లేదు. మందులు, ఇంజెక్షన్లు, సెలైన్లు, స్పిరిట్ల వాసనలు నిండిన నీ ముక్కుపుటాలు ఈ సుగంధ వీచికలను ఎక్కించుకుంటాయా?
ఏదో ఆలోచనల్లో ఉన్న నువ్వు, నువ్వార్డరిచ్చిన 'బెల్గియన్ చాకో షాట్' రాకతో ఈ లోకంలోకి వచ్చావు. ఇంకా ఆమె రాలేదు. అసహనంగా నీ ఐఫోన్ను అన్ లాక్ చేసి మెసేజ్ ఇన్ బాక్స్ తెరిచావు.
"సారీ రాం! మూడు రోజులుగా నిన్ను కలవడం గానీ, ఫోన్లో మాట్లాడటం గానీ, నీకు మెసేజ్ చేయడం గానీ కుదర్లేదు. రేపు సాయంత్రం ఆరింటికి గచ్చిబౌలి కాఫీడేకి రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి" ఆమె పంపిన అదే మెసేజ్ ను నిన్నటి నుండి ఎన్నిసార్లు చదువుకున్నావో లెక్కేలేదు. టైం ఏడైంది. ఆమె ఇంకా రాలేదన్న అసహనంతో నీకు బీపీ పెరుగుతుండగా కాఫీడే తలుపు, నీ గుండె గవాక్షం ఒకే మాటు తెరుచుకున్నవి.
రోమన్ల ప్రేమదేవత వీనస్, కాపర్ సల్ఫేట్ రంగు చీర కట్టుకుని వస్తున్నట్లు గా ఆమె ముగ్ధలా నడుస్తూ వచ్చి నీ టేబుల్లో నీ ముందు సీటుని ఆక్రమించుకుంది. ఆమె దర్శనంతో నీ బీపీ నార్మల్ కు చేరింది. కళ్ళు అరమోడ్పులయ్యాయి. ఆమె ఇంట్లో ఏం జరగి ఉంటుందో నువ్వు ఊహించగలిగినా "ఏం జరిగింద"ని ప్రశ్నించావు. ఆమె మౌనం వహించడంతో మళ్ళీ అదే ప్రశ్న సంధించావు.
 "మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింద"ని చెప్పింది.
 "ఓస్ ! అంతేనా ! ఎప్పటికైనా తెలియాల్సిందే కదా" అని తేలికపడ్డావు.
"నన్ను ఎన్నెన్ని మాటలన్నారో తెలుసా ?" నీ నిర్లిప్తత ఆమెకు నచ్చలేదు.
 "మా ఇంట్లోవాళ్లు నన్ను అంతకంటే ఎక్కువ అన్నారు. నేనేమైనా నీలా బాధపడ్డానా ?" ఆమె పట్ల నీలో ఏ సానుభూతీ లేదు.
"అంటే! మీ ఇంట్లో కూడా మన విషయం తెలిసిపోయిందా" ఆమె అమితమైన ఆశ్చర్యం ఒలకబోసింది.
"తెలిసిపోవడమేవిటి? తెలియజెప్పాను. నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు ఇంట్లోవాళ్ళందరినీ పిలిచి చెప్పాను" - నీ ముఖంలో ఏ భావమూ లేదు.
"అప్పుడే ఎందుకు చెప్పావు ? కొన్నాళ్ళు ఆగి చెప్పాల్సింది" - మెనూ చూస్తూ ఆమె మెల్లగా పలికింది.
"ఇంకెన్నాళ్ళు ? మనం పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోవాలి. ఈ ఒంటరి జీవితం నా వల్ల కాదు" - నీ దవడ కండరం బిగుసుకుంది.
"ఇంతకూ మన విషయం తెలిసాక మీ ఇంట్లో ఏమన్నారు?" - ఆమె లో ఆసక్తి వెల్లివిరిసింది.
"మా ఇంటి పరువు తీసానన్నారు. నా ఆస్తి కోసం నువ్వు నన్ను వలలో వేసుకున్నావన్నారు. ఇకపై నలుగురిలో తలెత్తుకు తిరగలేమన్నారు. ఇంకా చాలానే అన్నార్లే" - ముఖం వికారంగా పెట్టావ్.
"మా ఇంట్లో కూడా సేం టూ సేం" - ఆమె గలగలా నవ్వేసరికి నువ్వు కూడా శృతిగా నవ్వావు.
ఇంతలో బేరర్ వచ్చాడు. ఆమె మెను అంతా తరచి చూసి "డెవిల్స్ ఓన్" కోల్డ్ కాఫీ ఒన్ బై టూ ఆర్డర్ చేయడం తో బేరర్ నిష్క్రమించాడు.కాసేపు సమయం పై మౌనం స్వారీ చేసింది. నిశ్శబ్ద తరంగాల్ని చెదరగొడుతూ టేబుల్ పై నువ్వు దరువేస్తుంటే ఆమె - "శేఖర్ కూడా అచ్చం ఇలాగే దరువేసేవాడు" అంది.
"శేఖర్ పోయి ఇన్నాళ్ళైనా అతనింకా నీకు గుర్తున్నాడా ? " - అడగకూడని ప్రశ్న అడిగి తప్పు చేశావు.
"ఏం ? నీకు నీరజ గుర్తులేదా ? " ఆమె ఈ ప్రశ్న నిన్ను అడుగుతుందని నీకు తెలుసు.
"ఎందుకు గుర్తులేదు ? ఆమె వున్నన్ని రోజులూ నా జీవితం చాలా కలర్ ఫుల్ గా ఉండేది. దురదృష్టవశాత్తు ఆమె నాకు దూరమైంది. ఆ తరువాతే నువ్వు పరిచయమయ్యావు. నీలో ఆమెను వెతుక్కుంటున్నాను " - వెర్రిగా నవ్వావు.
"నాకు కూడా అంతే ! శేఖర్ కూడా అచ్చం నీలాగే ఉండేవాడు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది శేఖర్ చనిపోలేదు, నీరూపంలో బ్రతికే ఉన్నాడని" అనురాగం నిండిన ఆమె చూపులు నీ గుండెల్లో నాటుకున్నాయి.
"అందుకే మనం పెళ్ళి చేసుకోవాలి. మనం కోల్పోయిన ప్రేమను మళ్ళీ పొందాలి" నీ చేయి ఆమె చేతిని సుతారంగా నిమిరింది.
"మరి మన ఇళ్ళల్లో ఒప్పుకోవడంలేదు !" అమాయకత్వం నింపుకున్న ఆమె కళ్ళు నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నయి.
"ఒప్పుకోకపోతే పోనీ.. మన అవసరాలు వాళ్ళకు అక్కర్లేకపోతే వాళ్ళూ మనకు అక్కర్లేదు" నిశ్చయంగా ధ్వనించిన నీ గొంతులో ఏదో చిన్న వణుకు.
ఆమె ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీ బేరర్ చేతుల్ని రెక్కలుగా చేసుకుని వచ్చి నీ టేబుల్ పై వాలింది.
"శేఖర్ కు కూడా నీలాగే కోపం ఎక్కువ. కానీ మనసు మంచిది. నీకంటే ముందు నన్ను అతను ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేదు" కాఫీ సిప్ చేస్తూ అంది.
"మా ఇంట్లోనూ అంతే ! నీలాగ నన్నెవరూ ప్రేమించలేదు. అందరికీ నేను తెచ్చే డబ్బే కావాలి. నేను తిన్నానా, లేదా? ఉన్నానా, పోయానా ఎవరికీ అక్కర్లేదు. కనీసం నాతో ఓ ఐదు నిముషాలు మాట్లాడే తీరిక కూడా ఎవరికీ ఉండదు " - కాఫీ లో షుగర్ తో పాటుగా కోపాన్ని కూడా కలుపుతూ చెప్పావు.
"రేపు మన పెళ్ళయ్యాక నా మీద కూడా ఇలాగే కోప్పడతావా? " ఆమె సందేహం సబబుగానే తోచింది నీకు.
"చ!చ! నీ మీద ఎందుకు కోప్పడతాను?నీతో చాలా సరదాగా ఉంటాను. వారానికి రెండు సినిమాలు చూద్దాం.రోజు విడిచి రోజు రెస్టారెంటుకు వెళ్దాం.నెలకోసారి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్దాం" - ఆమె ఇష్టంతో పనిలేదన్నట్లు చెప్పుకుంటూ పోతున్నావు.
"సరే నీ ఇష్టం. కానీ నువ్వు స్మోకింగ్ మానెయ్యాలి. ఆదివారం మాత్రమే వోడ్కా తీసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. నా వంట ఎలా ఉన్నా మెచ్చుకుంటూ తినాలి" ఆమె స్వరంలో అధికారం ధ్వనించడం నీకు నచ్చింది.
"సరే మేడం ! నువ్వు ఎలా చెప్తే అలా ! రోజూ నువ్వు నీ సీరియళ్ళు చూసుకోవచ్చు, కానీ క్రికెట్ మేచ్ వచ్చినప్పుడు మాత్రం నీకు నేను రిమోట్ ఇవ్వను. ఇంతకీ మనం ఏ టి.వి. కొందాం? కొత్తగా వస్తున్న ఎల్.ఈ.డి. కొందామా ?" - ఆమె సమాధానం కోసం నీ చెవులు ఎదురుచూస్తున్నాయి.
"ఆలు లేదు, చూలూ లేదు అన్నట్లుగా అప్పుడే టి.వి. గురించి ఎందుకు?" - ఆమె తీయ్యగా విసుక్కుంది.
"ఆలి ఉంది. ఆ రెండోది కూడా.." మిగిలిన వాక్యం పూర్తి చెయ్యకుండా కాఫీ తో పాటు మింగేసావు.
"చి చి.. సిగ్గులేకపోతే సరి. పెళ్ళీడుకొచ్చిన మనవలను ఇంట్లో పెట్టుకుని కూడా ఇలాంటి ఆలోచనలేవిటో... !" నువ్వు మర్చిపోయినా , ఆమె నీ వయసును గుర్తు చేసింది.
"అబ్బా! అక్కడికి తమరేదో యవ్వన ప్రాదుర్భావ దశలో ఉన్నట్లు! నీకు ఇంజినీరింగు చదువుతున్న ముగ్గురు మనవరాళ్ళున్నారన్న సంగతి గుర్తులేదేమో !" ఆమెను ఉడికిద్దామన్న నీ ప్రయత్నం ఫలించింది.
కాఫీడే లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్నే చూస్తున్నారన్న విషయం నువ్వు గమనించలేదు. నీకు అక్కర్లేదు కూడా. ఆమెతో ఉన్నంత సేపు ఆమె ప్రేమను అనవతరంగా పొందాలన్న ఆబ నీది.
" ఏవిటో ! మన రోజుల్లో కాఫీ చల్లారిపోతే డబ్బులిచ్చే వాళ్ళంకాదు. ఈరోజుల్లో డబ్బిచ్చి మరీ కోల్డ్ కాఫీ కొంటున్నాం. హా ! హా! హా! " నీ హాస్య చతురతకు ఆమె పెదవులు విచ్చుకున్నాయి.
"ఇంక వెళ్దామా ? తొమ్మిది కావస్తుంది " బిల్ కట్టేసి ఆమె వాచీ చూసుకుంది.
రెండు మూడు గంటలుగా కూర్చోవడం మూలాన నీ కాళ్ళు పట్టెసినా నెమ్మదిగా లేచి నిల్చునే ప్రయత్నం చేసావు. నీ నడక మొదలైంది. ఊతం లేనిదే నీవు నడవలేవు. ఒక చెయ్యి నీ చేతి కర్ర మీద, రెండవది ఆమె భుజం మీద! నీ నడక సాగుతుంది. నీదే కాదు, తోడున్న ఏ నడకా ఆగిపోదు.

                                శతమానంభవతిః

4, ఆగస్టు 2014, సోమవారం

సూక్ష్మం(కవిత)

ఘనమైనది గా ఏదైనా కనిపించినావినిపించినా అనిపించినా...
దాని అంకురం చిన్నదిగానే మొదలై ఉంటుంది.
బాంబు విస్ఫోటనం అణువు లో మొదలైనట్లు...
నీలాంబరాన్ని చుంబించే ఎత్తైన కృతికి కూడా.. వేడెక్కే బుర్ర లోపురుడు పోసుకునే చిన్న ఆలోచనే మూలం... 
మనసును మీటే గానమై రూపాంతరం చెందిన రాగమేదైనప్పటికి...
ఆర్ద్రత నిండిన గొంతులోనే మూర్చనలద్దుకుంటుంది... 
హిమవత్పర్వత శిఖరాన్ని ముద్దాడి పాదం తన తొలి అడుగు మాతృగర్భపు గోడలపై ముద్రించుకుంటుంది….
ఖండాంతరాలు దాటి విస్తరించే ఖ్యాతికి నిలబడి చప్పట్లు చరిచే చేతులక్కర్లేదు... 
చూపులతో ఆత్రంగా భుజం తట్టగల వివేక నేత్రాలు చాలు!
(ఆగస్టు 2014 కౌముది పత్రికలో ప్రచురితం)

7, జూన్ 2014, శనివారం

రెక్కలు (కధ)

                                    రెక్కలు

                  (25/5/2014 ఈనాడు ఆదివారం అనుబంధం ప్రచురితం)

                                     

   

         
నా పడకగది ప్రశాంతంగా వుంది. గదిలో నా ఆన లేనిదే గాలి అంగుళం కూడా కదలదని కించిత్ గర్వం నాదిఅప్పుడే స్నానం చేసి, కాటన్ చీర కట్టుకొని నా గదిలోకి అడుగిడింది సునందతడిసిన కురులను ఆరబెట్టుకునేందుకు పూనుకుని, స్విచ్ బోర్డ్ లో 'ఫాన్' అని రాసి వున్న స్విచ్ ఆన్ చేసింది - మనిషి మీట నొక్కితే చచ్చినట్లు తిరగవలసిన పంఖాను నేనని గుర్తు చెస్తూ.
          మనదంతా నైట్ డ్యూటీనే. పగలు అట్టే తిరగవలసిన శ్రమ వుండదు. భర్త రోజంతా బ్యాంకులో శ్రమిస్తుంటే, ఈవిడ హాల్లో సీరియల్ వీక్షణలో తరిస్తూ, అక్కడ మా అన్నయ్యను ఫుల్ స్పీడ్ లో తిప్పుతూ వుంటుంది.
          రెండేళ్ళ క్రితం కొత్తపెళ్ళికూతురిలా ఇంట మెట్టిన సునంద, నేడు నిండు గర్భిణి. ఇన్ని లక్షల జీవరాశుల్లో మానవ జన్మంత మహోత్కృష్టమైనది మరొకటి లేదనిపిస్తుంది. అందునా స్త్రీగా పుడితే మాతృత్వపు మధుర ఫలాలు 'కడుపారా' ఆస్వాదించవచ్చును కదా! ఇలా ఫాన్ గానో, కూలర్ గానో వుండే కంటే ఇంతిగా పుడితే "పుట్టే" ఆనందం అంతా ఇంతా కాదేమో! మనుషుల కోర్కెలు తీర్చడం లో తలమునకలై వున్న వేలుపులందరూ వేలుసైగతో తిరిగే నా వేదన వింటారా ?
          పుట్టబోయే బిడ్డకోసం ఆమె పడే ఆరాటం అనుపమానం.నాకుకూడా బుజ్జిగాడిని వీలైనంత తొందరగా చూడాలని ఆతృతగా ఉంది. "నువ్వేంటి కన్నతల్లిలా పరితపిస్తున్నావు? నువ్వు కూడా మాలాంటి వస్తువు మాత్రమే.మనకు బంధాలు, బాధలు ఉండవు" అంటూ గేలి చేశాయి నా మిత్రులైన ఫొటొఫ్రేములు,బీరువాలు,పుస్తకాలు,కంప్యూటరు,రీడింగ్ టేబులు.
          "ఛెస్! మీతో నాకు పోలికేంటి? నేనుకూడా మనుషుల్లా తిరగగలను,శబ్దాలు చేయగలను,గాలి పీల్చుకోగలను,గిలిగింతలు పెట్టనూగలను" అని గదమాయించేసరికి తలదించుకున్నాయి.
                నేను ఎదురుచూస్తున్న రోజు రానే వచింది. సునందమ్మ ఈ ఇంటి వారసుడిని ఎత్తుకుని భర్త సహకారంతో నెమ్మదిగా నడిచి వచ్చి మంచంపై పడుకుని వాడిని పక్కనే వెసుకుంది.
        సప్తవర్ణశోభితంలా ఉన్న ఆ శిశువు సప్తాశ్వరధసారధిలా ప్రకాశిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నన్ను తిరగమని ఆజ్ఞాపిస్తారా..ఎప్పుడెప్పుడు అనురాగంతో వెచ్చగా మారిన నా రెక్కల ద్వారా ఉద్భవించినట్టి మమకారపు సమీరాలతో వాడిని మృదువుగా హత్తుకుంటానా.. అని ఉవ్విళ్ళూరుతుండగా, నా తొందరను గ్రహించిన వాడిలా స్విచ్ ఆన్ చేశాడు సునంద భర్త.
        అచేతనంగా ఉన్న నాలో జవసత్వాలు నింపినట్టి విద్యుత్ కి జోతలర్పిస్తూ, మోటరు మూలల్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుంటూ నా రెక్కలకి పరిమితమైన వృత్తపు గిరి లో గిర..గిర..గిరగిరగిరగిర తూలుతూ, ఊగుతూ,తిరుగుతూ,ఎగురుతూ 'మర' మాతృత్వపు ఝంఝామారుతాలైన  నా ఉచ్వాస నిశ్వాసలు, తూరుపు సింధూరపు ఎరుపు పులుముకున్న వాడి చరణాలను ముద్దిడుతుంటే చరించగలగడం లోని ఘనత బోధపడింది.
        నాటి నుండి నాకు పగలూ రాత్రీ కూడా పని కల్పించాడీ బుడతడు. నేను తిరగనిదే పడుకునేవాడు కాదు. ఎప్పుడైనా చలేసి నన్ను ఆపితే వెంటనే కళ్ళు తెరిచి ఆరున్నొక్క రాగం లో గానం చేసి నేను మరలా తిరిగే దాక ఆపేవాడు కాదు. నా రెక్కల సడే వాడికి జోల. వాడికి "రవి" అని నామకరణం చేసారు. శతకోటి సూర్యసమప్రభలతో ప్రజ్వలించే నా చిన్ని తండ్రికి ఈ పేరు అతికినట్లు సరిపొయింది.
        కాలం నాకన్నా పదిరెట్లు వేగంతో తిరుగుతున్నట్లుగా ఉంది. రవికి అన్నప్రాశన, అక్షరాభ్యాసం జరిగిపోయి చాలాకాలం గతించింది.బుడిబుడి అడుగులతో మొదలుపెట్టి లేడిపరుగు తీసేటంతటి వాడయ్యాడు. అత్త-తాతలతో ప్రారంభించి పద్యాలు,పాటలు పాడే చిరు త్యాగరాజు అయ్యడు. వాడి ఉత్సాహం చూసి సంగీతం నేర్పించారు.
        వాడి గాత్రం వర్ణింపశక్యంకాదు. ఆ స్వరకాసారంలో మునిగి తేలవలసిందే! నిన్నకాక మొన్న బడిలో చేరిన పిల్లవెధవ,చూస్తుండగా పదవతరగతి పూర్తిచేసాడంటే ఆశ్చర్యమేస్తుంది.ఆ ఏటికి పదవతరగతి పాసైన వారిలో ఆ పాఠశాలకే మొదటి స్థానంలో నిలిచాడు. ఈ నగరంలో ప్రఖ్యాత కాలేజీ వారు ఉచితంగా ఇంటర్మీడియట్లో సీటు ఇచ్చారు వాడికి.
         ఏడాది గడిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నట్లు సెకండ్ ఇయర్లో లేడనిపిస్తుంది. మునుపటిలా సంగీతం, చదువు పట్ల శ్రద్ద లేదు.ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ లో మాట్లాడుతూనో లేదా చాట్ చేస్తూనో ఉండేవాడు. తల్లైనా,తండ్రైనా గదిలోకి వస్తే మాత్రం చదువుతున్నట్లు నటించేవాడు.వాళ్ళటు వెళ్ళగానే మరలా  సెల్ఫోన్ చేబుచ్చుకునేవాడు. అమ్మానాన్నలకు ఎంతో గౌరవమిచ్చే రవి, ఇప్పుడు వాళ్ళు ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నాడు. అమ్మ జాగ్రత్తలు చెప్తుంటే చిరాకుపడుతున్నాడు. నాన్న మాటకి ఎదురు చెప్తున్నాడు.
        ఏమైంది వీడికి ? పుస్తకం పట్టుకుంటాడే గానీ చదవడం లేదు. శ్రీరాగంలో "ఎందరో మహానుభావుల"ని ఎన్నాళ్ళైంది ? రీడింగ్ టేబుల్ పైన రాబిన్ శర్మ, జాన్ గ్రీషం, జఫ్రీ ఆర్చర్ల దగ్గర్నుండి మన ఆరుద్ర,శ్రీపాద, శ్రీశ్రీ వరకు..." మా జోలికొచ్చి ఎన్నాళ్ళైందోయ్ ?" అని అడుగుతున్నట్లున్నారు. ఇది కుర్రాళ్ళందరికీ సహజంగా ఈ వయసులో దాపురించే వికారానికి పరాకాష్టా?
        ఎలాగో ఒకలా చదివి మొత్తానికి మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. చదువు మీద అంత దృష్టి పెట్టకపోయినా వాడికి సహజాతమైన తెలివికి చక్కటి ర్యాంకు, తద్వారా పెద్ద కాలేజీలో మెడిసిన్ సీటు సాధించాడు. రవి తల్లిదండ్రులు "మా కొడుకు డాక్టర్ కాబోతున్నాడ"ని ఊరంతా టముకు వేస్తే, నేను గదంతా చప్పుడు చేసాను వాళ్ళకు ఏవీ తక్కువకాకుండా.
      ముందుగా మొక్కుకున్నట్లు కుటుంబమంతా శ్రీవారి దర్శనానికి వెళ్ళి, నాకు ఓ నాలుగు రోజులు సెలవిచ్చి ఈరోజే వచ్చారు. ప్రయాణపు బడలిక వల్ల కాబోలు వచ్చీరాగానే స్నానాలు,టిఫిన్ లు కానిచ్చి తలో మంచం ఆక్రమించారు. కాసేపు సేదతీరాక సునంద దంపతులిద్దరూ ఊళ్ళో బంధువర్గానికి ప్రసాదం పంచడానికి బయలుదేరారు. వాళ్ళటు వెళ్ళగానే రవి విషణ్ణ వదనంతో గదిలోకి వచ్చి మంచం పై పడుకున్నాడు.
        ఐదు సెకన్లకు ఒక తడవ సెల్ చూసుకుంటున్నాడు. పది సెకన్లకు ఒకసారి ఏదో నంబరు డయల్ చేసి అవతల పార్టీ 'బిజీ' అన్న మాట విని అసహనంగా మంచానికేసి చెయ్యి కొట్టుకుంటున్నాడు. రెండు గంటలసేపు అదే తంతు. అప్పుడొక మెస్సేజ్ వచ్చింది. అది చదివిన మరుక్షణం వాడి దుఖం కట్టలు తెంచుకుంది. దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చాడు. తల గోడకేసి బాదుకున్నాడు, పాలు గారే బుగ్గలను గోర్లతో గీరుకున్నాడు.వాడి ఏడుపుకి తలగడ తడిసి ముద్దయ్యింది. విసురుగా ఫాన్ స్విచ్ వేసినా కరంటుకోత మూలాన తిరగలేకపోయాను.
        "ఏమైంది నాన్నా...ఎందుకు బాధ పడుతున్నావ్...నాతో చెప్పుకోరా" అని నేను అడుగుతున్నా నా యాంత్రిక భాష వీడికి అర్ధంకాదు కదా. ఓ గంటసేపు వాడి రోదన నిరాటంకంగా సాగింది. తరువాత ఒక స్థిరనిశ్చయానికి వచ్చిన వాడిలా నావైపు చూశాడు. మంచంపైన ఉన్న దుప్పటి తీసి నా మెడకు చుట్టాడు. నాకు ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపు రెండో అంచు వాడి మెడకు చుట్టుకుని గాల్లో వేలాడడానికి ఉద్యుక్తుడయ్యాడు. నాకే గనక గుండె ఉండుంటే అది ఈపాటికి ఆగి ఉండేది. నా రవి నా మెడకే ఉరి బిగించుకుని గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం కోసం పెనుగులాడుతుంటే తట్టుకోలేక ఏడుస్తున్నాననడానికి నేను ఊగుతూ చేసే ఇనుప రోదనే సాక్షి. నాకే గనక చేతులుంటే వీడ్ని అమాంతంగా కిందకి విసిరేద్దును.
        ఎంత ధైర్యం వీడికి. ఇన్నాళ్ళు ఎంతో అపురూపంగా పెంచిన తల్లిదండ్రులు వీడికి గుర్తులేరా? భయంకరమైన జబ్బులతో బాధపడే రోగులు, రేపోమాపో రాలిపోయే వృధ్ధులు,వికలాంగులు,రోడ్డుపై బ్రతుకీడుస్తున్న నిరుపేదలు బ్రతకడానికి తాపత్రయపడుతుంటే అన్నీ ఉన్న వీడు మాత్రం మొగ్గలోనే రాలిపోతాడా? అదికూడ నా సహకారంతోనా? ఇందుకేనా వీడికి ఇన్నాళ్ళు సేవలు చేశాను? వీళ్ళేదు..ఎలాగైనా రవిని కాపాడాలి.లేదంటే వీడిపై నాకున్న ప్రేమ ఓడిపోయినట్లే. ఏదో ఒకటి చేసి కాపాడాలి. కానీ ఏం చేయగలను?
        ఒక్కటే మార్గం. వాడు వేలాడుతున్న రెక్క తెగి కిందపడితే బతుకుతాడు. నా రెక్క తెంచుకోడానికి నేను సిద్ధం. కానీ తెగేది ఎలా? ఇంతలో కరెంటు వచ్చింది. దేవుడనేవాడు ఒకడున్నాడని మనుషులందరూ ఎందుకు నమ్ముతారో నాకిప్పుడు అర్ధమయ్యింది.ఇంతసేపు ఎలా తిరగగలనో అని మధనపడుతున్న నాకు ఈ విద్యుత్తు ఆలంబననిచ్చింది. కానీ రవి బరువు వల్ల తిరగలేకపోతున్నాను.
        రవిని ఎత్తుకొని తిరగడానికి అంతర్గతంగా ఉన్న శక్తినంతటినీ క్రోడీకరించి మెల్లగా నడక మొదలుపెట్టాను. తిరగడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే నా రెక్క బలహీనపడసాగింది. కన్నపేగు తెంచుకుని మాతృగర్భం నుండి బయటపడిన శిశువులా, నా రెక్కతో పాటు మంచం మీదపడ్డాడు రవి. నా ఆనందం అర్ణవమైంది. నా రెక్క తెంచి పునర్జన్మనిచ్చి రవిని కాపాడుకోగలిగానన్న స్పృహవల్ల కలిగిన అనుభూతి అనిర్వచనీయం. ఇకనుండి నేను కూడా వీడి తల్లినేనని నా బాహుద్వయంతో వృత్తాకారంలో తిరిగి ప్రకటిస్తూ మురిపెంగా వాడిని చూసుకున్నాను.
        వాడి కళ్ళల్లో చావుభయం ప్రస్ఫుటమైంది. వణికే చేతులతో మెడచుట్టూ బిగుసుకున్న దుప్పటిని తొలగించుకున్నాడు. మృత్యుముఖం నుంచి బయటపడ్డ మార్కండేయుడిలా గోచరిస్తున్నాడు రవి.పశ్చాత్తాపానికి లోనౌతున్నట్లుగా కనిపిస్తున్నాడు. మళ్ళీ ఇలాంటి పిచ్చిపని చెయ్యనన్నట్లు ఓ నిట్టూర్పు తీసి నీళ్ళునమిలాడు.
        ఇంతలో అక్కడికి వచ్చిన సునంద,గదిలో భీకర వాతావరణాన్ని పరికించి 'ఏమైంద'న్నట్లు కళ్ళెగరేసింది. తల్లిని చూడగానే ఉబికివస్తున్న కన్నీళ్ళతో అమాంతంగా ఆమెను చుట్టేసి గుండెలవిసేలా ఏడ్చాడు. "అమ్మా క్షమించమ్మా...ఇంకెప్పుడూ..." వాడిని పూర్తిచేయనివ్వకుండానే "పిచ్చి సన్నాసి...ఫాన్ రెక్క విరిగి మీద పడినంత మాత్రాన ఇంతలా బెదిరిపోయావా? ఎప్పుడో మీ నాన్న చిన్నప్పటి ఫాన్...ఏమండీ...ఈ బొక్కి ఫాన్ పీకెయ్యమంటే మీరు వినలేదు.ఇప్పుడు చూడండి, బాబు ఎంతలా బెదిరిపోయాడో" అని భర్త మీద అరిచి, రవికి నీళ్ళు తాగించడానికి వాడిని తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది.

        "దానికేమోయ్..ఇప్పుడే పీకేస్తాను. నాన్నా రవీ..నీళ్ళు తాగాక స్టోర్ రూంలో ఉన్న టూల్ కిట్ తీసుకురా దీని సంగతేంటో తేల్చేద్దాం" అన్నాడు నావైపు గుడ్లురిమి చూస్తూ.
        అప్పటికే స్విచ్ ఆపేయడం మూలాన నెమ్మదిగా నీరసిస్తూ చలనంలేని స్థితికి చేరుకుని రవి రాకకై ఎదురుచూడసాగాను బార్లా చాచిన రెక్కలతో.
                               **************************