ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, ఆగస్టు 2017, బుధవారం

మెహర్

మెహర్ (కథ)

            (విపుల ఫిబ్రవరి 2017 ముద్రితం)

          

           ప్రస్తుతాన్ని వర్ణిస్తే అది వార్త...
              ఇంకా జరగనిది ఊహించి రాస్తే అది కధ...
             ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇంకా గుర్తుపెట్టుకుంటే అది చరిత్ర !
         ప్రస్తుతంలో జీవిస్తే ఏదో ఒక కాస్మిక్ గ్లామర్ మిస్ అయినవాళ్ళం అవుతాం.
            అంజనాల మసిలో మనం వెతుక్కునే భవిష్యత్తు దివ్యంగా ఉండాలని కోరుకోవడం మన భ్రమ !
            ఏతా వాతా చరిత్రే కొంచం రస్టిక్ గా, చెదలు పట్టినా యోగిక్ గా, యునీక్ గా ఉంటుంది.
            జరుగుతుందో లేదో తెలియని విషయం గురించి ఆలోచించే కంటే ఖచ్చితంగా జరిగిన చరిత్రను గమనిస్తే మన గమనానికి ఉపయోగపడొచ్చునన్నది ప్రాజ్ఞుల అభిప్రాయం.
           జాగ్రత్తగా వెతకాలే గానీ చరిత్రలో మనకి సాజిద్ లాంటి చురుకైన కుర్రాళ్ళు ఎంతో మంది దొరుకుతారు. వాళ్ళంతా యమునా తీరంలో పడవ నడుపుతూ.. ఉత్తర దక్షిణ తీరాల మధ్య దూరాల్ని తెడ్డుతో కొలవ గల సమర్ధులు. కానీ వాళ్ళందరి జీవితాల్లోకి తొంగి చూడడం సభ్యత అయినా కాకపోయినా సాధ్యపడదన్న విషయం మాత్రం వాస్తవం. వాళ్ళందరికీ సాజిద్ ఒక ప్రతినిధి అనుకుంటే గొడవేలేదు !
                ఖుదా ఇచ్చిన రెక్కల కష్టం మీద బ్రతికేవాడు సాజిద్. నిండా పద్దెనిమిదేళ్ళైనా ఒంటిమీదకి రాకపోయినా కష్టాలకు రొమ్ము చూపగల తెగువ వయసులో ఉంటుంది. సాజిద్ వాళ్ళ అబ్బాజాన్ తాపీ పని చేస్తుంటే సాజిద్ మాత్రం పనిలో మజా లేదంటాడు. తన అమ్మీజాన్ పోయినా ఆటూ పోటూ నేర్పిన యమునా నదే తన తల్లి అంటాడు. తన పడవలో ప్రయాణీకులను ఒడ్డు నుండి ఒడ్డుకు ఒడుపుగా దాటించగల నేర్పు కల వాడు. ప్రయాణీకులు ఇచ్చే సొమ్ము ఎంతో కొంత తీసుకుని రోజులు వెల్లబుచ్చేవాడు. ఎన్నాళ్ళిలా పడవ నడుపుకుని సంపాదిస్తాడు ? తాపీ పని చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందని ఎంత పోరినా వినకపోయేసరికి అతడికి నిఖా చేస్తేనైనా బాధ్యత తెలుస్తుందని సాజిద్ కి తగిన దుల్ హన్ కోసం వెతకడం మొదలు పెట్టాడు వాళ్ళ అబ్బాజాన్. వెతికే క్రమంలో అతనికి సలీమా తారసపడడం సాజిద్ చేసుకున్న అదృష్టం.
                యమునా నదిలో పడవ నడిపే పనిలో తప్ప మరి విషయంలోనూ అబ్బాజాన్ మాటకు ఎదురుతిరిగి ఎరుగని సాజిద్,సలీమాతో నిఖాకి సరేనన్నాడు. పైకి ఏదో తండ్రి మాటకి గౌరవమిచ్చేవాడిలా తలూపాడు గానీ సలీమా లాంటి అందగత్తె అతనికి ఎక్కడ దొరకాలి ? మాటకి వస్తే తను మాత్రం తక్కువ వాడేం కాడు. యువరాజు ఖుర్రం ఖాన్ లాగ సోగకళ్ళ వాడు. సలీమా కూడా అతడ్ని చూసిన తొలిసారి అలాగే అనుకుంది. యువరాజు ఖుర్రం వలె రాజఠీవి ఉట్టి పడుతున్న మగాడు మొగుడుగా దొరుకుతున్నాడన్న ఆనందంలో గుల్ మోహర్ పువ్వులా నవ్వింది.
                యమునా నది తరగలపై నిండు పున్నమిలా పరుచుకున్న నవ్వుకి వివశుడైన సాజిద్, మెహర్ (మహమ్మదీయుల పెళ్ళిళ్ళలో వధువుకు వరుడు ఇవ్వవలసిన కట్నం) ఎంత ఎక్కువైనా పర్వాలేదనుకున్నాడు. మొదటి విడత ము-అజ్జల్ (మెహర్ లో మొదటి భాగం) ఇచ్చిన తరువాత జరిగిన సాజిద్,సలీమాల నిఖా ఇరుకుటుంబాలలోనూ దీప శిఖల వెలుగులు నింపింది.
                                                                ********************
                పెళ్ళికాక ముందు యమునా నదే తన జీవితంలా బ్రతికిన సాజిద్ కు, పెళ్ళయ్యాక సలీమాతో యమునాయానం జీవితమైపోయింది. అర్ధరాత్రులు తెప్పలో ఆమెను కూర్చోబెట్టుకుని నదిలో తిప్పేవాడు. అతని సునిశిత చూపులనుండి ఆమెలో దాగిన యమున తప్పించుకోలేక పోయింది.
                 అతడు కసురుకుంటే ఆమె అంగూర్ కళ్ళలో యమునోత్రి పాయల తడి, కన్నీరుగా కారుతుంది...
                ఆమె నిశ్వాసలలో యమునాతటి పిల్ల వాయువుల వీవన గాడ్పు అతడికి వెచ్చగా తగులుతుంది...
                ఆమెవి పలుకులు కావు.. మధురానగరిలో యమునాలహరులు..
                అవి పరుగులు కావు.. నటనమైన కాలింది నడకలు..
                రాత్రికాలాలను త్రాగి మురిసే హృదయంగమ మృదంగాలు కావు అవి రాతిగోళాలను తాకి ఎగసే ఉత్తుంగ తరంగాలు..
                ఆమె తలపుల మునుకలు.. సద్గంగా సంగమ సరిగంగ మునకలు !
                అతడు కనిపించిన ప్రతి రాతి పై ఆమె పేరుని ఇబారత్ గా చెక్కలేకపోవొచ్చు...
          అతడు ఒమర్ ఖయ్యూంలా రుబాయత్ చెప్పలేకపోవచ్చు...
          కానీ ఆమెపై అతడికున్న ప్రేమను వ్యక్తపరచడంలో ఏ కళాకారుడూ అతడికి సాటిరాడు !
                                      ******************
                కాల ప్రవాహం నదీ ప్రవాహం కన్నా వేగమైనది.. సంవత్సరాలు నీటి అలల్లా దొర్లిపోయాయి.. ప్రవాహంలో చాలా మారాయి. యువరాజు ఖుర్రం మహారాజై ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయాడు, సాజిద్ వాళ్ళ అబ్బాజాన్ చనిపోయి ఆకాశానికన్నా పైకి పోయాడు ! సాజిద్ కుటుంబం అతడి సంతానంతో కలువల కొలనులా వికసించింది. సలీమాలో మునుపటి సౌకుమార్యం పోయింది. ఇన్ని మారినా మారనివి రెండే రెండు.. యమునా నది, నది పై బ్రతుకుతున్న సాజిద్.
                దక్షిణ గట్టు పైన మహారాజు గారు ఏదో నిర్మాణం మొదలుపెట్టి చాలా కాలం అయ్యింది. పనివాళ్ళకు డబ్బులు కూడా బాగానే ముడుతున్నాయని ఎక్కడెక్కడి నుంచో  శ్రామికులందరూ పని చేయడానికి వస్తున్నారు. సంవత్సరాల తరబడి నిర్మాణంలో జాప్యం జరుగుతుందని మహారాజు గారు విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. తాపీ పని తెలిసిన వాళ్ళందరూ పనిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నాళ్ళని పడవని నమ్ముకుని బ్రతుకుతాం ! తాపీ పనికి వెళ్తే చేతిలో నాలుగు రాళ్ళాడతాయి. కొన్ని రాళ్ళు వెనకేసుకోవచ్చని సలీమా చెప్తే... తాపీ పనికి వెళ్తే నిజంగా మిగిలేది రాళ్ళే అని వెటకారం ఆడేవాడు సాజిద్.
                అన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఏమీ అని ఎరుగని సలీమా మాటు ఊరుకోదల్చుకోలేదు. ఇన్నాళ్ళుగా పడవ నడిపి పస్తులున్నది చాలు, ఇకనైనా తాపీ పనికి వెళ్ళమని గట్టిగా చెప్పి ఉంటుంది. అప్పటికీ సాజిద్ మాట వినకపోతే మెహర్ లో భాగంగా తనకు రావలసిన మువజ్జల్ (మొదటి విడతను మినహాయించగా రావల్సిన డబ్బు) ఎప్పటికిస్తావని నిలదీసి ఉంటుంది. ఏదైతేనేం.. మొత్తానికి పనిలో చేరడానికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు సాజిద్. ఇంత అయిష్టతలోనూ అతడికి స్వాంతన చేకూర్చే విషయం ఎంటంటే నిర్మాణం దక్షిణ గట్టు ఒడ్డున కాబట్టి రోజూ పడవలో వెళ్ళి పడవలో రావచ్చు. తన పడవలోనే పనివాళ్ళను తీసుకుని వెళ్తే వాళ్ళిచ్చే నాలుగు రూకలు.. కూలికి అదనం.
                తాపీ పని పెద్దగా అలవాటు లేకపోయినా, బాగా అలవాటున్న జమాజెట్టీల్లాంటి కూలీలు కూడా విస్తుపోయే వేగంతో పని చేసేవాడు సాజిద్. కష్టం ఊరికే పోలేదు. సలీమా చెప్పినట్లే చేతిలో నాలుగు రాళ్ళాడేవి. పిల్లలకీ, సలీమాకి కుర్తాలు,పైజమాలు కొనేవాడు. సరైన సమయంలో సరైన సలహా ఇచ్చిన భార్య తెలివితేటల్ని అతడు మెచ్చుకోని రోజంటూ లేదు.
                రోజు రాజస్థాన్ నుంచి వచ్చిన పాలరాయి నీ బుగ్గలకన్నా తెల్లగా ఉందని ఆమెను ఆటపట్టించి.. ఆమె అలిగితే చూసి ఆనందించేవాడు. మళ్ళీ అతనే .. ఐతే అవి అలిగలేవు, అలిగినా నీ బుగ్గల్లా ఎర్రగా మారనూలేవు అని నవ్వించేవాడు.
                                                                ********************
          పని చేస్తున్న కొద్దీ పనిలోని సౌందర్యం అర్ధమయ్యిందతనికి. ఒక భవనాన్ని నిర్మించడంలో పాలుపంచుకుంటే కలిగే ఆనందం పరాకాష్ఠకు చేరింది.
                సలీమా మెడలో మోతీ హారాన్ని సవరిస్తూ భవనం యొక్క గోపుర ప్రభల గురించి వర్ణించే వాడు. మనం కూడా డబ్బులు కూడబెట్టి మన స్థాయికి తగ్గట్టు ఒక ఇళ్ళు కట్టుకుందామనే వాడు. అలా ఎప్పటికైనా ఒక ఇళ్ళు కట్టగలిగితే అదే నువ్వు నాకిచ్చే మెహర్ అని సలీమా అనేది. తను చనిపోయేలోపు భార్యకోరిక తీర్చాలనుకున్నాడు సాజిద్. మెహర్ ని ఇస్లాం సాంప్రదాయంలో పెట్టడం వెనుక ఉద్దేశ్యం కూడా అదే ! అనుకోని కారణం చేత భర్త పోతే.. భార్యకి అతడిచ్చే మెహర్ భర్త పోయాక అక్కరకొస్తుందని.
                                                                ********************
                రోజులు గడుస్తున్నాయి. ఇల్లు కట్టడానికి డబ్బులు పోగవ్వుతున్నాయి. ఖురాన్ పెట్టుకునే రెహాల్ నిలుపుకోవడానికి పాలరాతితో కనీసం ఒక చిన్న మండపం లాంటిదైనా కట్టుకుందామన్న కోరిక పుట్టింది. పాలరాతిని కొనే స్థోమత అతడికి ఎటూ లేదు. అందుకని అర్ధరాత్రులు పడవలో దక్షిణ గట్టుకు వెళ్ళి కాపలాదారుల కళ్ళు కప్పి ఒకటో రెండో పాలరాళ్ళు తెచ్చి దాచుకునే వాడు.
                                                                **********************
                కొన్నాళ్ళకి కొంత డబ్బు, కొన్ని రాళ్ళు పోగయ్యాయి. తన స్థలంలో ఇళ్ళు నిర్మించడమే తరువాయి అనుకున్నతరుణంలో సలీమా కాలం చేసింది. తను ఇళ్ళు కట్టుకుందామనుకున్న స్థలంలోనే తన సలీమాను ఖననం చేసాడు. అతడి కళ్ళలో యమునా నది ఎరుపెక్కి పొంగింది !
                                                                **********************
                సలీమా పోయిన దగ్గర నుంచి అతడికి డబ్బు సంపాదించాలనే ఆశ పూర్తిగా తగ్గిపోయింది. కానీ పనికి మాత్రం వెళ్ళేవాడు. పని చేసి కూలికి బదులుగా చిన్న చిన్న పాలరాతి తునకలు ఏరుకునే ఒప్పందం చేసుకున్నాడు. సాజిద్ కు ఇళ్ళు కట్టుకునే ఆశ, ఉద్దేశం రెండూ లేవు. సంపాదించిన డబ్బు, పాలరాళ్ళతో సలీమా కోసం పాలరాతి సమాధిని కట్టిస్తే అదే ఆమెకు తను ఇవ్వగలిగిన నిజమైన మెహర్ అని భావించాడు.
                                                                **********************
                కొన్ని సంవత్సరాలకు అతడి అవసరం మేరకు పాలరాతిని పోగుచేసాడు. చూసిన వాళ్ళందరూ అతడిది పిచ్చి అనుకున్నారు. కూటికి గతిలేని వాళ్ళకి పాలరాతి సమాధులేంటని హేళన చేసారు. అవేవీ అతడికి పట్టలేదు. అకుంఠిత దీక్షతో సమాధిని నిర్మించడం మొదలు పెట్టాడు. మొదలు పెట్టిన తరువాత ఒకే పెట్టున సమాధిని నిర్మించాడు.
                ఆమె సమాధి కూడా ఆమెలాగే నిర్మలంగా,నిశ్చలంగా,నిష్కలంకంకముగా ఉంది. ఆమె నవ్వుల్లోని పాలనురగ, రాతికి అంటుకొని నగిషీలద్దుకున్నది. సాజిద్ యమునా తీరం వైపు వెళ్ళడం మానేసాడు. రోజంతా సమాధి పక్కన ఉండేవాడు. అక్కడే తిండీ, అక్కడే నిద్ర, అక్కడే సకలం, అక్కడే సర్వం.
                                                                **********************
                ఒక రోజు రాజు గారి భటులు వచ్చి అతడిని తీసుకుపోయారు. చుట్టు పక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కానీ సాజిద్ ఆశ్చర్యపోలేదు ! ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం తను పాలరాతి పలకలను దొంగిలించిన విషయం వాళ్ళకు తెలిసిపోయుంటుంది అనుకున్నాడు. దొంగలకు రాజ్యంలో విధించే శిక్ష ఏమిటో అతనికి తెలుసు ! చేతులు నరికేస్తారు.. అంతే కదా.. అనుకున్నాడు. అతడి లాగే తీసుకురాబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసాక, రాజ్యంలో ఇంతమంది దొంగలున్నారా అని ఆశ్చర్యపోయాడు.
                వాళ్ళందరినీ జాగ్రత్తగా గమనించాక వాళ్ళు కూడా తనతో పాటు యమునా నది దక్షిణ గట్టులో కొన్ని సంవత్సరాలు శ్రమించి భవనాన్ని నిర్మించిన వాళ్ళుగా పోల్చాడు. వాళ్ళందరూ కలిసి నిర్మించిన భవనాన్ని తరువాత తరాల వాళ్ళు "తాజ్ మహల్" గా గుర్తుపెట్టుకుంటారని అతడికి తెలియదు! అతడు నిర్మించిన సలీమా సమాధికి మాత్రం ఎవరూ పేరూ పెట్టలేదు !
                                                                **********సమాప్తం************
               
               
               
               

           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి